ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల నిర్మాణానికి రూ.11 వేల కోట్లు - మంజూరు చేసిన విద్యాశాఖ
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలు - నిర్మాణానికి రూ.11 వేల కోట్లు మంజూరు - విద్యాశాఖ కీలక ముందడుగు

Published : March 9, 2025 at 5:06 PM IST
Young India Integrated Gurukul Schools : యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి రూ.11,000 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 55 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాటు కానున్న సమీకృత గురుకులాల నిర్మాణం కోసం ఒక్కో స్కూల్ కి రూ. 200 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబధించిన పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ ఉత్తర్వులు ఇచ్చారు.
నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 119 యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు నిర్మించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో తొలివిడతగా 55 నియోజక వర్గాల్లో గురుకులాల నిర్మాణం చేపట్టనుంది. సమీకృత గురుకులాల్లో బ్లాకుల వారీగా నిర్మాణం కానున్నాయి. వీటిలో అడ్మినిస్ట్రేష్ బ్లాక్, అకాడమిక్ బ్లాక్, స్టాఫ్ క్వార్టర్స్, లైబ్రరీ, క్రీడా ప్రాంగణం, బాలురు, బాలికల హాస్టల్ బ్లాకులు నిర్మించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కి సైతం నివాస సముదాయాలు అందుబాటులోకి తీసుకురానుంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో గాలి వెలుతురు ఎక్కువగా ఉండేలా, సోలార్ పవర్ వినియోగించుకునేందుకు వీలుగా నిర్మాణం చేపట్టనుంది. ఈ నేపథ్యంలో ఒక్కో భవనంతి నిర్మాణానికి రూ. 135కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన సర్కారు. ఫర్నిచర్, ఇతరత్రా అవసరాలు, పన్నుల కోసం అదనంగా రూ.65కోట్లు కేటాయిస్తూ, ఒక్కో గురుకుల నిర్మాణానికి రూ.200 కోట్లు కేటాయించింది

