Telangana Cabinet Meeting : బనకచర్ల ప్రాజెక్టు వివాదం ప్రధానాంశంగా నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. గోదావరి -బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ముందుకెళ్లకుండా ఎలాంటి వ్యూహం అనుసరించాలనే అంశంపై కీలక చర్చ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా మంత్రిమండలి చర్చించే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం, కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ నివేదిక, సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ వంటి అంశాలపై కూడా చర్చ జరిపే అవకాశం ఉంది.
బనకచర్ల ప్రాజెక్టుపై ప్రధాన చర్చ : సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. బనకచర్ల ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు లేఖలు రాయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా దిల్లీకి వెళ్లి కలిసి అభ్యంతరాలను తెలిపారు.
అఖిలపక్ష ఎంపీలతో సమావేశం నిర్వహించి సలహాలు తీసుకున్నారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఎలా ముందుకెళ్లాలనే వ్యూహాన్ని కేబినెట్ ఖరారు చేసే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వంతో చర్చించాలా? కేంద్రంపై మరింత ఒత్తిడి చేయాలా? న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా? అనే అంశాలపై చర్చించనున్నారు. గోదావరి, కృష్ణా జలాల వినియోగం, ఇతర ప్రాజెక్టులపై కూడా చర్చించే అవకాశం ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికలపైనా చర్చ! : స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో ఇదే విషయంపై సుదీర్ఘంగా చర్చించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలి? స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల వివాదం హైకోర్టులో ఉన్నందున అది తేలే వరకు వేచి చూడాలా? పాత రిజర్వేషన్ల ప్రకారమే ఈసారికి ముందుకెళ్లాలా? అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. సంక్షేమ పథకాలకు నిధుల సమీకరణ, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రాజీవ్ యువ వికాసం, కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ నివేదికలు, తదితర అంశాలపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది.
'చంద్రబాబుకు నా సూచన ఒక్కటే - కేంద్రంలో పలుకుబడి ఉందని ఏం చేసినా చెల్లుతుందనుకోవద్దు'
గోదావరిలో ఎవరి శక్తి మేరకు వాళ్లు ప్రాజెక్టులు నిర్మించుకుందాం?: చంద్రబాబు