ETV Bharat / state

రూ.10 వేలకు మైనర్ బాలిక అమ్మకం - 'అన్న' రీల్​కు లైక్​ కొట్టడంతో వెలుగులోకి

ఆదిలాబాద్‌ జిల్లాలో వెలుగు చూసిన మానవ అక్రమ రవాణా - రూ.10 వేలకు బాలిక అమ్మకం - ఇద్దరు అరెస్టు, పరారీలో ప్రధాన నిందితుడు

Girl Trafficking in Adilabad
Girl Trafficking in Adilabad (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : June 29, 2025 at 9:33 AM IST

|

Updated : June 29, 2025 at 9:44 AM IST

3 Min Read
Choose ETV Bharat

Girl Trafficking in Adilabad : ఆదిలాబాద్‌ జిల్లాలో మానవ అక్రమ రవాణా కొనసాగుతోంది. పేదల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మైనర్‌ బాలికలను రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో విక్రయించే దందా సాగుతోంది. తాజాగా సామాజిక మాధ్యమంలో లభించిన ఆధారాలతో పోలీసులు కూపీ లాగడంతో మహారాష్ట్రకు చెందిన ఓ ముఠా వ్యవహారం వెలుగు చూసింది. ఈ ఘటనపై 'ఈటీవీ భారత్' ప్రత్యేక కథనం.

మాయమాటలతో అక్రమ రవాణా : నిషేధిత సరకులను రవాణా చేయటమే సంచలనం అన్నట్లుగా అనిపిస్తోంది. అలాంటిది పేదల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఏకంగా మనుషులను, అందులోనూ మైనర్‌ బాలికలను మాయమాటలతో అక్రమ రవాణా చేయటమంటే క్షమించరాని నేరం. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇటీవల చోటు చేసుకుంటున్న ఘటనలతో పోలీసు యంత్రాంగమే నివ్వెర పోవాల్సి వస్తోంది. కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఓ యువతి అక్రమ రవాణా ఘటన ఆధార్‌ కార్డు చిరునామా అప్డేడ్‌తో బయటపడింది. తాజాగా ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలానికి చెందిన మరో ఘటన ఇన్​స్టాగ్రామ్​ పోస్టుతో వెలుగుచూసింది.

పేదల ఆర్థిక ఇబ్బందులను ఆసరా చేసుకొని - బాలికల అక్రమ రవాణా (ETV)

రూ.10 వేలకు బాలిక విక్రయం : భీంపూర్‌ మండలంలోని ఓ కుటుంబానికి వ్యవసాయ పనుల రీత్యా మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా ఘాటంజీ తాలూకా కని గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఆత్రం నిర్మల - బావున్యతో పరిచయం ఉంది. దీన్ని ఆసరా చేసుకొని ఆత్రం నిర్మల-బావున్య మాయమాటలు చెప్పి, భీంపూర్‌ మండలంలో పెద్దమ్మ దగ్గర ఉండే ఓ మైనర్‌ బాలికను కుటుంబంలో పండగ ఉందని చెప్పి ఈ నెల 2న తమ ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం రాజస్థాన్‌లోని కోటా గ్రామ సమీపంలోని కరణ్‌ అలియాస్‌ భగత్‌ మీనాకు ఆమెను రూ.10 వేలకు విక్రయించారు.

ఇన్‌స్టాగ్రామ్​ పోస్టుతో వెలుగులోకి : తాజాగా మైనర్‌ బాలిక అన్న తన ఇన్‌స్టాగ్రామ్​లో తమ పండగకు సంబంధించిన ఓ వీడియోను పోస్టు చేశాడు. దాన్ని కరణ్‌ ఫోన్‌లో చూసిన మైనర్‌ బాలిక లైక్‌ చేసింది. లైక్‌ చేసిన గుర్తు తెలియని వ్యక్తి ఎవరని బాలిక సోదరుడు ఆరా తీశాడు. అందులో ఆమెకు పెళ్లైనట్లు దండలు మార్చి ఉండటం, పైగా తన పేరు రాసి ఉంచటంతో సోదరుడు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన భీంపూర్‌ సీఐ సాయినాథ్‌, ఎస్‌ఐ ప్రేంసింగ్‌ మహారాష్ట్రలోని ఆత్రం నిర్మల, భావున్యను అరెస్టు చేశారు. బాలికను పెళ్లి చేసుకున్న రాజస్థాన్‌కు చెందిన కరణ్‌ అలియాస్‌ భగత్‌ మీనా పరారీలో ఉన్నాడు. కరణ్‌పై అత్యాచారం, పోక్సో కింద కేసు నమోదు చేసి గాలిస్తున్నట్లు ఆదిలాబాద్‌ డీఎస్పీ జీవన్‌రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఆర్థిక ఇబ్బందులను ఆసరా చేసుకొని : ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌ మారుమూల ప్రాంతాల్లోని పేదల అమాయకత్వం, ఆర్థిక ఇబ్బందులను ఆసరా చేసుకొని, కొన్ని ముఠాలు మానవ అక్రమ రవాణా చేస్తున్న ఘటన కలకలం రేకెత్తిస్తోంది. మరోపక్క ఉత్తర భారతానికి చెందిన మరి కొంతమంది ఉన్నత కుటుంబాల ముఠాలు తమ సామాజిక వర్గాల్లో పెళ్లిళ్లకు ఆడపిల్లల కొరత ఉందనే నెపంతో, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పట్టణ ప్రాంతాలపై దృష్టి సారించటం మానవ అక్రమ రవాణాకు దోహదం చేసినట్లు వెల్లడవుతోంది.

"ఇద్దరు వ్యక్తులు లాభాపేక్ష కోసం జూన్ 2న తమ ఇంట్లో ఫంక్షన్ ఉందని నమ్మించి బాలికను నాగ్​పూర్​కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ట్రైన్​లో రాజస్థాన్​లోని కోటాకు సమీపంలోని ఓ గ్రామానికి తీసుకెళ్లి ఓ వ్యక్తికి విక్రయించారు. ఈ ముఠాపై అమ్మాయిల అక్రమ రవాణా, అత్యాచారం, పోక్సో కేసులు నమోదు చేసి అరెస్టు చేశాం. మరో గ్రామంలోనూ ఇంకో మైనర్ బాలిక కిడ్నాప్ కేసు నమోదైంది. దానిని కూడా ఈ కోణంలోనే పరిశీలిస్తున్నాం. ప్రతి రోజూ 'మీకోసం' అనే ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. సోషల్ మీడియా, మీడియా ద్వారా కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం." - జీవన్‌రెడ్డి,

డీఎస్పీ, ఆదిలాబాద్‌

గిరిజన మహిళల అక్రమ రవాణా - ఉలిక్కిపడ్డ ఆసిఫాబాద్​ గడ్డ

ఉపాధి పేరిట మహిళల అక్రమ రవాణా... ముఠా అరెస్ట్​

Last Updated : June 29, 2025 at 9:44 AM IST