Medaram Jathara Development Works : వన దేవతలు కొలువుదీరిన మేడారం నిత్య జాతరలా మారింది. ప్రస్తుతం సెలవు రోజుల్లో పది వేలు, సాధారణ రోజుల్లో మూడు వేలకు తగ్గకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో ఇక్కడికొచ్చే వారి కోసం శాశ్వత ఏర్పాట్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఆ దిశగా నిధులు మంజూరు చేసి పనులు చేపడుతోంది. మలుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఈ వన దేవతలు కొలువై ఉన్నారు.
గతంలో మహా జాతరకు కేవలం నెల, రెండు నెలల ముందే ప్రభుత్వం పనులు చేపట్టడంతో నాణ్యత ప్రమాణాలు లోపించి గుత్తేదారులకు కాసుల వర్షం కురిసేది. అయితే ఇప్పుడు ఆ తీరు మారనుంది. జాతరతో సంబంధం లేకుండా మేడారంలో పనులు జరగనున్నాయి. అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు ఆహ్లాదాన్ని అందించేందుకు మంత్రి సీతక్క ప్రత్యేక దృష్టి సారించారు. జాతరకు చేసిన ఏర్పాట్లను ఆ తర్వాత తొలగిస్తారు. దీంతో ఉత్సవం అనంతరం మేడారం కళావిహీనంగా మారుతుంది.
నిత్యం వేలాదిగా తరలివస్తున్న భక్తులు మేడారం పరిసరాల్లో ఉన్న సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవతల దర్శనం అనంతరం విశ్రాంతి తీసుకునేందుకు, ఆహ్లాదంగా గడిపేందుకు ఎలాంటి ఏర్పాట్లు లేవు. దీనిపై స్వయంగా మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకొని భక్తులు ఎక్కువ సంఖ్యలో విడిది చేసే జంపన్న వాగు, మరికొన్ని ప్రదేశాల్లో పచ్చదనం పెంచడం, విశ్రాంతి తీసుకొనేందుకు పర్యాటక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రభుత్వం రూ.5 కోట్లు సైతం మంజూరు చేసింది. ఈ పనులు త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

రహదారుల విస్తరణ : జాతర విజయవంతంలో రహదారుల విస్తరణ అనేది చాలా ముఖ్యం. ఈ పనులను ఉత్సవానికి నెల రోజుల ముందు నుంచి చేపట్టేవారు. దీనివల్ల నిర్మాణాల్లో నాణ్యత కొరవడేది. దీంతో వర్షాలు పడేటప్పుడు రహదారులు కొట్టుకుపోవడం, ధ్వంసం కావడం వంటివి జరిగేవి. ఈ పరిస్థితులతో వేసిన రోడ్లు మళ్లీ వేయాల్సిన పరిస్థితి వచ్చేది. ప్రభుత్వం ఈసారి జాతర పరిసరాల్లోని రహదారులన్నింటినీ విస్తరిస్తోంది. ఇప్పటికే రూ.4 కోట్లతో చేపట్టిన మేడారం-కన్నెపల్లి, మేడారం-ఊరట్టం రోడ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తి అయింది.

అలాగే మరో రూ.3 కోట్లతో చేపట్టే క్యూలైన్ల విస్తరణ పనులు, రూ.8 కోట్లతో చేపట్టే కాల్వపల్లి-ఊరట్టం రహదారి పనులు సాగుతున్నాయి. రూ.1.34 కోట్లతో చేపట్టిన వనం రోడ్డు పనులు చివరి దశలో ఉన్నాయి. నార్లాపురం-కాల్వపల్లి మార్గానికి రూ.2.50 కోట్లు, గిరిజన మ్యూజియం-మరియబంధం దారి విస్తరణకు రూ.1.30 కోట్లు, మేడారం-శివరాంసాగర్ చెరువు రోడ్డు విస్తరణకు రూ.2 కోట్ల పనులకు టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు.
ఆలయాల పునర్నిర్మాణం : మహా జాతర ఏర్పాట్లపై దేవాదాయ శాఖ ముందస్తు కార్యాచరణ ప్రారంభించింది. ఇప్పటికే రూ.1.98 కోట్లతో పూజారుల అతిథి గృహాన్ని మంత్రి సీతక్క ఇటీవల ప్రారంభించారు. రూ.94 లక్షల చొప్పున మేడారం, కన్నెపల్లిలోని సమ్మక్క, సారలమ్మ ఆలయాలను పునర్నిర్మించేందుకు సిద్ధం అవుతున్నారు. రూ.2 కోట్లతో సత్రాల నిర్మాణానికి నిధులు సమకూర్చుకోగా, స్థల సమస్య కారణంగా నిర్మాణం ఆగిపోయింది. మరో రూ.కోటితో ముఖద్వారం వద్ద శుభద మండపం నిర్మించేందుకు ప్రతిపాదనలు సైతం రూపొందించారు.

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : తాగు నీరు, మరుగుదొడ్ల శాశ్వత నిర్మాణాల కోసం యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రస్తుతం పోలీసుల స్టేషన్, పూజారుల అతిథిగృహం, అమరవీరుల స్తూపం, రెడ్డిగూడెం క్రాస్‌రోడ్డు, ఊరట్టంలో భారీ నీటి ట్యాంకులు ఉన్నాయి. వీటి నుంచి భగీరథ శుద్ధజలాలను అందిస్తున్నారు.
ఈసారి అదనంగా చిలకలగుట్ట, శివరాంసాగర్‌చెరువు, కొంగలమడుగు, కాల్వపల్లి క్రాస్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో మరిన్ని ట్యాంకులు నిర్మించాలని ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం జాతర పరిసరాల్లో ఆరు చోట్ల మరుగుదొడ్ల కాంప్లెక్సు ఉండగా, మరో ఐదు ప్రాంతాల్లో నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వీటిని మేడారం జాతర ప్రారంభం అయ్యేలోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.
దూందాంగా మేడారం చిన్న జాతర - గ్రామంలోకి దుష్ట శక్తులు రాకుండా పూజలు