CM Revanth Reddy Japan Tour : పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం ఇవాళ్టి నుంచి జపాన్‌లో పర్యటించనుంది. ఈనెల 22 వరకు టోక్యో, మౌంట్ ఫుజి, ఓసాకా, హిరోషిమాలో రాష్ట్ర బృందం పర్యటన కొనసాగనుంది. అక్కడి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. సాంకేతిక సహకారంపై కూడా సంప్రదింపులు జరపడంతో పాటు జపాన్‌లో పర్యాటకం, పర్యావరణ పరిరక్షణ చర్యలు, జీవన శైలిని పరిశీలిస్తారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జపాన్ పర్యటనకు వెళ్లారు. మంగళవారం(నిన్న) రాత్రి శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి జపాన్ బయలుదేరారు. ఇవాళ మధ్యాహ్నం టోక్యోలోని నారిటా ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఇవాళ సీఎం బృందం జపాన్‌లోని భారత రాయబారితో ఆతిథ్య భేటీ కానుంది. గురువారం టోక్యోలో సోనీ గ్రూపు, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, జెట్రో, జపాన్ బయో ఇండస్ట్రీ అసోసియేషన్, వివిధ సంస్థలతో సమావేశమవుతారు. అదేరోజు సాయంత్రం తోషిబా ఫ్యాక్టరీని సందర్శించనున్నారు.
ఈనెల 18న టోక్యోలోని గాంధీజీ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించి పుష్పాంజలి ఘటిస్తారు. అనంతరం టోక్యో గవర్నర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం అవుతారు. టయోటా, తోషిబా, ఐసిన్, ఎన్జీటీ తదితర కంపెనీల సీఈవోలతో వేర్వేరుగా చర్చిస్తారు. జపాన్ ఓవర్సీస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతారు. అదే రోజు సుమిదా రివర్ ఫ్రంట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సందర్శిస్తారు.
ఈనెల 19న టోక్యో నుంచి ఒసాకా వెళ్తారు. ఒసాకాలోని మౌంట్ ఫుజి ప్రాంతం, అరకు రయామా పార్కును సందర్శిస్తారు. ఈనెల 20న ఒసాకాలోని కిటాక్యూషు సిటీకి వెళ్లి అక్కడి మేయర్‌తో సమావేశమై ఎకో టౌన్ ప్రాజెక్టు వివరాలు తెలుసుకుంటారు. మురసాకి రివర్, ఎన్విరాన్‌మెంట్ మ్యూజియాలు, ఎకో టౌన్ సెంటర్‌ను సందర్శిస్తారు. ఈనెల 21న ఒసాకాలోని యుమెషిమాలో జరగనున్న వరల్డ్ ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించి, బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు.
ఈనెల 23న హైదరాబాద్‌కు సీఎం రాక : ఒసాకా రివర్ ఫ్రంట్‌ను రాష్ట్ర బృందం పరిశీలిస్తుంది. ఈనెల 22న ఒసాకా నుంచి హిరోషిమా వెళ్తారు. హిరోషిమా పీస్ మెమోరియల్ సందర్శించి గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. హిరోషిమా వైస్ గవర్నర్, అసెంబ్లీ ఛైర్మన్‌తో భేటీ కానున్నారు. హిరోషిమా జపాన్ - ఇండియా చాప్టర్‌లో బిజినెస్ లంచ్‌లో పాల్గొని అక్కడి ప్రతినిధులతో చర్చిస్తారు. హిరోషిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని, మాజ్డా మోటార్స్ కంపెనీని సీఎం సందర్శిస్తారు. అనంతరం ఒసాకాలోని కాన్సాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి ఈనెల 23 ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. సీఎం రేవంత్‌రెడ్డితో పలువురు అధికారులు వెళ్లారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి శ్రీధర్‌బాబు ఈనెల 18న జపాన్ చేరుకోనున్నారు.
నోవాటెల్‌లో సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ - ఆ ఐదు ప్రధానాంశాలపై విజ్ఞప్తి