Telangana Govt Submitted Affidavit to Supreme Court : కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలు ప్రభుత్వానిదేనని, అటవీ భూమి కాదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వివిధ ప్రభుత్వ అవసరాల కోసం బుల్డోజర్ల ద్వారా భూమిని చదును చేయడం వివాదాస్పదంగా మారడంతో జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ కేసును సుమోటోగా తీసుకొని అక్కడి కార్యకలాపాలపై స్టే విధించడం సహా ఐదు అంశాలకు సమాధానమిస్తూ ఈ నెల 16లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
అందుకే చెట్లు పెరిగాయి : సుప్రీంకోర్టు ధర్మాసనం లేవనెత్తిన ప్రశ్నలపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అది ఎప్పుడూ అటవీ భూమిగా లేదన్న సర్కార్, అది పూర్తిగా ప్రభుత్వ భూమే అని వివరించింది. రెండు దశాబ్దాలుగా న్యాయ వివాదం కొనసాగడం సహా ఖాళీగా వదిలేయడంతో చెట్లు పెరిగాయని తెలిపింది. ప్రభుత్వ కార్యకలాపాల విస్తరణకు అది ఉత్తమమైన ప్రాంతమన్న సర్కారు, ఆ భూమిపై ఎలాంటి వివాదం లేదని పేర్కొంది.
ప్రభుత్వం అభివృద్ధి చేస్తే పెట్టుబడులను ఆకర్షించి, వేగంగా ఉద్యోగాల సృష్టికి వీలవుతుందని చెప్పింది. భూమి ఖాళీగా ఉండటంతో చుట్టుపక్కల నుంచి జంతువులు వచ్చిపోతున్నట్లు తెలిపింది. సెంట్రల్ యూనివర్సిటీతో కలిపి ఉన్న 2 వేల ఎకరాల్లో జంతువులు తిరుగుతుంటాయే తప్ప, అక్కడ వాటికి ఆవాసం లేదని వివరించింది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాక వాటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామన్న ప్రభుత్వం, కొట్టేసిన చెట్లు నిషేధిత విభాగంలోకి రావని స్పష్టం చేసింది. అవసరమైతే వాటి కోసం ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి మొక్కలను పెంచుతామని సప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం వివరించింది.
కంచె గచ్చిబౌలి భూములను పరిశీలించిన సాధికారక కమిటీ - నివేదిక సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం
ఆ 400ఎకరాలను వర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయండి - మీనాక్షి నటరాజన్‌కు పలువురి విజ్ఞప్తి