Taking Bribe To Sanction Indiramma House : సత్తుపల్లి నియోజకవర్గంలోని కొన్ని గ్రామపంచాయతీల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి వసూళ్ల పర్వానికి తెరలేపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.15వేల నుంచి రూ.25వేల వరకు దండుకుంటున్నట్లు తెలిసింది.
కారేపల్లి మండలం భాగ్యనగర్‌తండాలో అనర్హులకు లబ్ధిదారుల జాబితాలో చోటు కల్పిస్తున్నారంటూ కొద్దిరోజుల క్రితం పలువురు మహిళలు ఆందోళన చేశారు. దుబ్బతండాలో జాబితా విడుదలయ్యాక పరిశీలనకు వెళ్లిన అధికారిని గ్రామస్థులు అడ్డుకున్నారు. లబ్ధిదారుల జాబితాలో నిరుపేదలకు చోటివ్వకుండా, డబ్బులు తీసుకుని అనర్హులను ఎంపిక చేస్తున్నారంటూ నిలదీయటంతో సర్వే ఆగిపోయింది.
అదే అవకాశంగా భావించి : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో వసూళ్ల పర్వం సాగుతోంది. ‘ప్రజాపాలన’లో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పంచాయతీ కార్యదర్శులు, ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరుగుతూ లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఇదే ఆసరాగా తీసుకుంటున్న స్థానికంగా చక్రం తిప్పే కొంతమంది నాయకులు, దళారులు ముఠాలుగా ఏర్పడి లబ్ధిదారుల జాబితాలో పేరు ఉండాలంటే డబ్బు ముట్టజెప్పాల్సిందేనంటూ డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తమ చేతిలో చిల్లిగవ్వ లేదని లబ్ధిదారులు చెబితే బిల్లు మంజూరయ్యాక చెల్లించాలంటూ ముందస్తుగా ఒప్పందాలు చేసుకుంటున్నట్లు సమాచారం.
తొలిదఫాలో ఉభయ జిల్లాల్లోని ప్రతి మండలానికి ఓ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టారు. ఖమ్మం జిల్లాలో 875, భద్రాద్రి జిల్లాలో 3,160 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ గ్రామాల్లో అర్హులకే ఇళ్లు మంజూరవటంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తలేదు. రెండో దశలో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు మంజూరయ్యాయి. ఉభయ జిల్లాల్లో లక్షకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఉభయలబ్ధిదారుల జాబితాలో పేరు ఉండాలంటే డబ్బు ముట్టజెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
ముందస్తుగా ఒప్పందాలు : ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించిన తర్వాత డబ్బులు ముట్టజెప్పేలా కొన్నిప్రాంతాల్లో, తొలిదఫా బిల్లు మంజూరైన తర్వాత చెల్లించేలా ఇంకొన్నిచోట్ల ముందస్తుగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిసింది. మరికొన్నిచోట్ల అధికార పార్టీ నాయకుల బంధువులు, కుటుంబ సభ్యులను లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రెండో దఫా లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన సర్వే తుదిదశకు చేరుకుంది. ఇప్పటికే ఇందిరమ్మ కమిటీల ఆధ్వర్యంలో దరఖాస్తుదారుల ఇంటింటి సర్వే పూర్తయ్యింది. అర్జీదారుల వివరాలు సేకరించి యాప్‌లో నిక్షిప్తపరిచారు. ప్రత్యేకాధికారుల బృందాల ఆధ్వర్యంలో తుది పరిశీలన ప్రక్రియ జరుగుతోంది. ఇది పూర్తయితే లబ్ధిదారుల జాబితా ఖరారు కానుంది. మంజూరయ్యే ఇళ్లతో పోల్చితే ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో దళారులు రంగప్రవేశం చేస్తున్నారు.
కలెక్టర్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలుచేస్తున్నామని ఖమ్మం గృహనిర్మాణశాఖ ఈఈ శ్రీనివాస్ తెలిపారు. నిజమైన పేదలకే ఇళ్లు దక్కేలా చూస్తున్నామని చెప్పారు. ఇందుకోసం దశల వారీగా సర్వే నిర్వహిస్తున్నామన్నఆయన దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఎక్కడైనా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులు అందితే విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇందిరమ్మ లబ్ధిదారులకు మరో అవకాశం - ఇళ్లు అలా నిర్మిస్తేనే బిల్లులు మంజూరు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మరో షాక్ - పెరిగిన సిమెంట్ ధరలు - బస్తాకు ఎంతో తెలుసా?