How to control Bad Habits in Teenagers : పిల్లలు తొమ్మిది, పదో తరగతి వచ్చేసరికి వారి శరీర ఆకృతిలో అనేక మార్పులు సంభవిస్తాయి. కౌమార దశ నుంచి యవ్వనదశ మధ్యలో ఉన్నవారందరినీ టీనేజర్లుగానే పరిణిస్తాం. ఈ వయసులో మనసు నియంత్రణ లేకుండా వేగంగా పరుగెత్తుతుంది. మంచి కంటే చెడు అలవాట్లకే ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఇలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను దగ్గరగా తీసుకుని మనసువిప్పి మాట్లాడాలని, వారి సమస్యలు తెలుసుకోవాలని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మైదానాలకు తీసుకెళ్లి ఆటలు ఆడించాలని, యోగా ప్రాక్టీస్ చేయించాలని సిఫారసు చేస్తున్నారు.
వారిదే కీలకపాత్ర : టీనేజీ దశలో ఉన్నప్పుడు శరీరంలో వచ్చే మార్పుల గురించి తల్లిదండ్రులు పిల్లలకు అవగాహన కలిగే విధంగా వివరించి చెప్పాలి. ఈ వయసులో పిల్లలు తెలియక ఏవైన తప్పులను చేస్తే అర్థమయ్యేలా వివరించి వారితోనే సరిదిద్దించాలి. స్కూల్, కాలేజీ నుంచి ఇంటికి రాగానే వారిని ఓ కంట కనిపెట్టాలి. తేడా అనిపిస్తే వెంటనే వారితో చర్చించాలి. ఏమైనా సమస్యలుంటే తమతో ఓ స్నేహితుడిగా పంచుకోవాలని కోరాలి. వారి మాటలను గౌరవించడమే కాకుండా విలువ ఇస్తే మరిన్ని విషయాలు చర్చించేందుకు ఆసక్తితో ఉంటారు. పిల్లలు ఒత్తిళ్లకు గురయ్యేలా వారితో అనవసరంగా ప్రవర్తించకూడదు.
అనేక సవాళ్లు
- విద్యాపరంగా పిల్లలు రాణించాలని తల్లిదండ్రులు ఎవరైనా సాధారణంగా అంచనాలు పెట్టుకుంటారు. దీంతో వారిలో ఒత్తిళ్లు పెరుగుతాయి. ఫలితంగా తెలియకుండానే ఆందోళనకు గురవుతుంటారు. అనుకున్న మార్కులు, గ్రేడ్లు రాకపోతే క్షణికావేశంలో అఘాయిత్యాలకు పాల్పడి సమస్యను పెద్దది చేసుకుంటారు.
- తల్లిదండ్రుల విడాకులు, వ్యక్తుల మధ్య విభేదాలు, ఆర్థిక సమస్యలు వంటి కుటుంబ వాతావరణంలో సంఘర్షణ, ఉద్రిక్తత వంటి భావాలు ఏర్పడతాయి.
- ఈ వయసులో హార్మోన్ లెవల్స్‌లో హెచ్చుతగ్గులతో మానసిక స్థితి నియంత్రణను ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఇవి మానసికంగా ఆందోళనకు దారితీస్తాయి.
కొన్ని ఉదాహరణలు..
- ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థి కళాశాల నుంచి ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు. తన గదిలో ఒంటరిగా ఉంటున్నాడు. సమయానికి భోజనం చేయడం లేదు. లోతుగా పరిశీలించిన అనంతరం తల్లిదండ్రులకు విస్మయం కలిగించే విషయాలు ఎదురుపడ్డాయి. స్నేహితులతో కలిసి స్మోకింగ్ చేస్తున్నాడని, జూదం ఆడుతున్నాడని తెలిసింది. మా బాబు మారతాడా? లేదా అని ఆ తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు.
- మా బాబు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. పది, ఇంటర్‌లో మంచి మార్కులతో పాస్ అయ్యాడు. ఇంటికి రాగానే అదో రకంగా వింతగా ప్రవర్తిస్తున్నాడు. మాట్లాడితే పరధ్యానంగా, కోపంతో సమాధానాలిస్తున్నాడు. మొబైల్లోనే ఎక్కువగా టైం గడుపుతున్నాడు. ఆరాతీస్తే వాట్సాప్‌లో అమ్మాయిలతో చాటింగ్‌లు ఉన్నాయి. మా బాబు సమస్యను మీరే పరిష్కరించాలంటూ ఓ తల్లి బాధపడుతుంది.
ఇలా టీనేజీ సమయంలో పిల్లలు అనేక తప్పుటడుగులు వేస్తున్నారు. దొంగతనాలు చేస్తున్నారు. మద్యం, గుట్కా, ధూమపానానికి బానిసలవుతున్నారు. పరిపక్వత లేని పిల్లలు ప్రేమ అంటూ ఇష్టంతో చూసుకునే తల్లిదండ్రులకు తీరని అన్యాయం చేస్తున్నారు.
"టీనేజర్లకు కోపం, ఆవేశం తొందరగా వస్తుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హార్మోన్ల మార్పుతో వారి మనసు నిలకడగా ఉండదు. విపరీతమైన ఆలోచనలు మెదడులో తిరుగుతుంటాయి. చెడును తొందరగా తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో వారికి మైదానమే ఒక దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. రోజూ ఏదో ఒక ఆటను వారితో ఆడించాలి. ధ్యానం, యోగాసనాలు వంటివి చేయించాలి. మంచి పుస్తకాలు చదవేలా ప్రోత్సహించాలి, అలవాటు చేయాలి. తల్లిదండ్రులు ఈ బాధ్యతలు తీసుకుంటే సమస్యలు రావు" -డా.ఓంప్రకాశ్, మానసిక వైద్య నిపుణులు, ఆదిలాబాద్
పిల్లలు అదుపులో ఉండాలని భయపెడుతున్నారా?
టీనేజర్ బర్త్‌డే పార్టీలో కాల్పులు.. నలుగురు మృతి.. 20 మందికి గాయాలు