Whip Ramachandru Naik Appointed as Assembly Deputy Speaker : ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యుడు డా.జాటోతు రామచంద్రు నాయక్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర శాసనసభ ఉప సభాపతిగా అవకాశం కల్పించింది. పార్టీకి ఆయన చేసిన సేవలకు, విధేయతకు గుర్తింపుగా పట్టం కట్టింది. వైద్య వృత్తిలో ఉన్న ఆయన ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వచ్చి 2014లో డోర్నకల్ శాసనసభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరగా పార్టీ 2016లో పీసీసీ సభ్యుడిగా నియమించింది.
ప్రజలకు ఉచిత సేవ చేస్తూ : 2018లో టికెట్ ఇవ్వగా ఆ ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ రామచంద్రు నాయక్ నైరాశ్యం చెందలేదు. కాంగ్రెస్‌ను అంటిపెట్టుకుని క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. వైద్యుడైన ఈయన నియోజకవర్గంలోని నిరుపేదలకు ఉచిత వైద్యం అందిస్తూ గుర్తింపు పొందారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి భారీ మెజార్టీతో విజయం సాధించారు.
డోర్నకల్ ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన డా.జాటోతు రామచంద్రునాయక్‌ను ప్రభుత్వం 2023, డిసెంబరు 15న విప్‌గా నియమించింది. సీఎంకు సన్నిహితుడిగా ఉండే నాయకుడిగా పార్టీలోనూ ఆయనకు పేరుంది. అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన చర్చల్లో పాల్గొని, ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తిన సందర్భంలో ప్రభుత్వానికి మద్దతుగా తన వాదనలు వినిపించి పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించారు.
డోర్నకల్‌కు తొలిసారి శాసనసభ ఉప సభాపతి పదవి : విద్యావంతుడు, వైద్యుడు అయిన రామచంద్రునాయక్‌కు ఎస్టీ (లంబాడా) కోటాలో మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. సామాజిక సమీకరణల్లో భాగంగా అధిష్ఠానం మంత్రి పదవి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉప సభాపతి పదవి ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే అయ్యాక తక్కువ కాలంలోనే ప్రభుత్వ విప్, తెలంగాణ శాసనసభ ఉప సభాపతిగా నియమితులు కావడం ద్వారా రాజకీయాల్లో ఆశించిన గుర్తింపు దక్కినట్లు నేతలు చర్చించుకుంటున్నారు. డోర్నకల్‌కు తొలిసారి శాసనసభ ఉప సభాపతి పదవి దక్కినట్లయింది.
ఆ ఫ్యామిలీలో అందరూ మినిస్టర్సే - కాకా కుటుంబంలో మూడో మంత్రి
ప్లీజ్ మీరు కాస్త అర్థం చేసుకోండి - మంత్రి పదవులు దక్కనివారికి కాంగ్రెస్ బుజ్జగింపులు