SLBC Tunnel Works Under Dbm Method : నిపుణుల కమిటీ సూచనలకు అనుగుణంగా ఎస్ఎల్బీసీ సొరంగం పనులను ఇన్ లెట్ వైపు నుంచి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ (డీబీఎం) విధానంలో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు.
లైడర్ తరహా సర్వే, పరీక్షలు : ఎస్ఎల్బీసీ చివరి 50 మీటర్ల డేంజర్ జోన్లో ముందుకెళ్లడం కష్టమని, ఇక డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానం తప్ప మరో మార్గం లేదని నిపుణుల కమిటీ ఇటీవల అభిప్రాయపడింది. అందుకు అనుగుణంగానే ముందుకెళ్లాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇంజినీర్లకు స్పష్టం చేశారు. అభయారణ్యం అయినందున 55 డెసిబుల్స్‌కు మించి శబ్దం రావద్దని షరతు ఉంది. ఆ షరతుకు లోబడి పనులు చేసేలా చూడాలని మంత్రి నిర్ణయించారు. ఓ వైపు పనులు కొనసాగిస్తూనే, మరోవైపు జియోలాజికల్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. అరణ్య ప్రాంతంలో భూ ఉపరితలంపై వెళ్లే అవకాశం లేనందున హెలికాప్టర్ సహాయంతో లైడర్ తరహా సర్వే, పరీక్షలు చేయాలని చెప్పారు.
అవసరమైన కార్యాచరణ : మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పరీక్షలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి రేపటిలోగా ఇవ్వాలని ఎల్ అండ్ టీ, ఆఫ్కాన్స్, నవయుగ సంస్థలకు తెలిపారు. పరీక్షలను సీడబ్ల్యూపీఆర్ఎస్, సీఎస్ఎంఆర్ఎస్ సంస్థలు పర్యవేక్షించి, విశ్లేషించనున్నాయి.
ప్రాజెక్టుల్లో పూడికతీత : తమ్మిడిహట్టి వద్ద ఆనకట్ట నిర్మాణం, అంతర్ రాష్ట్ర అంశాలపై కూడా అధికారులు, ఇంజినీర్లతో మంత్రి సమీక్షించారు. 148 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట నిర్మించవచ్చని ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ చెప్పినట్లు తెలిసింది. సంబంధించిన అన్ని అంశాలను పూర్తిగా అధ్యయనం చేసి నివేదించాలని మంత్రి ఉత్తమ్ ఆయనకు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల్లో పూడికతీత అంశంపై కూడా మంత్రి సమీక్షించారు. కడెం, మిడ్ మానేరు, లోయర్ మానేరు జలాశయాల్లో పూడికతీతకు ఆయా సంస్థలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయని ఎస్సారెస్పీ, జూరాల, నాగార్జున సాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉందని ఇంజినీర్లు తెలిపారు.
SLBC లేటెస్ట్ అప్డేట్ - ఆ పరీక్షలు చేశాకే సొరంగం పనులు
SLBC టన్నెల్ అప్డేట్ : ఆ విడిభాగాలు వచ్చాకే ఔట్లెట్ పనులు