ETV Bharat / state

ఇంట్లో ఏసీలు, కూలర్లతో బీకేర్​ ఫుల్​ - చిన్న తప్పిదం జరిగినా ప్రాణాలు గాల్లోనే!

వేసవికాలంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న ఏసీలు, కూలర్లు - విద్యుదాఘాతంతో ప్రమాదాలకు ఆస్కారం - ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే?

Take Care From When You Use AC And Cooler
Take Care From When You Use AC And Cooler (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 14, 2025 at 11:24 AM IST

3 Min Read
Choose ETV Bharat

Take Care From When You Use AC And Cooler : ఇటీవల కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలం గుల్లా తండాలో తల్లీకుమార్తెలను ఇనుప కూలర్‌ బలి తీసుకుంది. బాలిక కాలు ఇనుప కూలర్‌కి తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. పక్కనే ఉన్న తల్లి కుమార్తెను తాకింది. విద్యుదాఘాతానికి గురైన ఇద్దరూ మృతి చెందారు. విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఎయిర్‌ కండీషనర్‌ (ఏసీ)లు పేలిపోయి ఇళ్లు కాలిపోయి పలువురు సజీవ దహనమైన ఘటనలు గతంలో కొన్ని జరిగాయి.

సూర్యుడు ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ఉపశమనంగా అందరి ఇళ్లలో స్థోమతను బట్టి కూలర్లు, ఏసీ ఉపయోగిస్తున్నారు. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి లేనిదే క్షణం ఉండలేని పరిస్థితి. చిన్నపిల్లలు అయితే చల్లని గాలి లేనిదే నిద్రపోరు. మరి వాటిని సరిగ్గా వాడుతున్నారా? ఎప్పటికప్పుడు సర్వీసింగ్‌ చేయిస్తున్నారా? ఇటీవల కూలర్‌కి విద్యుత్తు సరఫరా జరిగి, ఏసీకి షార్ట్‌సర్క్యూటై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు అందరినీ ఆందోళన కలిగిస్తున్నాయి.

నాణ్యత కలిగిన వైర్లను ఉపయోగించాలి : ఏసీ పేలిన ఘటనలు అధిక శాతం షార్ట్‌సర్క్యూట్‌ వల్లే జరుగుతున్నాయని విద్యుత్తు శాఖ అధికారులు అంటున్నారు. ఇంటికి వైరింగ్‌ చేసే టైం అప్పటి అవసరాలు, ఆర్థిక స్థోమతను బట్టి తక్కువ నాణ్యత కలిగిన వైర్లను ఉపయోగించి ఉంటారు. కాలక్రమంలో ఇంట్లో విద్యుత్తు ఉపకరణాలు పెరుగుతాయి. వీటికి అధిక వోల్టేజీ అవసరం ఉంటుంది. నాటి తీగల సామర్థ్యం సరిపోక విద్యుదాఘాతం జరిగి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది.

వోల్టేజీ హెచ్చుతగ్గులు ప్రమాదాలకు కారణం : ఏసీల్లోని ఫిల్టర్లు, కాయిల్స్‌లో దుమ్ము పేరుకుపోవడంతో తొందరగా వేడెక్కుతాయి. దీంతో మంటలు చెలరేగే ప్రమాదం ఉంది. అవిశ్రాంతంగా వీటిని వాడటం మంచిది కాదు. వోల్టేజీ హెచ్చుతగ్గులు ప్రమాదాలకు కారణం అవుతాయి

ధర తక్కువ ప్రమాదం ఎక్కువ : ఎక్కువ రోజులు ఉపయోగించవచ్చని, ధర తక్కువని మధ్య తరగతి వారు ఇనుప కూలర్లవైపు ఆసక్తి చూపుతారు. ఇవి ఇంటి వెలుపల కిటికీలకు అమర్చుకోవడానికి సులువుగా ఉంటాయి. వీటిని ఒక సీజన్‌లో ఉపయోగించాక, తదుపరి వేసవి కాలానికి రంగు పోయి, తుప్పుపడుతుంటాయి. విద్యుత్తు వైర్లు దెబ్బతిని ఇనుప కూలర్‌ ఉపరితలానికి కరెంట్‌ సరఫరా అవుతుంది. ఇది విద్యుదాఘాతానికి దారితీస్తుంది.

ఆ కూలర్లను వాడకపోవడం మంచిది : ఇలాంటి పాత ఇనుప కూలర్‌లోని పరికరాలు, విద్యుత్తు తీగలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్​ చేయించాలి. తప్పనిసరిగా రంగు వేయించాలి. నాలుగు సంవత్సరాలు దాటిన ఇనుప కూలర్లను వాడకపోవడమే చాలా మంచింది.

స్విచ్‌ ఆఫ్‌ చేయాల్సిందే : కూలర్‌ పని చేస్తుండగానే చాలా మంది అందులో నీటిని నింపుతుంటారు. ఇది చాలా ప్రమాదకరం. స్విచ్‌ ఆఫ్‌ చేసిన తరువాతే నీటిని నింపాలి. కూలర్‌ పక్కకు జరపాలన్నా స్విచ్‌ ఆఫ్‌ చేయాల్సిందే. చుట్టూ ఎలాంటి నీరు లేకుండా చూసుకోవాలి. ప్లాస్టిక్‌తో చేసిన బాడీ ఉన్న కూలర్ల అయినా ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

"ఇళ్లలో ఫ్యూజులకు బదులుగా ఎర్త్‌ లీకేజీ సర్క్యూట్‌ బ్రేకర్‌ (ఈఎల్‌సీబీ), రెసిడ్యూయల్‌ కరెంట్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌ (ఆర్‌సీసీబీ)లను వాడాలి. వీటి వల్ల అధిక వోల్టేజీ విద్యుత్తు సరఫరా అయినప్పుడు షార్ట్‌ సర్క్యూట్‌ కాకుండా ఉంటుంది. ఏసీల్లోని రిఫ్రిజిరంట్‌ లీకేజీ వల్ల అగ్ని ప్రమాదం వస్తుంది. ఆ లిక్విడ్‌కు నిప్పు అంటుకున్నప్పుడు పెద్ద పేలుడు జరుగుతుంది. ఎప్పటికప్పుడు వాటిని సరిచూసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ ప్రమాదాలను నివారించవచ్చు" - చక్రపాణి, చీఫ్‌ ఇంజినీర్, మెట్రో జోన్, టీజీఎస్‌పీడీసీఎల్‌

హైదరాబాద్​లోని ఆ ప్రాంతంలో తరచూ పాడవుతున్న ఏసీలు - అలా ఎందుకు జరుగుతుందంటే?

నెలల తర్వాత ఏసీ వాడుతున్నారా? - అయితే ఇవి చెక్‌ చేసి వాడితే బెటర్!