ETV Bharat / state

765 చ.కి.మీ విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ - దేశానికే రోల్‌మోడల్​గా నిలిచేలా అభివృద్ధి

హైదరాబాద్​ దక్షిణ ప్రాంతంలో 765 చ.కి.మీ విస్తీర్ణంలో నిర్మాణం - ప్రస్తుత జీహెచ్​ఎంసీ సరిహద్దులకు అవతల ఏర్పాటు - నివాస ప్రాంతాలకు సమీపంలో విద్య, వైద్య, ఉద్యోగ, వినోద సంస్థలు

hyderabad future city
hyderabad future city (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : August 19, 2025 at 8:22 AM IST

|

Updated : August 19, 2025 at 8:27 AM IST

3 Min Read
Choose ETV Bharat

Telangana Government forms Future City Development : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు అద్భుతాల నగరంగా ఉండనుంది. దేశానికే రోల్‌మోడల్‌గా నిలవనున్న ఈ నగరాన్ని 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ది చేయనున్నారు. అందుకోసం ప్రాథమిక మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో తుది మెరుగులు దిద్దుతున్నారు. భారతదేశానికే తలమానికంగా ఉండేలా, రేపటి పౌరులకు మేలిమి భవిష్యత్తునిచ్చే నగరంగా ప్యూచర్‌ సిటీని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

తెలంగాణ 'ఫ్యూచర్​ సిటీ' - మాస్టర్​ ప్లాన్​ రెడీ! (ETV)

హైదరాబాద్‌ దక్షిణ ప్రాంతంలో 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నగరాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ - (ఎఫ్​సీడీఏ)ను ఏర్పాటు చేసింది. తెలంగాణ అర్బన్‌ ఏరియాస్‌ (డెవలప్‌మెంట్‌) యాక్ట్‌- 1975 కింద ఇది పని చేస్తుంది. ప్రస్తుత జీహెచ్​ఎంసీ సరిహద్దులకు అవతల ఏర్పాటవుతున్న ఈ జోన్‌ను భావితరాలకు స్థిరమైన, సమ్మిళిత నగరంగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యం. 'ఫ్యూచర్‌ సిటీ’లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయనున్నారు.

ప్రణాళికల రూపకల్పన : నివాస సముదాయాల నుంచి కాలినడకన చేరుకునేంత దూరంలోనే విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగ, వినోద సంస్థలు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఈ నగరానికి సంబంధించిన ప్రాథమిక మాస్టర్‌ ప్లాన్‌ను అధికారులు రూపొందించారు. దీనిపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఉన్నతస్థాయిలో సమీక్షా సమావేశం జరిగింది. నిర్మాణ ప్రణాళికలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆయన ఆదేశాలతో తుది మెరుగులు దిద్ది, త్వరలోనే పూర్తిస్థాయి ప్రణాళికను ప్రకటించడానికి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

అదే ఫ్యూచర్​ సిటీ లక్ష్యం : ఔటర్‌ రింగ్‌ రోడ్, శ్రీశైలం హైవే, నాగార్జునసాగర్‌ హైవేలతో సరిహద్దుగా ఉన్న కీలకమైన అభివృద్ధి కారిడార్‌ను ఫ్యూచర్‌ సిటీ కవర్‌ చేస్తుంది. ఇది రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉంది. ఒకేచోట విశాలమైన భూమి ఇప్పటికే ఉన్న పారిశ్రామిక సంస్థలతో తెలంగాణ భవిష్య నగర ఆర్థిక శక్తికి ఈ ప్రాంతం కేంద్రంగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌ మహానగరంపై ఒత్తిడిని తగ్గించడం, స్మార్ట్‌ మౌలిక సదుపాయాలు, స్థిరమైన జీవనం, వేగవంతమైన ఆర్థిక వృద్ధితో ప్రణాళికాబద్ధంగా ప్రత్యామ్నాయాన్ని అందించడం ఫ్యూచర్‌ సిటీ లక్ష్యం.

ఫ్యూచర్​ సిటీ నిర్మించే ప్రాంతం
ఫ్యూచర్​ సిటీ నిర్మించే ప్రాంతం (ETV)

మాస్టర్​ ప్లాన్​ రూపకల్పన : ఈ నగరాన్ని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ అభివృద్ధి చేస్తుంది. ప్రఖ్యాత అంతర్జాతీయ సంప్రదింపు సంస్థ సహాయంతో మాస్టర్‌ ప్లానింగ్‌ రూపకల్పన శరవేగంగా జరుగుతోంది. ఆధునిక పర్యావరణ పద్ధతుల ద్వారా జీవావరణ సంరక్షణ, మెరుగుదలపై మాస్టర్‌ ప్లాన్‌లో దృష్టి సారిస్తున్నారు. పారిశ్రామిక, నివాసిత ప్రాంతాల్లో వర్షపు నీటి నిర్వహణ కోసం స్పాంజ్‌ పార్కులు నెలకొల్పుతారు. ఇవి నీటిని గ్రహించి, వరదలను నివారిస్తాయి. రోజువారీ నీటి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని పునర్వినియోగ నీటి పద్ధతిని అమలు చేస్తారు. జీరో లిక్విడ్‌ డిశ్చార్జ్‌పై దృష్టి పెడతారు.

విద్యుత్‌ అవసరాల కోసం సబ్​ స్టేషన్లు : ఇది వర్షపు నీటి సేకరణ, పునర్వినియోగ వ్యవస్థల ద్వారా నీటి కొరతను సమర్థంగా తీర్చుతుందని, బయటి నుంచి నీటిని సరఫరా చేసుకోవడాన్ని తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్‌ అవసరాల కోసం అధిక సామర్థ్య సబ్‌ స్టేషన్లను నిర్మించనున్నారు. పారిశ్రామిక జోన్‌లు, వ్యాపార కేంద్రాల మధ్య గ్రీన్‌ కారిడార్‌ బఫర్‌గా పని చేస్తుంది. విశాలమైన అర్బన్‌ ఫారెస్ట్‌, పాకెట్‌ పార్కుల నెట్‌వర్క్‌తో భవిష్య నగరం హరిత వాతావరణాన్ని బలోపేతం చేస్తుంది. నివాస సముదాయాల నిర్మాణంలోనూ ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు.

ఈ క్లస్టర్‌లు వాక్‌-టు-వర్క్‌ జీవనశైలిని అందించేలా రూపొందించారు. సమీపంలోని రిజర్వ్‌ అటవీ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దనున్నారు. వీటికి తోడుగా ఇప్పటికే ఉన్న జలవనరులు, జంతు ప్రదర్శన శాల, ఎకో టూరిజం జోన్‌లను సంరక్షిస్తారు. పర్యాటకం, వ్యాపార సందర్శనలను ప్రోత్సహించడంలో భాగంగా ఫ్యూచర్‌ సిటీ సరిహద్దు వెంట అనేక హోటళ్లు, రిసార్ట్‌లనూ ప్రణాళికలో పొందుపర్చారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్, ఈ-వేస్ట్‌ డిస్పోజల్‌ మెకానిజమ్స్, కామన్‌ ఎఫ్లుయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లతో ఫ్యూచర్‌ సిటీ సన్నద్ధమవుతుంది. ఇవి అన్ని రకాల వ్యర్థాల నిర్వహణను సమర్థంగా నిర్వహిస్తాయి.

తెలంగాణలో ఏఐ సృజనాత్మక కేంద్రం - మూడేళ్లలో 10వేలకు పైగా ఉద్యోగావకాశాలు

ఫ్యూచర్​ సిటీకి కొత్త వెబ్​సైట్​? - ఏ సమాచారం కావాలన్నా అందులోనే

Last Updated : August 19, 2025 at 8:27 AM IST