New Ration Card Update in Telangana : తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక ఏళ్ల తరబడి నుంచి అపరిష్కృతంగా ఉన్న కొత్త రేషన్ కార్డుల మంజూరీకి తెరలేపింది. అయితే కొత్త కార్డుల మంజూరులో చోటుచేసుకున్న తప్పిదాలు లబ్ధిదారులకు సమస్యలు తెచ్చిపెట్టాయి. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రెండేళ్ల చిన్నారులకు రేషన్ కార్డులు మంజూరు చేస్తూ కోటా కూడా ఇచ్చింది. అయితే ఎలా పంపిణీ చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
మహబూబ్‌నగర్ జిల్లాలోని 255 గ్రామ పంచాయతీలు, నాలుగు పురాల పరిధిలో ఇదే తీరు. పౌరసరఫరాల శాఖ అధికారులు చిన్నారులకు రేషన్ పంపిణీ చేయొద్దంటూ డీలర్లకు ఆదేశాలు జారీ చేయడంతో పంపిణీలో గందరగోళం నెలకొంది. చిన్నారుల జారీ చేసిన రేషన్ కార్డులను రద్దు చేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. పిల్లల పేర్లను తల్లిదండ్రుల కార్డులో నమోదు చేసేలా పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో మార్చిలో చిన్నారులకు మంజూరు చేసిన ఆహార భద్రత కార్డులు ఏప్రిల్‌లో పనిచేయడం లేదు. అప్పుడు రేషన్ పంపిణీ చేసి ఇప్పుడు ఎందుకు ఇవ్వడంలేదని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
వీరందరి కార్డుల రద్దు : మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 335 రేషన్ దుకాణాల పరిధిలో 12,487 కొత్త రేషన్ కార్డులను ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో సుమారు 1,305 మంది చిన్నారులకు ఆహార భద్రత కార్డులను జారీ చేసింది. తాజాగా ప్రభుత్వం నిర్ణయింతో వాటిని రద్దు చేశారు. 2014 నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు పరిశీలించి కొత్త కార్డులు జారీ చేశారు.
చిన్నారుల కార్డులకు సంబంధించి గ్రామాల్లో అవగాహన కల్పించారు. చిన్నారి పేరును తమ కార్డులో జతచేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోవాలని తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. మరికొందరు దరఖాస్తు చేసుకోకపోయినా పిల్లల పేర్లు నమోదు చేశారు. ఇలాంటి వారు ఇంకా మిగిలి ఉంటే పిల్లల పేర్లు చేర్చుతూ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తీవ్ర వ్యతిరేకత : పిల్లల పేర్లను తమ రేషన్ కార్డులో జతపరచాలని తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకుంటే, ఏకంగా పిల్లల పేరుమీద కొత్త కార్డులు జారీ చేశారు. రేషన్ పంపిణీ చేయాలన్నా తల్లిదండ్రులు ఉండాల్సిందే. అది నిరుపయోగమని లబ్ధిదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిపై స్పందించిన ప్రభుత్వం వెంటనే వాటిని పిల్లలకు ఇచ్చిన రేషన్ కార్డులను రద్దు చేసింది. జాబితా ఎంపిక ప్రక్రియలో నెలకొన్న లోపాల కారణంగా ఇలాంటివి చోటు చేసుకున్నాయి. క్షేత్రస్థాయిలో సర్వేచేసి వివరాలు సేకరించి జాబితా రూపొందిస్తే ఇలా అయ్యేది కాదని పలువురు అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు.
'అదేంటి! నా పేరు మా అత్తగారి రేషన్ కార్డుల్లో వచ్చింది' - ఆహార భద్రత కార్డుల్లో కొత్త సమస్య
రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ - రాష్ట్ర ప్రజలకు మంత్రి ఉత్తమ్ బహిరంగ లేఖ