Kids summer Activities : వాసు చాలా తెలివైన పిల్లాడు. ఆటల్లోనూ, చదువులోనూ ఎప్పుడూ ముందే ఉంటాడు. కానీ ఏ పని చేసినా ఒంటరిగానే చేయడానికి ఇష్టపడతాడు. తన తోటి వారితో మాత్రం అస్సలు కలిసి ఉండడు. తోటి స్నేహితులతో గొడవ పడుతూనో, కంప్లైంట్స్ చేస్తూనో ఉంటాడు. ఇది కేవలం వాసు సమస్య మాత్రమే కాదు. మనలో చాలా మంది ఇలానే ఉంటారు. దీనికి కారణం ఏంటంటే టీంతో కలిసి మెలగడం తెలియకపోవడమే! మరి ఈ హాలిడేస్‌లో టీమ్ బిల్డింగ్ స్కిల్‌ను నేర్చుకుందామా పిల్లలూ! అందరితో కలిసి ఎలా ఉండాలో కూడా నేర్చేసుకుందామా మరీ.
ఈ పనులు కచ్చితంగా చేయండి :
- మనం అందరితోనూ కలిసి ఉండటం అనేది ఇప్పుడే కాదు, పెద్దయ్యాక కూడా ఎంతో అవసరం. అందుకే దాన్ని అలవాటుగా మార్చుకోవాలి.
- ఈ సెలవుల్లో ఎక్కువ మంది స్నేహితులతో కలవండి.
- స్నేహితులంతా జట్టుగా ఆడే ఆటలు ఎక్కువ ఆడండి. వాళ్లు నచ్చలేదు, వీళ్లు వద్దు అని ఎవరినీ దూరం పెట్టకూడదు.
- మిగతా స్నేహితులు చెప్పేది కాస్త వినండి. వారికి నచ్చిన ఆటలు కూడా ఆడండి. వారికి దెబ్బలు తగిలినా, ఆటలో ఏదైనా ఇబ్బంది వచ్చినా వెంటనే సాయం చేయండి.
- తరగతి గదిలోనూ, ఆటలు ఆడేటప్పుడు గ్రౌండ్లో అప్పుడప్పుడు ఫ్రెండ్స్‌తో చిన్నచిన్న తగాదాలు వస్తూ ఉంటాయి. దాన్ని పట్టించుకుని వారితో స్నేహం మానేయవద్దు. టీమ్‌లో చేరకుండా మనం ఒంటరిగా ఉండిపోకూడదు.
- టీమ్‌వర్క్ చాలా గొప్పది. అందుకే మన కథల్లో సైతం ఐకమత్యమే మహాబలం అని నినాదం ఉంటుంది.
- ఒక టీమ్‌లో బెస్ట్ మెంబర్‌గా ఉంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా బెస్ట్ కాగలం!
మరి ఇప్పుడు చెప్పిన విషయాలను గుర్తించుకుని మీ స్నేహితులతో సాయంత్రాలు ఆడేటప్పుడు, సమ్మర్ క్యాంపులో కోచింగ్ తీసుకునేటప్పుడు మంచి టీమ్ మెంబర్ అవుతారు కదూ పిల్లలు!
థ్రిల్లింగ్ - స్పెల్లింగ్ : మనందరికీ పదాలు తెలుసు. కానీ వాటి స్పెల్లింగ్స్ తెలుసా అంటే కొంచెం ఆలోచిస్తాం. ఈ సెలవుల సమయాన్ని వీటిని నేర్చుకోవడానికి ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా! ఎందుకంటే మనకు ఎన్ని వర్డ్స్ తెలిసినా భాష మీద పట్టు రావాలంటే వాటి స్పెల్లింగ్ కూడా తెలియడం అంతే అవసరం. ఇలా పదాలను నేర్చుకోవడం మనకు లాంగ్వేజ్ మీద ఇష్టాన్ని పెంచుతాయి. కొత్తవి తెలుసుకుంటూ ఉంటే కాన్ఫిడెన్స్ పెరిగి, వాటిని ఉపయోగించినప్పుడు థ్రిల్లింగ్‌గా ఉంటుంది మరీ!
ఇందుకోసం ఒక్కరుగా లేదా ఫ్రెండ్స్‌తో కలిసి ప్రాక్టీస్ చేయొచ్చు. అందరూ కలిసి చేయడం ఎప్పుడూ మంచి ఫలితాలు ఇస్తుంది. తెలియని పదాలు వెతికి, వాటి అర్థాలు, స్పెల్లింగ్ చదువుతూ ఒక చోట రాయాలి. ఫ్రెండ్స్ కలిసి ఒకరికి ఒకరు చెప్పుకోవాలి. చదవడం, రాయడం, పలకడం చేస్తుంటే వాటితో చిన్నచిన్న గేమ్స్ కూడా ఆడేయవచ్చు. మరీ ఈ హాలిడేస్‌లో స్పెల్లింగ్ థ్రిల్‌కు రెడీనా పిల్లలూ!
కాగితమే పడవగా మారితే : ఫ్రెండ్స్ ఇప్పుడు కావడానికి ఎండాకాలమే అయినా, అప్పుడప్పుడు వర్షాలు కురుస్తాయి. పైగా వచ్చేది వర్షాకాలం. మీలో సృజనాత్మకత పెరిగేలా ఎంచక్కా పడవలు చేసి నీటిలో వదులుదామా! కాగితపు పడవలు చేయడం చాలా బాగుంటుంది. ఎంతో సింపుల్ కూడా. వాటిని నీళ్ల బకెట్‌లోనూ కుండీలోనూ, ఎక్కడైనా వదలొచ్చు. కానీ జాగ్రత్తగా ఉండాలి. స్క్వేర్ షేప్‌లో ఒక పేపర్ ఉంటే చాలు బోలెడన్న పడవలు చేసి ఆడుకోవచ్చు. కాగితాలతో కెమెరాలు, హంసలు, కుందేలు, లంచ్ బాక్స్, పక్షులు ఇలా చాలా క్రాప్ట్స్నే చేయొచ్చు. మీ ఇంట్లో ఈ పడవలు చేయడం ఎవరికో ఒకరికి వచ్చే ఉంటుంది. మరి ట్రై చేస్తారా!
పాత+కొత్త : ఫొటో ఆల్బమ్స్ చూడటం భలే సరదాగా ఉంటుందేం! మన చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు, పుట్టినరోజున, కొత్తబట్టలు వేసుకున్నప్పుడు మన ఇంట్లో వాళ్లు చాలా ఫొటోలు తీసి ఉంటారు కదా! అలాగే అమ్మా, నాన్న, తాతయ్య, బామ్మ వాళ్లకు సంబంధించిన చిన్ననాటి ఫొటోలూ ఉంటాయి. వాటిని చూడటం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఆ రోజులు, అప్పటి వస్తువులు, స్టైల్స్ చూడటం కోసం ఈ సెలవుల్లో సరదాగా వాటిని ఒకసారి తిరగేద్దామా.
- తాతయ్యవి, నాన్నవి, అమ్మవి, మీవి.. ఫొటోలు పక్కపక్కనే పెట్టి పోల్చి చూడండి.
- అప్పుడు వాళ్లు వేసుకున్న, మీరు వేసుకున్న డ్రెస్ మోడల్స్‌లో మార్పులు ఏం వచ్చాయో గమనించండి.
- చిన్నప్పుడు ఎలా ఉన్నారు.. ఇప్పుడు ఎలా ఉన్నారు.. మిమ్మల్ని మీరు చూసుకుంటే సూపర్ ఫన్‌గా ఉంటుంది.
- ఆ ఫొటోలు ఎప్పుడు తీశారు, ఎవరు తీశారు, ఎన్నేళ్ల నుంచి దాచారు.. ఇలా పెద్దవాళ్లను వివరాలుఅడగండి.
- వాళ్ల కాలంలో ఉపయోగించిన కెమెరాల గురించి తెలుసుకోండి.
- బోలెడంత టైమ్‌పాస్ ఇచ్చే ఈ ఆల్బమ్స్ ఇంట్లో ఎక్కడ దాచారో వెంటనే అమ్మను వెళ్లి అడగండి!
చెప్పగలరా? : ఒక గదిలో ఆరు అద్దాలు చుట్టూ అమర్చి ఉన్నాయి. ప్రతి అద్దంలోనూ ఒక మనిషి ప్రతిబింబం కనిపిస్తే, మొత్తంగా ఆ గదిలో ఎంత మంది ఉన్నారు? ఒకరు(ఒక్కరే ఆరు అద్దాల్లోనూ కనిపిస్తారు)
ఇది ఆరంభం మాత్రమే - ప్రాక్టీస్ మేక్స్ పర్‌ఫెక్ట్ సూత్రంతో లక్ష్యాన్ని సాధించాలి
సమ్మర్ హాలిడేస్‌లో కొత్తగా ఏం చేయొచ్చో తెలుసా? - జాబితాను టిక్ చేసుకుంటూ వెళ్లండి