TEACHER PROVIDE BREAKFAST FOR STUDENTS: శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవర చెరువు మండలం డబురువారిపల్లి ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు నాగరాజు విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందజేస్తున్నారు. పాఠశాలలో చదివే విద్యార్థుల ఆకలి తీరుస్తూ ఉదారతను చాటుకుంటున్నారు. సొంత ఖర్చులతో విద్యార్థులకు టిఫిన్ అందజేస్తున్నారు.
ఎస్సై మల్లికార్జున్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేసవి సందర్భంగా ఒంటిపూట బడుల కారణంగా విద్యార్థులు ఉదయం ఏడు గంటలకే పాఠశాలకు హాజరు కావలసి ఉంటుంది. ఆ సమయంలో ఇళ్లలో పిల్లలకు భోజన సదుపాయం కల్పించడం కష్టమవుతుండటంతో, ఆకలితోనే విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు 25 మంది విద్యార్థులకు అల్పాహార ఏర్పాటు చేశారు.
ఒంటిపూట బడి ముగిసేవరకు కొనసాగిస్తా: పాఠశాలలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో మధ్యాహ్న భోజనం విద్యార్థులకు ఇస్తుంటారు. అప్పటివరకు పిల్లలు ఆకలితో ఉండకూడదు అని ఉదయం పూట పాఠశాలలు పూర్తయ్యేవరకు ఈ కార్యక్రమాన్ని తాను కొనసాగిస్తానని ఉపాధ్యాయుడు నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు ఉపాధ్యాయుడు నాగరాజు సేవా హృదయానికి కృతజ్ఞతలు తెలిపారు.
"ఈరోజు నుంచి మా పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఎందుకంటే ఉదయం పూట విద్యార్థులు ఏమీ తినకుండా స్కూల్‌కి వస్తున్నారు. అలాగే ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం 12 గంటలకు అందిస్తున్నారు. ఈలోగా విద్యార్థులు ఏమీ తినకపోవడంతో ఆకలితో ఉంటూ ఇబ్బంది పడుతున్నారు. దీనిని చూసిన నేను విద్యార్థులకు రోజూ ఏదో ఒక టిఫిన్ పెట్టించాలని భావించాను. రోజుకు ఒక ఐటమ్ ఉంటుంది. ఈరోజు ఇడ్లీ, ఒకరోజు ఉప్మా, పులిహోర, పొంగలి. ఇలా సమ్మర్ హాలీడేస్ వరకూ పెట్టాలని కొనసాగించాలని అనుకుంటున్నారు. దీనిని ఈరోజు ఎస్సై మల్లికార్జునరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది". - నాగరాజు, ఉపాధ్యాయుడు
QR కోడ్‌తో టీచర్ వినూత్న ప్రయత్నం- విద్యార్థులకు అవి నేర్పించేందుకే!
'మమ్మల్ని విడిచి వెళ్లొద్దు' - ఉపాధ్యాయురాలి రిటైర్మెంట్లో కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు