Telangana New Beverage Brand Issues : రాష్ట్రంలో ఆరు బ్రీవరీల ద్వారా రోజుకు 2 లక్షల కేసులు బీరు ఉత్పత్తి అవుతుంది. సాధారణంగా అయితే ఈ 2 లక్షల కేసుల బీరు మద్యం ప్రియుల అవసరాలకు సరిపోతుంది. కానీ వేసవి కాలంలో తాగే వారి సంఖ్య పెరుగుతుండడంతో అందుకు తగ్గట్టుగా సరఫరా కూడా పెరగాల్సి ఉంది. ఇక్కడ ఉన్న బ్రీవరీలకు మూడో షిఫ్ట్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వడంతో పాటు గోవా, బెంగళూరు, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా బీర్లు దిగుమతి చేసుకుంటారు. అయితే ఇటీవల బీరు కొరత ఏర్పడటంతో డిమాండ్‌కు తగినంత సరఫరా లేదు.
లోక్‌సభ ఎన్నికల నియమావళి దృష్ట్యా మూడో షిప్ట్‌కు అనుమతి ఇచ్చే అవకాశం లేకపోవడమే కాకుండా బయట రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే వెసులుబాటు లేకుండా పోయింది. ఇందుకు తోడు మద్యం దుకాణాల్లో బీరు స్టాక్‌ను నేరుగా విక్రయాలు జరపకుండా కొందరు దుకాణదారులు ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు బెల్ట్ షాపులకు అమ్ముకున్నట్లు ఎక్సైజ్ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. మొత్తం మీద మద్యం ప్రియులకు బీరు దొరకడం లేదన్న విషయం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ 5 కొత్త బీరు బ్రాండ్లకు అనుమతి ఇచ్చింది.
బీరు బ్రాండ్లకు అనుమతుల విషయంలో ప్రభుత్వంతో సంప్రదించకుండానే బేవరేజెస్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. కనీసం ఆ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకురాకుండా వారే ధరలు నిర్ణయించి, అనుమతులిచ్చారు. సాధారణంగా ఇక్కడ తయారవుతున్న వివిధ రకాల బీరు బ్రాండ్లకు సంబంధించి 12 బాటిళ్ల బీరు కేసుకు ప్రాథమిక సగటు ధర రూ.291గా ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. కానీ, టీడీబీసీఎల్ మాత్రం ఓ కంపెనీ బీరు కేసుకు ఏకంగా రూ.907గా ప్రాథమిక ధరను నిర్ణయించింది. ఇదే విషయమై సామాజిక మాధ్యమాలు, ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోశాయి. కొత్త బీర్లకు అనుమతులు ఇవ్వడం వివాదస్పదమై ప్రభుత్వం ఇరకాటాన పడే పరిస్థితికి రావడంతో తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది.
తెలంగాణలో బీర్ల కొరత - క్లారిటీ ఇచ్చిన ఆబ్కారీ శాఖ - BEERS SHORTAGE IN TELANGANA
అధికారులపై మంత్రి ఆగ్రహం : రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా మరే కంపెనీకి ఇవ్వని విధంగా ఓ కంపెనీకి ఎక్కువ ధర నిర్ణయించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అనుమతులు ఇచ్చిన అధికారుల తీరుపై కూడా అనుమానించే పరిస్థితి నెలకొంది. ఇదే విషయమై మంగళవారం జరిగిన ఎక్సైజ్ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు టీడీబీసీఎల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత ధరకు అనుమతులు ఎలా ఇచ్చారని మంత్రి నిలదీశారు. ఇతర రాష్ట్రాల్లో ధరల ఆధారంగా ఇచ్చినట్లు వివరణ ఇచ్చేందుకు యత్నించినా మంత్రి శాంతించలేదు ఆ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని అబ్కారీ శాఖ కమిషనర్ శ్రీధర్‌ను ఎక్సైజ్‌శాఖ మంత్రి ఆదేశించారు.
తెలంగాణలో అత్యధికంగా విక్రయాలు జరుగుతున్న కింగ్ ఫిషర్ లాగర్ 650ఎంఎల్ బీరు కేసు ప్రాథమిక ధర రూ.289.22గా ఉంది. అదేవిధంగా కింగ్ ఫిషర్ అల్ట్రా మాక్స్ ప్రీమియం స్ట్రాంగ్ 650ఎంఎల్ కేసు ధర రూ.443.31గా ఉంది. ఇలా వివిధ రకాల కంపెనీలకు చెందిన బీర్ల ప్రాథమిక ధరలు వేర్వేరుగా ఉంటాయి. అయినా కూడా ఏ బీరుకు కూడా ఇంత ఎక్కువ ప్రాథమిక ధర ఖరారు చేయలేదు.
ఈ ప్రశ్నలపై నివేదిక : ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతో రంగంలోకి దిగిన అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు టీడీబీసీఎల్ నిర్ణయంపై విచారణ చేపట్టారు. ఇన్ని రోజులు గుట్టుగా ఉంచిన వ్యవహారం తాజా పరిణామాలతో బట్టబయలైంది. ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేశాయి? ఆయా కంపెనీలు కోడ్ చేసిన ప్రాథమిక ధర ఎంత? అందులో అత్యధిక ప్రాథమిక ధరతో అనుమతి పొందిన కంపెనీ కోడ్ చేసిన ధర ఎంత? అధికారులు ధర ఖరారు చేసే ముందు ఎలాంటి కసరత్తు చేశారు? ఎందుకింత అత్యుత్సాహం ప్రదర్శించారు? ఇప్పుడున్న బీర్ల ప్రాథమిక సగటు ధర కంటే రెట్టింపు ధర ఖరారు చేయడంలో మతలబు ఏంటి ఇలా తదితర అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. రికార్డుల పరిశీలనతో పాటు సంబంధిత అధికారులు వివరణతో కూడిన నివేదికను ఇవాళో రేపో ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.