CM Revanth Invited Central Ministers For Sep 17th Celebrations : రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం వేడుకలకు హాజరు కావాలంటూ నలుగురు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం లేఖలు రాశారు. 1948, సెప్టెంబరు 17న తెలంగాణలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి కోరారు.
'ప్రజా పాలన’ వేడుకలపై సీఎస్ సమీక్ష : హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో ఈ నెల 17న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో గురువారం ప్రజాపాలన దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన ఆమె, 17న ఉదయం అమరవీరుల స్తూపం వద్ద అమరులకు సీఎం రేవంత్ నివాళులర్పిస్తారని చెప్పారు.
ఈ నెల 17న గణేశ్ నిమజ్జనం కూడా ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి చర్యలు చేపట్టాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అన్ని శాఖల ప్రధాన కార్యాలయాలు, పర్యాటక భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని చెప్పారు. ఈ సమావేశంలో డీజీపీ జితేందర్, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ శివధర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తాతోపాటు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, జీఏడీ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం - తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం - Praja Palana Day