Telangana High Court On FTL Lands : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ నిర్ధారణకు అభ్యంతరాలు అడ్డంకి కావని హైకోర్టు తేల్చి చెప్పింది. ఎఫ్టీఎల్ నిర్ధారణ సమయంలో అవి పట్టా భూములై ముంపునకు గురైతే అవి పరిహారానికి అర్హమైనవని పేర్కొంది. అంతేగానీ నీటిపారుదల చట్టం కింద చేపట్టే పనులపై ఎలాంటి క్లెయిమ్ చేయడానికి వీల్లేదంది. చెరువుల ఆక్రమణలను తొలగించే అధికారం రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులకు ఉందని, అంతేగాకుండా చెరువుల శిఖం భూములు, బఫర్ జోన్, ట్యాంక్‌బెడ్‌లను క్రమబద్ధీకరించే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదన్నారు.
వాదనలు : రంగారెడ్డి జిల్లా అంబీర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధి నుంచి తప్పించాలంటూ ఈ నెల ఏప్రిల్ 4న ఇచ్చిన వినతి పత్రాన్ని పరిశీలించేలా ఆదేశాలివ్వాలంటూ శ్రీసాయి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. బాచుపల్లి సర్వే నెం. 171లోని భూమి 2018నాటి సర్వే ప్రకారం ఇది ఎఫ్టీఎల్ పరిధిలోకి రాదని పిటీషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 1981లో ఏర్పాటైన సొసైటీ సర్వే నెం. 175, 171లో 10 ఎకరాలు కొనుగోలు చేసిందని, తాజాగా అధికారులు ఎఫ్టీఎల్ నిర్ధారిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. ఈ భూమి పై హక్కులు నిరూపించుకోవడానికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదన్నారు.
ఎఫ్టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీకి ముందు అభ్యంతరాలు ఆహ్వానించినా, సొసైటీ స్పందించలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రాథమిక నోటిఫికేషన్‌పై అభ్యంతరాలుంటే తుది నోటిఫికేషన్‌కు ముందు సమర్పించవచ్చన్నారు. అన్ని అభ్యంతరాలను పరిశీలించిన తరువాతే ఎఫ్టీఎల్‌ను నిర్ధారిస్తూ తుది నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు.
పిటిషన్‌పై ముగిసిన విచారణ : వాదనలను విన్న న్యాయమూర్తి ప్రజాప్రయోజనంలో ఇదే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల, కుంటల ఎఫ్టీఎల్ నిర్ధారిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తున్నారన్నారు. ఈ ఆదేశాల నేపథ్యంలో ఎఫ్టీఎల్ ప్రాథమిక, తుది నోటిఫికేషన్ల జారీపై ఎలాంటి నిషేధం లేదన్నారు. ఎఫ్టీఎల్ వల్ల ప్రభావితులయ్యేవారు ఎవరైనా ఉంటే తగిన పత్రాలతో అభ్యంతరాలు చెప్పుకొనే అవకాశం ఉందన్నారు. ఈ అభ్యంతరాలు ఎఫ్టీఎల్ నిర్ధారణలోగానీ, ఆక్రమణల నిరోధంలోగానీ, ఆక్రమణల తొలగింపులోగానీ అడ్డంకికావన్నారు.
ఈ ప్రక్రియలో పట్టాదారులు హక్కులపై ప్రభావం ఉంటే ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌లో ముంపునకు గురయ్యే భూమికి పరిహారం అందవచ్చన్నారు. అంతేగానీ ఆక్రమణల తొలగింపు ప్రక్రియను అడ్డుకునే హక్కుగానీ, నీటిపారుదల చట్ట నిబంధనల ప్రకారం ఎలాంటి క్లెయిమ్ కోరజాలరన్నారు. ఈ చట్టంలోని సెక్షన్ 49 ప్రకారం నీటిపారుదల, రెవెన్యూ అధికారులు అక్రమణలు తొలగించే అధికారాలు కలిగి ఉంటారన్నారు. చట్టంలోని సెక్షన్ 47 ప్రకారం ట్యాంక్‌బెడ్‌లు, బఫర్ జోన్, శిఖం భూములను క్రమబద్ధీకరించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. అంతేగాకుండా ఈ భూములకు పట్టాలు జారీ చేయరాదని, పట్టా ఉన్న పరిహారం పొందడం మినహా మరో అవకాశం లేదన్నారు.
ప్రస్తుత కేసులో ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ప్రాధమిక నోటిఫికేషన్ జారీ చేశారని సొసైటీ అభ్యంతం వ్యక్తం చేస్తోందని, అందువల్ల అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పటివరకు అధికారులకు అభ్యంతరాలు సమర్పించని పక్షంలో వెంటనే సమర్పించాలని సొసైటీ, దాని సభ్యుల ఆదేశాలు జారీ చేశారు. ఈ అభ్యంతరాలపై చట్టప్రకారం పరిశీలించి ఉత్తర్వుల ప్రతి అందిన ఆరు వారాల్లోగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను మూసివేశారు.