ITDP Activist Chebrolu Kiran in Mangalagiri Court: మాజీ ముఖ్యమంత్రి జగన్ భార్య వైఎస్ భారతిపై సామాజిక మాధ్యమాలలో అభ్యంతరకరంగా మాట్లాడిన చేబ్రోలు కిరణ్‌ను మంగళగిరి పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. భద్రత కారణాల దృష్ట్యా చేబ్రోలు కిరణ్‌కు మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లోనే ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు నిర్వహించారు. అనంతరం అత్యంత భారీ బందోబస్తు మధ్య మంగళగిరి న్యాయస్థానంలోకి తరలించారు. న్యాయస్థానంలోనూ మంగళగిరి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో సుమారు వంద మంది పోలీసులు న్యాయస్థానంలో మోహరించారు.
వైఎస్ భారతి కేసులో కిరణ్ అరెస్టు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సతీమణి వై.ఎస్.భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త కిరణ్‌ను గుంటూరు జిల్లా పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో వైఎస్ భారతిని ఉద్దేశించి అతను చేసిన అసభ్య వ్యాఖ్యలను టీడీపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. కిరణ్‌కుమార్‌ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆ వెంటనే మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్‌లో కిరణ్‌పై బెయిల్‌కు వీల్లేని కఠిన సెక్షన్ల కింద కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ-ఇబ్రహీంపట్నం మధ్యలో కిరణ్‌కుమార్ ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
ఆగమేఘాలపై చర్యలు: నిందితుడు కిరణ్‌కుమార్‌పై మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించడం (బీఎన్‌ఎస్ 79), వర్గాల మధ్య శతృత్వాన్ని ప్రేరేపించడం (బీఎన్‌ఎస్ 196(1)), అనుచిత వ్యాఖ్యలు (బీఎన్‌ఎస్ 353(1)), నేరపూరిత కుట్ర (బీఎన్‌ఎస్ 61 (2)), వ్యవస్థీకృత నేరం (బీఎన్‌ఎస్ 111(1)), ఐటీ చట్టంలోని సెక్షన్ 67 (ఏ) వంటి బెయిల్‌కు వీల్లేని సెక్షన్ల కింద కేసులను నమోదు చేసి అరెస్టు చేసింది. అరెస్ట్‌కు ముందు తాను చేసిన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ కిరణ్‌కుమార్ ఒక వీడియో విడుదల చేశారు. ‘వైఎస్ భారతిగారు నన్ను క్షమించండి. మహిళలు అంటే నాకు గౌరవం ఉంది. నేను ఇంటర్వ్యూలో అసభ్యకరంగా మాట్లాడినందుకు మీ కాళ్లు పట్టుకుంటూ క్షమాపణలు కోరుతున్నా’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు: సామాజిక మాధ్యమాల్లో అసభ్య దూషణలకు సంబంధించి కిరణ్‌కుమార్‌పై తాడేపల్లి, పట్టాభిపురం పోలీసుస్టేషన్ల పరిధిలో రెండు కేసులున్నాయని, ఆందోళన కార్యక్రమాలకు సంబంధించి నగరంపాలెం, గన్నవరం పీఎస్‌ల్లో మరో రెండు కేసులున్నాయని గుంటూరు ఎస్పీ సతీశ్ తెలిపారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన పదే పదే అసభ్య దూషణలు చేస్తున్నారని, గతంలో మాజీ మంత్రి విడదల రజినిపై సైతం అసభ్య పోస్టులు పెట్టారని వివరించారు. వైఎస్ భారతిపై కిరణ్‌కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తమ దృష్టికి రాగానే కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు బంగు వెంకట కృష్ణారెడ్డి ఫిర్యాదుపై చర్యలు చేపట్టామన్నారు.
కిరణ్‌పై దాడికి యత్నించిన వైఎస్సార్సీపీ ఎంపీ: కిరణ్‌కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రభుత్వమే స్పందించి చట్టపరమైన చర్యలకు ఉపక్రమించగా.. వైకాపా నాయకుడు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పోలీసుల సమక్షంలోనే కిరణ్‌పై దాడికి యత్నించారు. పోలీసులు నిందితుడిని గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వాహనంలో తీసుకెళుతుండగా చుట్టుగుంట సెంటర్ వద్ద గోరంట్ల మాధవ్ తన కారు ముందుపెట్టి ఆ వాహనాలను అడ్డుకున్నారు. కిరణ్‌కుమార్‌తో సహా అతనితో పాటు ఉన్న ఎస్సై, మరో ఇద్దరి సిబ్బందిని సైతం వాహనంలో నుంచి బలవంతంగా బయటకు లాగేశారు. తమ విధులకు ఆటంకం కలిగించొద్దని పోలీసులు చెబుతున్నా సరే వినిపించుకోకుండా రోడ్డుపై నానా రాద్ధాంతం సృష్టించారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు యత్నించారు.
దీంతో పోలీసులు మాధవ్ వాహనాన్ని పక్కకు తప్పించి నేరుగా ఎస్పీ కార్యాలయానికి రాగా వారిని వెంబడిస్తూ మాధవ్ తన కారులో జిల్లా పోలీసు కార్యాలయానికి వెళ్లారు. అందరూ చూస్తుండగానే కిరణ్‌పై, పోలీసులపై మరోసారి దాడికి యత్నించారు. ‘ఇది మంచి పద్ధతి కాదు. మీరూ పోలీసు అధికారిగా పనిచేశారు’ అంటూ ఎంత నచ్చచెబుతున్నా.. వినిపించుకోకుండా మాధవ్ పోలీసులపై చిందులు తొక్కారు. దీంతో మాధవ్ వాహనాన్ని సీజ్ చేశారు.
గోరంట్ల మాధవ్‌పై కేసు నమోదు: తొలుత మాధవ్‌ను నగరంపాలెం స్టేషన్‌కు తరలించారు. తర్వాత నల్లపాడు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారని, విధి నిర్వహణలో ఉన్న పలువురు పోలీసులను దౌర్జన్యం చేసి కొట్టారని మంగళగిరి హెడ్‌కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుపై గుంటూరు పోలీసులు గురువారం రాత్రి పలు నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
మంత్రి లోకేశ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన గోరంట్ల మాధవ్‌పై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో మంత్రి లోకేశ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటనపై టీడీపీ0 నాయకులు జి.నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాధవ్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ కల్యాణ్‌రాజు తెలిపారు.
వైఎస్ భారతిపై అసభ్యకర వ్యాఖ్యలు - టీడీపీ కార్యకర్త అరెస్ట్
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్‌పై క్రిమినల్ కేసు పెట్టాలి: మంత్రి కొల్లు రవీంద్ర