Swimming Accidents Increase During Summer : వేసవి వస్తుందంటే చిన్నారులకు, విద్యార్థులకు చెప్పలేనంత ఆనందం. పుస్తకాలను పక్కన పెట్టి ఆటలు, అమ్మమ్మ ఇళ్లు, ఊర్లు అంటూ ఇష్టం వచ్చినట్లు తిరుగుతారు. ఈ ఆనందం వెంటే విషాదాలు పొంచి ఉంటాయి. ఈత, మోటారు సైకిల్ రైడింగ్, మండే ఎండలు చిన్నారులకు ముప్పు తెప్పిస్తాయి. చివరకు తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగులుస్తున్నారు. వేసవిలో ఎండ తాపానికి తట్టుకోలేక, సరదాగా ఈత నేర్చుకోవడానికి వెళ్లి మృతి చెందుతూ చివరకు తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చుతున్నారు. పిల్లలు పెద్దల సంరక్షణలోనే ఈత నేర్చుకునేలా తల్లిదండ్రులు చొరవ చూపాలి. బావులు, చెరువులు, కాలువల్లో జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పించాలి.
- తల్లిదండ్రులు వేసవి కాలంలో వీలును బట్టి పిల్లల కోసం అధిక సమయం కేటాయించి సరదాగా గడపాలి.
- ఖాళీ సమయాల్లో విజ్ఞాన, వినోద సంబంధమైన పుస్తకాలు చదివించాలి.
- ఇంటిపట్టున ఉండే పిల్లలకు ఇంటి పనిలో సాయం చేసే అలవాటు నేర్పించాలి.
- పిల్లలు మారాం చేస్తున్నారని కోపగించుకోకుండా సన్మార్గంలో పెట్టాలి.
- ఇంటి నుంచి బయటకు వెళ్తే తప్పకుండా సమాచారం ఇచ్చి వెళ్లేలా చెప్పాలి.
ఇటీవల జరిగిన ప్రమాదాలు :
- నల్గొండ జిల్లాలో ఆదివారం ఒక్కరోజే ముగ్గురు యువకులు నీటిలో మునిగి మృతి చెందారు. చిట్యాల మండలం ఏపూర్‌లోని డీఈసీ పరిశ్రమలో పనిచేస్తూ ఆదివారం సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి చింతపల్లి రాఘవేంద్ర(21), నలుపరాజు నవీన్‌కుమార్ (23)అనే ఇద్దరు నీట మునిగి మృతి చెందారు.
- తిరుమలగిరి మండలం అనంతారానికి చెందిన శీల శ్రీశైలం(23) ఆదివారం చెరువులోకి దిగిన పశువులను కొట్టుకొచ్చేందుకు వెళ్లి నీటిలో మునిగి మరణించాడు.
- తాజాగా చందంపేట మండలం నక్కలగండి తాండాలో నీటి గుంతలో పడి ఇద్దరు సోదరులు చనిపోయారు.
- చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన తండ్రి లింగయ్య, కొడుకు శ్రీమణికాంత్‌లు గురుకుల ప్రవేశ పరీక్షకు వెళ్లి వస్తూ వేములపల్లి వద్ద సాగర్ కాల్వలోకి సరదాగా ఈత కోసం దిగి ఇద్దరూ మృతి చెందారు.
ప్రతిరోజు పర్యవేక్షణ అవసరం : వేసవిలో పిల్లలు గంటల తరబడి నీళ్లచెంతనే ఆడుతుంటారని, తోటివారిని అనుకరిస్తూ ఈతరాకున్నా నీళ్లలోకి దిగుతూ ప్రమాదాల బారిన పడుతుంటారని నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి తెలిపారు. పిల్లలపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రతిరోజు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రమాదకరమైన చెరువులు, కాల్వల వద్ద పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో సూచిక బోర్డులను ఏర్పాటు చేయిస్తామన్నారు. బావులు, రోడ్డు ప్రమాదాలపై యువతకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.