మీ పాఠశాలకు 'ఫైవ్ స్టార్' రావాలా? - స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్‌లో పాల్గొనండి
పాఠశాలల్లో స్వచ్ఛత, పచ్చదనమే లక్ష్యంగా 'స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్' - జాతీయ స్థాయిలో ఎంపికైతే రూ.లక్ష నగదు - అన్ని పాఠశాలలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్న అధికారులు

Published : October 6, 2025 at 2:50 PM IST
Swachh Evam Harit Vidyalaya Rating : ప్రభుత్వ పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించేందుకు కేంద్ర విద్యాశాఖ ‘స్వచ్ఛ ఏవమ్ హరిత విద్యాలయ రేటింగ్’ పథకాన్ని అమలు చేస్తోంది. నీటి వసతి, పరిశుభ్రత, పారిశుద్ధ్యం, పర్యావరణహిత పరిసరాలు, మొక్కలు, చెట్లతో పచ్చదనంతో విలసిల్లేలా స్కూల్ ప్రాంగణాలు మేటిగా ఉండేలా ఈ విధానాన్ని ప్రారంభించింది. జాతీయ స్థాయిలో ఎంపికైతే అలాంటి ప్రభుత్వ పాఠశాలలకు నగదు ప్రోత్సాహకాన్ని అందించి ప్రోత్సహించనుంది. మరి దీనికి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా రేటింగ్‌లు ఇస్తారు? పోర్టల్‌లో ఏ విధంగా నమోదు చేసుకోవాలి? తదితర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
జాతీయ స్థాయిలో 200 పాఠశాలలు : జిల్లా స్థాయి ఎంపికకు 3 స్టార్ రేటింగ్‌కు 6 పాఠశాలలు, 4 చుక్కలకు రాష్ట్రస్థాయిలో 20, 5 చుక్కల రేటింగ్‌కు జాతీయ స్థాయిలో 200 పాఠశాలలను ఎంపిక చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
ఎవరు పాల్గొనవచ్చు : ఈ విధానం అన్ని యాజమాన్యాల్లోని 1-10వ తరగతి వరకు అంటే ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత స్కూళ్లకు వర్తిస్తుంది. ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లు ఎస్‌హెచ్‌వీఆర్ వెబ్‌పోర్టల్‌లో ప్రతి సూచికకు సంబంధించిన వివరాలను ఫొటోలతో సహా ఈ నెల 15వ తేదీ వరకు అప్‌లోడ్ చేయాలి. మొత్తం 6 ప్రధాన కొలమానాలకు సంబంధించి 60 సూచికల ఆధారంగా రేటింగ్‌లో ఒకటి నుంచి 5 స్టార్లను కేటాయించనుంది.
పోర్టల్‌లో నమోదు : నిర్దేశిత పోర్టల్‌లో పాఠశాలల హెచ్ఎంలు(హెడ్మాస్టర్లు) వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. నీటి వసతి, టాయిలెట్లు, విద్యార్థులు చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవడం, ప్రవర్తన మార్పు, సామర్థ్యాల నిర్మాణం(కెపాసిటీ బిల్డింగ్), నిర్వహణ, తదితర 60 అంశాలు నమోదు చేయాల్సి ఉంటుంది. నమోదు కాగానే సర్వే విజయవంతంగా సమర్పించినట్లు మెసేజ్ వస్తుంది. రేటింగ్ ప్రకారం ఫైవ్ స్టార్ వస్తే ‘అద్భుతం’ (ఎక్సలెంట్) అని, ఫోర్ స్టార్ వస్తే ‘చాలా బాగుంది’.(వెరీగుడ్), త్రీస్టార్ వస్తే ‘బాగుంది’ (గుడ్) టూస్టార్ వస్తే ‘ సౌకర్యాలు మెరుగుపడాల్సిన అవసరం ఉంది’ (నీడ్స్ ఇంప్రూవ్ మెంట్), వన్ స్టార్ వస్తే ‘అతి తక్కువ’ (పూర్) అనే రేటింగ్‌లు ఇస్తారు. దేశవ్యాప్తంగా ఉత్తమ స్కోర్‌ను సాధించిన పాఠశాలలకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపును ఇస్తారు. జాతీయ స్థాయిలో ఎంపికైన స్కూళ్లకు ప్రోత్సాహకంగా రూ.లక్ష చొప్పున నగదును అందజేస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి : అన్ని పాఠశాలలు 100 శాతం నమోదును వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని మహబూబాబాద్ జిల్లా సైన్స్ అధికారి బి.అప్పారావు పేర్కొన్నారు. ఇంకా సమయం ఉందని జాప్యం చేయకుండా తక్షణమే ప్రతి పాఠశాల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
| మార్కుల కేటాయింపు ఇలా | |
| నీటివసతి | 22 |
| శౌచాలయాల నిర్వహణ | 27 |
| చేతుల శుభ్రత | 14 |
| ప్రవర్తన మార్పులు | 21 |
| విద్యార్థుల నడవడిక | 20 |
| పిషన్ లైఫ్ కార్యకలాపాలు | 21 |
ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల నిర్మాణానికి రూ.11 వేల కోట్లు - మంజూరు చేసిన విద్యాశాఖ

