ETV Bharat / state

ఉపాధ్యాయులకు అగ్ని'పరీక్ష' - టీచర్లను కలవరపెడుతున్న సుప్రీం తీర్పు​

ప్రతి ఉపాధ్యాయుడూ టెట్​ పాసవ్వాల్సిందేనన్న సర్వోన్నత న్యాయస్థానం - ఐదేళ్ల పైబడి సర్వీసు ఉన్నవారంతా టెట్​ పాసవ్వాలని తీర్పు - తీవ్ర ఆందోళనలో ఉపాధ్యాయులు

Supreme Court Makes Tet Mandatory For All Teachers
Supreme Court Makes Tet Mandatory For All Teachers (EENADU)
author img

By ETV Bharat Telangana Team

Published : September 19, 2025 at 4:52 PM IST

2 Min Read
Choose ETV Bharat

Supreme Court Makes Tet Mandatory For All Teachers : ఉపాధ్యాయులను టెట్(టీచర్​ ఎలిజిబిలిటీ టెస్ట్​) భయం వెంటాడుతోంది. ప్రతి ఒక్కరూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పాసవ్వాల్సిందేనని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు మెజార్టీ ఉపాధ్యాయులను కలవరపెడుతోంది. ఐదు సంవత్సరాలకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులంతా రెండేళ్లలో టెట్ పాస్‌కావాలని, లేదంటే ఉద్యోగం వదులుకోవాలని తీర్పు వెలువరించడం భిన్న వాదనలకు తెరలేపుతోంది. ఉద్యోగంలో కొనసాగాలన్నా, పదోన్నతి పొందాలన్నా ఉపాధ్యాయ అర్హత పరీక్ష తప్పనిసరి చేయడంతో విధుల్లో ఉన్న టీచర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

టెట్​లో అర్హత సాధించిన వారు కొందరే : విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి టెట్(టీచర్​ ఎలిజిబిలిటీ టెస్ట్​) తప్పనిసరి చేస్తూ 2010 ఆగస్టు 23వ తేదీన ఎన్‌సీటీఈ ఉత్తర్వులు జారీచేసింది. అప్పటికే సర్వీసులో ఉన్నవారికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టెట్ మినహాయింపును ఇచ్చింది. ఆదిలాబాద్​ జిల్లాలో ప్రస్తుతం డీఎస్సీ 1985 నుంచి మొన్నటి డీఎస్సీ 2024 వరకు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 2636 మంది టీచర్లు ఉండగా టెట్ పరీక్షలో అర్హత సాధించిన వారు కేవలం 791 మంది మాత్రమే ఉన్నట్లుగా విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.

ఉపాధ్యాయ అర్హత పరీక్ష- టెట్​ను 2010 నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఒకసారి, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2017 ఒకసారి, 2024లో మరోసారి డీఎస్సీని నిర్వహించారు. అంటే మూడు డీఎస్సీల్లో నియమితులైన 743 మంది మాత్రమే టెట్ పరీక్షలో అర్హత సాధించగా రెండేళ్ల కిందట ఎన్‌సీటీఈ ఉత్తర్వులతోనూ కొంతమంది అర్హత సాధించారు. అలాంటి వారు కేవలం 48 మంది మాత్రమే ఉండటం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్​ వేయాలని టీచర్​ యూనియన్​ నాయకులు కోరుతున్నారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే పనిలో సంఘాలు! : ఇదిలా ఉంటే ఏడాది వ్యవధిలో జిల్లాలో దాదాపు 200 మందికిపైగా ఉపాధ్యాయులు జీహెచ్‌ఎంలుగా(గెజిటెడ్​ హెడ్​మాస్టర్​), పీఎస్‌హెచ్‌ఎంలుగా, స్కూల్‌ అసిస్టెంట్లుగా టెట్ అర్హతలేకుండా ప్రమోషన్లు పొందారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రాబోవు పదోన్నతుల్లో జూనియర్లకు మేలు జరగనుంది. టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని మెజార్టీ సంఘాలు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే యత్నం చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పును పునః సమీక్షించేలా రివ్యూ పిటిషన్‌ వేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. దీనిపై ఏవిధంగా ముందుకెళ్లాలనే దానిపై ఉపాధ్యాయులు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

"మానవతా దృక్పథంతో సర్వీసులో ఉన్నవారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఇందుకోసం విద్యాహక్కు చట్టంలో మార్పులు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయాలి. టెట్ పరీక్ష తప్పదని భావిస్తే మాత్రం పరీక్షలో మార్పులు చేసి అందరికీ సమానంగా 40 శాతం మార్కులే అర్హతగా నిర్ణయించాలి"- తుమ్మ లచ్చిరాం, రాష్ట్ర అధ్యక్షుడు, టీయూటీఎఫ్‌

ఇదీ పరిస్థితి! :

  • ఆదిలాబాద్​ జిల్లాలో మొత్తం టీచర్లు: 2636
  • టెట్ అర్హత గలవారు: 791
  • లేనివారు: 1845 మంది టీచర్లు

ఈ గురువులు పాఠాలు మాత్రమే చెప్పలేదు - విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేశారు

సొంత డబ్బులతో సర్కార్ బడిని బాగుచేసిన హెడ్​మాస్టర్ - తమవంతుగా ఉచిత రవాణా ఏర్పాటు చేసిన టీచర్లు