Telangana Cyber Security Bureau Busts Cybercrimes Network in Gujarat : గుజరాత్ కేంద్రంగా సైబర్ నేరాలకు సహకరిస్తున్న ఘరానా ముఠా ఆటను టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కట్టించింది. గుజరాత్లో 10 రోజులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టి బ్యాంక్ మేనేజర్ సహా 20 మందిని అరెస్టు చేసినట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సోమవారం తెలిపారు. వారి ప్రమేయం దేశవ్యాప్తంగా 515, తెలంగాణలో 60 కేసుల్లో ఉన్నట్లు తేల్చినట్లు చెప్పారు.
ఆమె తెలిపిన వివరాల ప్రకారం, తెలంగాణ సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఏడు కేసులు నమోదయ్యాయి. ఆ కేసులను ఛేదించేందుకు డీఎస్పీలు కె.వి. సూర్యప్రకాశ్, ఫణీందర్, రంగారెడ్డి, సూర్యదేవర హరికృష్ణ, ఇన్స్పెక్టర్ల బృందం దర్యాప్తు ప్రారంభించింది. ట్రేడింగ్, పెట్టుబడులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరిట రూ.4.37 కోట్లు కాజేసి వివిధ బ్యాంకు ఖాతాల్లో నమోదయ్యాయని తెలిపారు. ఐదుగురు నిందితులు చెక్‌లతో రూ.22,64,500 డబ్బును విత్‌డ్రా చేశారని వారు గుర్తించారు. వారు గుజరాత్ అడ్డాగా ఈ దందా సాగిస్తున్నట్లు గుర్తించామన్నారు.
ఎస్పీ దేవేందర్ సింగ్ పర్యవేక్షణలో ఈ నెల 1న 10 మంది సైబర్ సెక్యూరిటీ బ్యూరో నిందితుల వేట ప్రారంభించారు. 10 రోజుల పాటు గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో వారంతా మకాం వేశారు. నిందితులు, కొందరు వ్యాపారులు, ఉద్యోగులకు కమీషన్ ఆశచూపి బ్యాంకు ఖాతాలు సేకరించినట్లు గుర్తించారు. అయితే గుజరాత్‌లోని కొంతమంది బ్యాంకు సిబ్బంది మ్యూల్ ఖాతాలు తెరిచి మోసగాళ్లకు సహకరించినట్లు గుర్తించారు.
సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల ఆచూకీ : వారందరినీ పట్టుకునేందుకు బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్లోని సైబర్ సెక్యూరిటీ బ్యూరో సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల ఆచూకీని గుర్తించే పనిలో పడింది. క్షేత్రస్థాయిలోని పోలీసు బృందంతో సమన్వయం చేసుకుంది. డీసీబీ బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ అంకిత్‌కుమార్ సింగ్ (26) సహా ఏజెంట్లు, మ్యూల్ ఖాతాదారులు ఇలా 20 మందిని అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. వారిని రిమాండ్‌కు తరలించారు. టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చేపట్టిన మేజర్ ఆపరేషన్లలో ఇది ఐదోదని శిఖా గోయల్ వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న వారందరినీ అభినందించారు.
సైబర్ నేరాలపై ఫిర్యాదు ఇకపై మరింత సులభంగా - చాట్‌బాట్‌తో చకచకా చేసేయొచ్చు!
సైబర్ నేరగాళ్ల బారినపడితే పీఎస్‌లో ఫిర్యాదు చేయండి - లేదంటే డబ్బులు తిరిగి పొందలేరు!