Godavari - Banakacherla Link : గోదావరి - బనకచర్ల లింక్ సంబంధిత పనులను ఆంధ్రప్రదేశ్ కొనసాగించకుండా ఆపాలని తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదీ యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అనిల్ కుమార్ బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. లింక్‌కు సంబంధించి ముఖ్యమంత్రి, మంత్రి, అధికారులు ఇప్పటికే అభ్యంతరం చెప్పినట్లు లేఖలో పేర్కొన్నారు.
లింక్ కేవలం ప్రాథమిక దశలోనే ఉందని ఇటీవలి జీఆర్ఎంబీ సమావేశంలో ఏపీ అధికారులు చెప్పారని కానీ, అందుకు విరుద్ధంగా ఏపీ ముందుకెళ్తోందని అభ్యంతరం తెలిపారు. పల్నాడు ప్రాంతంలో సర్వే కూడా చేస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయని తెలిపారు. అలాగే నీతి అయోగ్ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించేందుకు ఏపీ సిద్ధమైందని అన్నారు.
లింక్ కు సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ నుంచి లేఖ వచ్చినప్పటికీ గోదావరి బోర్డు తెలంగాణకు కనీసం సమాచారం ఇవ్వలేదని ఆక్షేపించారు. జీఆర్ఎంబీ తన కీలక విధుల నిర్వహణలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. గోదావరి - బనకచర్ల లింక్ విషయంలో ఏపీ ముందుకెళ్లకుండా నిలువరించాలని తెలంగాణ కోరినా, ఇంకా ఎంత మాత్రం ఆలస్యం తగదని స్పష్టం చేసింది. లింక్ ప్రతిపాదనకు సంబంధించి ఎలాంటి సర్వే, టెండర్లు పిలవడం లాంటి ప్రక్రియ చేపట్టకుండా చూడాలని కోరింది. లేఖ ప్రతులను కేంద్ర జలసంఘం, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కూడా పంపారు.
పోలవరం నుంచి ఎత్తిపోతలు వద్దు : గోదావరి బోర్డు, పోలవరం అథారిటీకి రాష్ట్రం లేఖ