TEACHERS TRANSFERS THROUGH ONLINE: పారదర్శకమైన ఆన్‌లైన్ బదిలీల విధానంతోనే ఉపాధ్యాయులకు మేలని, ఇందులో రాజకీయ జోక్యం, పైరవీకారులకు స్థానం ఉండదని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయ సంఘాలతో పలుమార్లు సంప్రదింపులు జరిపాక ఉపాధ్యాయుల బదిలీ చట్టాన్ని అమల్లోకి తెచ్చామని గుర్తు చేసింది. ఇందులో అన్ని బదిలీలను ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలనే నిబంధన ఉందని వెల్లడించింది.
సర్వీసు ఆధారంగా బదిలీలు, పదోన్నతులు: ఉపాధ్యాయ సంఘాలు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ ప్రకటన విడుదల చేసింది. సాంకేతిక పరిజ్ఞానంతో మానవ ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపట్టామని వెల్లడించింది. కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ విధానంపై తప్పుడు ప్రచారానికి దిగి టీచర్లను గందరగోళానికి గురి చేస్తున్నారంది. సర్వీసు ఆధారంగా మాత్రమే బదిలీలు, పదోన్నతులు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి వదంతులను నమ్మొద్దని సూచించింది. ఏపీ చరిత్రలో తొలిసారిగా 4,853 మందికి పదోన్నతులను ఆన్‌లైన్ ద్వారా ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పూర్తి చేశామని తెలిపింది. మే 21 నుంచి జూన్ 10వరకు బదిలీల షెడ్యూల్ ఖరారైందని, ఇప్పటి వరకు 35,235 మందికి బదిలీలు పూర్తయ్యాయని వెల్లడించింది.
పూర్తి పారదర్శకంగా ఉంటుంది: ఈ ఏడాది ఆన్‌లైన్ బదిలీల విధానంలో టీచర్లకు పలు వెసులుబాట్లు కల్పించామని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మండల కేంద్రం నుంచి పాఠశాలలకు ఎంత దూరం అనేది ఆన్‌లైన్‌లో ఉంటుందని దీని వల్ల దగ్గర పాఠశాలను ఎంచుకునే అవకాశం లభిస్తుందని స్పష్టం చేసింది. అన్ని ఖాళీలను తక్షణమే చూసుకునే అవకాశం ఉందని పేర్కొంది. పూర్తిగా పారదర్శకంగా ప్రక్రియ ఉంటుందని వెల్లడించింది. అభ్యంతరాలు, కోర్టు కేసులు గణనీయంగా తగ్గుతాయని, తక్కువ సమయంలోనే పెద్ద మొత్తంలో బదిలీలు పూర్తవుతాయని స్పష్టం చేసింది. 150-200 పాఠశాలలతో క్లస్టర్ ఏర్పాటు చేసి, క్లస్టర్ వారీగా పాఠశాలలను ఎంపిక చేసుకునే సౌలభ్యం ఇచ్చామంది.
మాన్యువల్ కౌన్సెలింగ్‌తో ఇబ్బందులు: వెబ్ ఐచ్ఛికాలను ఎన్ని సార్లైనా సేవ్ చేసుకోవచ్చని, తప్పనిసరి బదిలీ వారు తుది నిర్ధారణ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. అందుబాటులో వెబ్ ఐచ్ఛికాల ఎంపిక చేసుకునే విధానం వివరించే వీడియో అందుబాటులో ఉంటుందని పేర్కొంది. అన్ని స్థాయిల్లోనూ సహాయ కేంద్రాల ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మాన్యువల్ కౌన్సెలింగ్‌లో ప్రధానంగా కొత్తగా వచ్చే ఖాళీలను తక్షణమే చూపకపోవడంతో సీనియర్ టీచర్లు నష్టపోతారని వెల్లడించింది. పైరవీలు, లాబీయింగ్, అధిక మానవ జోక్యం, అక్రమాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది. రోజుకు 400-500 మందికి మాత్రమే కౌన్సెలింగ్‌కు అవకాశం ఉంటుందని తెలిపింది. బదిలీలు, పదోన్నతులు పూర్తి చేసేందుకు ఎక్కువ సమయం పడుతుందని, అర్ధరాత్రుళ్ల వరకు పడిగాపులు కాయాల్సి వస్తుందని వెల్లడించింది. మహిళలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్న వారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కౌన్సెలింగ్ కేంద్రాల వద్ద నిరీక్షించాల్సి వస్తుందని తెలిపింది.
ఉమ్మడి రాష్ట్రంలో 1998కి ముందు జిల్లా, మండల పరిషత్తు పాఠశాలల్లో టీచర్ల బదిలీలను జిల్లా పరిషత్తు ఛైర్మన్లు, జిల్లా విద్యాధికారులు నిర్వహించేవారు. ఆ తర్వాత అన్నింటిని డీఈఓల ఆధీనంలోకి తెచ్చారు. బదిలీలకు కౌన్సెలింగ్ వ్యవస్థ ప్రారంభమై 2014 వరకు కొనసాగింది. మాన్యువల్ కౌన్సెలింగ్‌లో రాజకీయ జోక్యంతోపాటు ఎక్కువ శ్రమ, సమయం, మానవవనరుల వృథా జరుగుతుంది. ఈ సమస్యలను అధిగమించేందుకు 2015లో వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇది కౌన్సెలింగ్ వ్యవస్థలో పారదర్శకత, నమ్మకాన్ని తీసుకువచ్చింది. ఇదే విధానాన్ని గత ప్రభుత్వం సైతం కొనసాగించింది. 2021లో 38,000 బదిలీలు, 2023లో 44,000 బదిలీలను ఆన్‌లైన్ ద్వారా జరిగాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది.
ఉద్యోగుల బదిలీలు, మినహాయింపులు - నూతన మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రారంభం - జూన్ 11తో ముగియనున్న ప్రక్రియ