Searching Places For Indiramma Houses in Hyderabad : గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో జీ+3 విధానంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం స్థలాల అన్వేషణ ప్రారంభించింది. ఈ మేరకు ‘గ్రేటర్’ పరిధిలోని 16 మురికి వాడల్లో గృహ నిర్మాణ శాఖ స్థలాలను గుర్తించింది. వీటిలో ఐఎస్ సదన్ సమీపంలోని సరళాదేవినగర్, దిల్‌సుఖ్‌నగర్‌లోని పిల్లి గుడిసె ప్రాంతాల్లో ‘జీ+3’ నిర్మాణాలకు ఎలాంటి సమస్యల్లేవని గుర్తించింది. పలుచోట్ల వివాదాలు, స్థానికంగా ఇబ్బందులు ఉన్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. కొన్నిచోట్ల కోర్టు కేసులున్నాయి.
ఈ నేపథ్యంలో మిగతా 14 చోట్ల మరోసారి పూర్తిస్థాయిలో సర్వే చేయాలని నిర్ణయానికి వచ్చారు. రెవెన్యూ, గృహ నిర్మాణ, జీహెచ్‌ఎంసీ అధికారులు కలిసి మరో సర్వేకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ పరిధిలో జీ+3 విధానంలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటే టౌన్ ప్లానింగ్ విభాగం నిబంధనలకు అనుగుణంగా బ్లాక్‌లను నిర్మించాలి. అందుకు తగిన విధంగా ఈ స్థలాలున్నాయా అనేది కూడా అధికారులు పరిశీలించనున్నారు.
మురికివాడల్లో ఒక్కో బ్లాక్ నిర్మాణానికి కనీసం 500 గజాల స్థలం అవసరమని గృహ నిర్మాణ శాఖ యోచిస్తోంది. ఇందులో రోడ్డు, డ్రైనేజీ వంటి వాటికి 150 గజాల స్థలం కేటాయించాలి. ఒక్కో బ్లాక్‌లో 16 ఇందిరమ్మ ఇళ్లు ఉంటాయి.
మరోసారి సర్వే : జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున మొత్తం 84 వేల ఇళ్లను కేటాయించాలన్నది లక్ష్యం. ఇప్పటికే గుర్తించిన మురికివాడల్లో పరిమితంగానే స్థలాలు ఉండడంతో మరోసారి గ్రేటర్ పరిధిలోని మిగతా ప్రభుత్వ, మురికివాడల స్థలాలపై సర్వే చేయనున్నారు. అనంతరం గ్రేటర్ పరిధిలో మొత్తం ఎన్ని ప్రాంతాల్లో జీ+3 బ్లాక్‌లు నిర్మించాలి, మొత్తం ఎన్ని ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయి, అనే విషయమై గృహనిర్మాణ శాఖ నిర్ణయం తీసుకోనుంది.
జిల్లాల్లోని పలు నగరాలు, పట్టణాల్లోనూ మురికివాడల ప్రజలకు జీ+3 విధానంలో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, ఖమ్మం తదితర ప్రాంతాల్లో పేదల బస్తీల్లో అక్కడే ఇళ్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించి, ప్రతిపాదనలను పంపించాలని జిల్లా కలెక్టర్లు, హౌసింగ్ పీడీలను ఉన్నతాధికారులు కోరారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం - పేదల సొంతింటి కల సాకారం
ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామంటే వద్దంటున్నారు!
ఇందిరమ్మ ఇళ్ల పథకం అప్డేట్ - 2.10 లక్షల మంది లబ్ధిదారుల ఎంపిక : పొంగులేటి