Telangana Govt Guidelines For Sand To Indiramma House Beneficiaries : ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చివరిదశకు చేరడంతో ప్రభుత్వం ఇసుక సరఫరాపై దృష్టి సారించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన సమీక్షలో ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కొరత రాకుండా చూడాలని, అక్రమ సరఫరా జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొదటి, రెండు విడతలు కలిపి 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని అధికారులు గుర్తించారు. ఈ మేరకు సరఫరా చేయడానికి ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించారు. ఇప్పటికే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. మున్ముందు భారీ వర్షాలు వస్తే వాగులు, నదుల నుంచి ఇసుక తరలింపు కష్టంగా మారుతుంది.
ఆ టోకెన్ చూపిస్తేనే ఇసుక : ఒక లబ్ధిదారుడికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను నాలుగు విడతల్లో సరఫరా చేస్తారు. గ్రామ కార్యదర్శి జారీ చేసే ధ్రువపత్రాన్ని తీసుకెళ్లి తహసీల్దారు కార్యాలయంలో ఇస్తే ఏ వాగు నుంచి ఇసుకను తరలించాలో సూచించి, టోకెన్లను ఇస్తారు. వాటి ఆధారంగా లబ్ధిదారుడే ఇసుకను తరలించుకోవాల్సి ఉంటుంది. రెండో విడతలో 2.28 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. రెండో విడత పనులు ప్రారంభమైతే గ్రేటర్ హైదరాబాద్ మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా 44 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తక్షణ అవసరం ఉంటుంది.
ఇసుకను సరఫరా చేసే ప్రాంతాల లిస్ట్ : ఇసుక అందుబాటులో లేని జిల్లాలకు పక్క జిల్లాల నుంచి సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇసుక సరఫరా చేసే ప్రాంతాల లిస్టును అధికారులు తయారు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్(మంచిర్యాల, నిజామాబాద్), ఉమ్మడి ఖమ్మం(భద్రాద్రి కొత్తగూడెం, స్థానిక వాగులు), ఉమ్మడి వరంగల్(జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సూర్యాపేట, నల్గొండ), ఉమ్మడి కరీంనగర్(రాజన్న సిరిసిల్ల, స్థానిక వాగులు), ఉమ్మడి నిజామాబాద్(రాజన్న సిరిసిల్ల, స్థానిక వాగులు, నిజామాబాద్), ఉమ్మడి మహబూబ్‌నగర్(మహబూబ్‌నగర్, స్థానిక వాగులు), ఉమ్మడి మెదక్(కామారెడ్డి, మహబూబ్‌నగర్), ఉమ్మడి నల్గొండ(నల్గొండ, సూర్యాపేట, స్థానిక వాగులు), రంగారెడ్డి(మహబూబ్‌నగర్, నల్గొండ, రాజన్న సిరిసిల్ల) నుంచి ఇసుక తీసుకెళ్లవచ్చు. స్థానికంగా ఇసుక కొరత ఏర్పడితే రెండో అవకాశంగా టీజీఎండీసీ రీచ్‌ల నుంచి తరలించుకునే వెసులుబాటును కల్పించింది.
ఆ ప్రాంతాల్లో జీ+3 విధానంలో ఇందిరమ్మ ఇళ్లు - స్థలాల అన్వేషణలో సర్కార్!