TG Govt Appoints Chairman for Three Finance Committees : తెలంగాణ శాసనసభ ఆర్థిక కమిటీలు ఏర్పాటయ్యాయి. అందులో ప్రజాపద్దుల సంఘం, అంచనాల కమిటీ, ప్రభుత్వ రంగ సంస్థల సమితిలకు ఛైర్మన్‌లను, సభ్యులను నియమిస్తూ శాసనసభ కార్యదర్శి నర్సింహాచారి ప్రకటన జారీ చేశారు. ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్‌గా ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నియామకం కాగా సభ్యులుగా ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, రేవూరి ప్రకాశ్ రెడ్డి, చిక్కుడు వంశీ కృష్ణ, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి, రామారావు పవర్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల, కూనంనేని సాంబశివరాలు, బాను ప్రసాద్ రావు, ఎల్ రమణ, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డిలు నియమితులయ్యారు.
అదేవిధంగా కోదాడ ఎమ్మెల్యే నలమడ పద్మావతి రెడ్డి అంచనాల కమిటీ ఛైర్ పర్సన్‌గా, సభ్యులుగా వాకిటి సునీతా లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మాగంటి గోపి, విజయరమణ రావు, రామదాస్ మాలోత్, మామిడాల యశశ్వని రెడ్డి, రాకేశ్ రెడ్డి, ఎంఎస్ ప్రభాకర్ రావు, సుంకరి రాజు, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, యాదవ్ రెడ్డిలు ఉన్నారు. ఈర్లపల్లి శంకరయ్య ప్రభుత్వ రంగ సంస్థల సమితి ఛైర్మన్‌గా అపాయింట్ అవ్వగా సభ్యులుగా సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద్, వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, సంజీవ్ రెడ్డి, లక్ష్మి కాంతరావు, కౌసిర్ మెహిద్దీన్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సేరి శుభాస్ రెడ్డి, టాటా మధుసూదన్, మిర్జా రియాజుల్ హసన్‌లు ఉన్నారు.
పీఏసీ ఛైర్మన్ విషయంలో ప్రభుత్వ చర్య అప్రజాస్వామికం : పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా అరికెపూడి గాంధీని నియమించడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై, హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గమంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మరోవైపు మాజీమంత్రి, బీఆర్ఎస్ శాసనభ్యుడు హరీశ్‌రావు సైతం తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ ఛైర్మన్ పదవిని, కాంగ్రెస్ కండువా కప్పుకొన్న ఎమ్మెల్యేకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ పీఏసీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించడం లేదా అని మాజీమంత్రి ప్రశ్నించారు. దేశ అత్యున్నత చట్టసభలో ఒక న్యాయం? రాష్ట్ర అత్యున్నత చట్టసభలో మాత్రం అన్యాయమా? అంటూ స్పందించారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ మాటలన్నీ డొల్ల అని తేలిపోయాయన్న ఆయన, రాజ్యాంగం మీద గౌరవం ఉంటే తక్షణమే సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని హరీశ్‌రావు ఆక్షేపించారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేకు PAC ఛైర్మన్ పదవా ? సిగ్గు.. సిగ్గు..
— KTR (@KTRBRS) September 9, 2024
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై..
హైకోర్టు తీర్పు ఇచ్చిన రోజే ఇదేం దుర్మార్గం ?
ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పీఏసీ ఛైర్మన్ హోదాను, పార్టీ మారిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం ఎక్కడి సంస్కృతి ??
గీత దాటిన కాంగ్రెస్… https://t.co/fFvHDSXkDa
Congress MLA Rammohan Reddy Respond to Harish Rao Comments : పీఏసీ ఛైర్మన్ విషయంలో మాజీమంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని కాంగ్రెస్ శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి ఆక్షేపించారు. హరీశ్‌రావు వైఖరి వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లు ఉందని ఎద్దేవా చేసారు. గతంలో కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని చీల్చి విలీనం చేసుకున్న చరిత్రను గుర్తు చేసుకోవాలని సూచించారు. గతంలో తాను అంచనాల కమిటీ సభ్యుడిగా ఉన్నప్పుడు కనీసం నివేదిక కూడా ఇవ్వకుండా రద్దు చేశారని ఆయన గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపులు, కమిటీల ఏర్పాటు అంశంపై బీఆర్ఎస్కు మాట్లాడే నైతికహక్కు లేదని రామ్మోహన్ రెడ్డి అన్నారు.