Kancha Gachibowli Land Issue : వివాదం రేపిన కంచ గచ్చిబౌలిలోని భూములను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సాధికారక కమిటీ పరిశీలించింది. కమిటీ ఛైర్మన్ సిద్ధాంత దాస్, సభ్యులు సీపీ గోయల్, సునీల్ లిమాయే, చంద్రదత్ దాదాపు గంటపాటు 400 ఎకరాల స్థలంలో కలియ తిరిగి అక్కడి పరిస్థితులను రికార్డు చేశారు. HCU విద్యార్థులతోనూ కమిటీ సమావేశమైంది. విద్యార్థులు కంచ గచ్చిబౌలి భూముల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులను వివరిస్తూ రూపొందించిన నివేదికను కమిటీకి అందజేశారు.
కంచ గచ్చిబౌలి భూముల పరిశీలన అనంతరం సుప్రీంకోర్టు సాధికారక కమిటీ ఛైర్మన్, సభ్యులు తాజ్ కృష్ణా హోటల్‌కు వెళ్లారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, జీఏడీ ముఖ్య కార్యదర్శి రఘునందన్, సీఎంవో కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, డీజీపీ జితేందర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, జలమండలి ఎండీ, టీజీఐఐసీ ఎండీతో సమావేశమైంది. కంచ గచ్చిబౌలి భూములపై ప్రభుత్వ అధికారులతో కమిటీ చర్చించింది. అనంతరం కంచ గచ్చిబౌలి భూములపై కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించింది. ఆ తర్వాత HCU పాలకవర్గంతో సాధికారక కమిటీ ప్రత్యేక భేటీ అయింది. వరుస భేటీల అనంతరం సుప్రీంకోర్టు సాధికార కమిటీ పర్యటన ముగించుకుని దిల్లీ పయనమైంది.
కంచె గచ్చిబౌలి భూములపై హరీశ్‌రావు ప్రెస్‌మీట్ : కంచె గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించి... కంచే చేను మేసినట్లు వేలాది చెట్లు కొట్టి వేసిందని, జంతువుల మరణానికి కారణమైందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు సాధికారక కమిటీకి వివరించారు. సర్కార్ ఉల్లంఘనల తీరు, వాస్తవ అంశాలు అన్నింటినీ పార్టీ తరపున డాక్యుమెంట్లు వారికి సమర్పించారు.
రాష్ట్రంలో ఎక్కడ ఒక్క చెట్టు కొట్టి వేయాలన్నా వాల్టా చట్టం, అటవీశాఖ కింద అనుమతి తప్పనిసరి అని, ఎలాంటి అనుమతులు లేకుండా 50 బుల్డోజర్లు పెట్టి వేల చెట్ల కొట్టారని, జంతువుల ఆవాసాన్ని దెబ్బ తీశారని హరీశ్ రావు మీడియా ముందు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేలాది చెట్లు కొట్టినా, జీవ విధ్వంసానికి పాల్పడినా కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు.
మూడు జింకల చావుకు కారణమైన సీఎంపై చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. హైదరాబాద్ నడిబొడ్డున 400 ఎకరాల్లో విధ్వంసం జరుగుతోంటే అటవీ శాఖ అధికారులు, పీసీసీఎఫ్ స్పందించలేదని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో అటవీ లక్షణాలు కలిగిన అటవీయేతర భూములను గుర్తించేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని హరీశ్ రావు గుర్తు చేశారు.
3 రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు కొట్టివేత చిన్న విషయం కాదు - సీఎస్ సమాధానం చెప్పాలన్న సుప్రీం