TG Govt Focus On Job Notifications : రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి పరిపాలన కసరత్తు మొదలైంది. పలు నోటిఫికేషన్లను వీలైనంత త్వరగా జారీ చేసేందుకు ప్రభుత్వం, నియామక సంస్థలు కార్యాచరణ చేపట్టాయి. గతేడాది (2024-2025) ప్రభుత్వ కొలువులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్‌కు అనుగుణంగా ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనల్లో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారంగా ఉద్యోగ ఖాళీల వివరాలను తెప్పించుకుని, భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. త్వరలో 20 వేలకు (20వేల) పైగా పోస్టులతో జాబ్ నోటిఫికేషన్లు వెలువడే అవకాశమున్నట్లుగా సమాచారం.
బ్యాక్‌లాగ్ పోస్టులు : రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల భర్తీకి ఏటా క్యాలెండర్‌ను ప్రకటించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు 2024-25 ఏడాదికి జాబ్ క్యాలెండర్‌ను జారీ చేసింది. దాని ప్రకారం జాబ్ నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు ప్రభుత్వ విభాగాలు ఖాళీలను గుర్తించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తో పాటు, ఇతర నియామక సంస్థలకు ప్రతిపాదనలు పంపించాయి. అది అమలు చేయనున్న సమయంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఎస్సీల్లోని ఉపకులాలకు న్యాయం జరిగేందుకు వీలుగా వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేవరకు కొత్త నోటిఫికేషన్లను జారీ చేయబోమని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది.
దీంతో గత సెప్టెంబరు నుంచి షెడ్యూలు ప్రకారం వెలువడాల్సిన ఉద్యోగ నియామక ప్రకటనలు నిలిచిపోయాయి. ఏప్రిల్ 14వ తేదీన వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ విభాగాలు ఖాళీల గుర్తింపు ప్రక్రియను మొదలుపెట్టాయి. గతంలో ఇచ్చిన ప్రతిపాదనలు సవరించి పంపించాలని ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధిత విభాగాలకు లేఖలు రాసింది. ఈ మేరకు ప్రభుత్వ విభాగాలు ఎస్సీ ఉపకులాల గ్రూపుల ఆధారంగా సవరణ ప్రతిపాదనలను పంపిస్తున్నాయి. ఉద్యోగ క్యాలెండర్‌లో పేర్కొన్న కేటగిరీల వారీగా గ్రూప్స్, టీచర్, పోలీసు, ఎలక్ట్రికల్, గురుకుల, వైద్య విభాగాల నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది.
బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను కలిపి : బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. గ్రూప్స్‌తోపాటు ఇంజినీరింగ్, గురుకుల, టీచర్ ఉద్యోగ ప్రకటనలు రానున్నాయి. ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలోనే అత్యధికంగా దాదాపు 10 వేల వరకు పోస్టులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ విభాగాలు, విద్యుత్తు సంస్థల్లోని ఇంజినీరింగ్ విభాగాల్లోనూ 2-3 వేల వరకు ఖాళీలు ఉన్నట్లుగా విశ్వసనీయ సమాచారం. గురుకుల నియామకాల్లో దాదాపు 2 వేల పోస్టులు బ్యాక్‌లాగ్‌గా ఉన్నట్లుగా తెలిసింది.
కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం అందించే కోర్సు - పూర్తి వివరాలు చూసేయండి?
ఇస్రోలో ఉద్యోగాలు - భారీగా వేతనం, సదుపాయాలు - 18 రోజులే ఛాన్స్