Bhadrakali Temple Construction as Elements of Meenakshi Temple : వరంగల్ జిల్లాలోని భద్రకాళి ఆలయ అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలతో తమిళనాడులోని మధురైలోని మీనాక్షి అమ్మవారి దేవాలయం నమూనాలో అభివృద్ధి చేసేలా రూ. 54 కోట్లతో ఇటీవల పనులు ప్రారంభించారు. వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యవేక్షిస్తున్నారు. ఆలయం చుట్టూ మాడవీధుల నిర్మాణానికి రూ.30 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. ప్రత్యేక రోజుల్లో అమ్మవారి ఊరేగింపులు, వాహన సేవలకు ఉపయోగపడేలా 30 అడుగుల వెడల్పుతో మాడవీధుల డిజైన్‌లను ఖరారు చేశారు. ప్రస్తుతం దేవాలయం చుట్టూ మాడవీధుల అభివృద్ధికి ఖాళీ స్థలాలను చదును చేసే పనులు సాగుతున్నాయి.
డీపీఆర్ ప్రభుత్వానికి : మరోవైపు ఆలయం నాలుగువైపులా రాజగోపురాలను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు రూ.24 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. మధురైతో పాటు తంజావూరుకు చెందిన స్తపతులతో త్వరలోనే దేవాదాయ శాఖ ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయనున్నారు. అమ్మవారి విగ్రహం 9 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పుతో పశ్చిమాభిముఖంగా ఉంటుంది. సాధారణ రోజుల్లో 5 వేల మంది భక్తులు దర్శించుకోడానికి వస్తుండగా, ఏడాదికి నాలుగుసార్లు జరిగే ఉత్సవాలు, ప్రత్యేక రోజుల్లో 15 వేల మంది వరకు అమ్మవారిని దర్శించుకుంటారు.
దాదాపు నలుగు సంవత్సరాల తర్వాత పనులు : ఆలయం చరిత్ర అందరికీ తెలిసేలా నిర్మాణాలు ఉండాలని ప్రభుత్వం యోచిస్తోంది. క్రీస్తు శకం 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనానంతరం 625 ఏళ్లు ప్రాభవం కోల్పోయిన ఆలయానికి పునర్వైభవం కల్పించేలా 1948లో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త బీఎస్ గణేశ్‌శాస్త్రీ దాతల సహకారంతో పునరుద్ధరణ చేశారు. 1986లో దక్షిణ భారత ఆలయాల సంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ శిఖరం, మహామండపం, సాలహారాలను నిర్మించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత భద్రకాళి ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
మూలా నక్షత్రం వేళ సరస్వతి అలంకరణలో అమ్మవారు - NAVARATHRI CELEBRATIONS TELANGANA
భద్రకాళి అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు - సహస్ర కలశాలతో అభిషేకం - Badhrakali temple Abhishekam