Telangana Cabinet Meeting Started In Secretariat : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. పలు కీలక అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం సచివాలయంలో సమావేశం అయ్యారు. రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగుల పెండింగ్ సమస్యలు, వానాకాలం సాగు తదితర అంశాలపై చర్చ జరుగుతోంది. సమావేశంలో యువవికాసం లబ్ధిదారుల ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నారు.
రాజీవ్ యువ వికాసం పథకంలో ఐదు లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం భావించగా, అంచనాలకు మించి సుమారు 16 లక్షల 50వేల దరఖాస్తులు వచ్చాయి. మొదటి విడతలో లక్ష రూపాయల వరకు కేటగిరి లబ్ధిదారులకు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ప్రారంభించాలని భావించినప్పటికీ.. గందరగోళం తలెత్తే అవకాశం ఉన్నందున వాయిదా వేశారు. మరికొంతమందికి లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకునే అంశంపై చర్చిస్తున్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి విడత కింద నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చే విషయంపైనా సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.