Summer Activities For Kids : హాయ్ పిల్లలు ఈ వేసవి సెలవుల్లో రోజుకో కొత్త విషయం తెలుసుకుంటున్నాం కదా. మరి ఈ రోజు మెడిటేషన్, ప్రయోజనాలతో పాటు మరికొన్ని అంశాల గురించి వివరంగా నేర్చుకుందాం. మనం క్లాస్ రూంలో పాఠాలు చక్కగా వింటాం. కానీ అప్పుడప్పుడు ఏకాగ్రత తప్పి వేరే ఏదో ఆలోచనలోకి వెళ్లిపోతుంటాం. అలాంటి సమయాల్లో టీచర్ చూస్తే అంతేసంగతి. చాలా కోప్పడతారు. మరి అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ధ్యానం (మెడిటేషన్) చేయడం వల్ల అలాంటివి జరగకుండా ఉంటుంది. ఫలితంగా అధిక సమయం ఏకాగ్రతతో పాఠాలు వినగలం.
ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు, ఫ్రెండ్స్‌లో ఎవరితోనైనా గొడవ పడినా చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది మీరెప్పుడైనా గమనించారా? ఆ టైమ్‌లో వాటి గురించి ఆలోచించకుండా ఉండటం కొంచెం కష్టమవుతుంది. అలా జరగకుండా మనకు మెడిటేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం మానసికంగా బలంగా తయారవ్వడానికి, చుట్టూ ఏం జరుగుతుందో అనే విషయాన్ని అర్థం చేసుకుని ప్రవర్తించేందుకు ఇది చాలా చక్కని ఉపాయం. ఒక్కోసారి రాత్రిళ్లు ఎంతసేపు ప్రయత్నించినప్పటికీ నిద్ర రాదు. ఆడుకోవాలనో, కార్టూన్ చూడాలనో అనిపిస్తుంటుంది. అప్పుడు అమ్మ ‘ఇంకా నిద్రపోలేదా?’ అని కోప్పడుతుంది. ఇలా కాకుండా మనకు రోజూ ఒకే సమయానికి నిద్రవచ్చేలా మెడిటేషన్ చేయగలదు తెలుసా?
మరి ఇంకెందుకు ఆలస్యం. చక్కగా అమ్మానాన్నలను ఎలా చేయాలో అడిగి మీరు కూడా మెడిటేషన్(ధ్యానం) ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టేయండి! ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసినట్లూ ఉంటుంది, కొత్త క్లాస్‌లో బాగా చదవగలుగుతాం.
సముద్రంలో ఏమున్నాయ్ : వేసవి సెలవుల్లో బీచ్‌లకు వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తుంటాం కదా. మరి ఎప్పుడైనా మీరు ఆలోచించారా, ఆ సముద్రం అడుగున ఏముంటుందో అని?
సముద్రం లోతుల్లో ఎన్నో రకాల జీవులు బతుకుతూ ఉంటాయి. చిన్నచిన్న చేపలు, ఆక్టోపస్‌లు, పెద్దపెద్ద తిమింగలాలు, తాబేళ్లు, పీతలు, రొయ్యలు, స్టార్‌ఫిష్‌లు, సీహార్స్‌లు ఇలా చాలా రకాల జీవజాలం అందులో నివసిస్తుంది. మరి వీటిలో మీకు ఎన్నింటి గురించి తెలుసు? సరదాగా మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారా! అలా చేయాలంటే సముద్రం లోపల ఏమేం ఉంటాయో వివరించే పుస్తకాలు చూడండి. వాటి బొమ్మలు గీచేందుకు ప్రయత్నించండి.
మేఘాల ముచ్చట్లు : సాయంత్రాలు టెర్రస్ మీద ఆటలాడి అలసిపోయినప్పుడు కాసేపు అలా కూర్చోవాలి అనిపిస్తుంది కదూ. అలా మన స్నేహితులతోనో, అమ్మానాన్నలతో రిలాక్స్‌గా కూర్చుని ఉన్నప్పుడు ఒక్కసారి నీలి ఆకాశంలోకి చూడండి! అక్కడ బోలెడన్ని క్లౌడ్స్ కనిపిస్తాయి కదూ. అవి మామూలుగానే ఉంటాయి కానీ, మనం ఊహించుకుంటే అచ్చం ఆ ఆకారాల్లోనే కనిపించడం మొదలుపెడతాయి. కుందేలు, చందమామ, కైట్ ఇలా ఏ షేప్ అనుకుంటే మనకు మబ్బు ఆ విధంగా కనపడుతుంది. వాటిలో ఏది ఏ ఆకారానికి దగ్గరగా ఉందో కనిపెట్టడం భలే సరదాగా ఉంటుంది తెలుసా? పిల్లలూ. అవే క్లౌడ్స్ మనకు ఒకలా కనిపిస్తే, మన పక్కనున్నవారికేమో మరోలా కనిపిస్తాయి.
ట్విస్ట్ చేసేద్దాం : టంగ్ ట్విస్టర్స్ భలే ఉంటాయి కదా పిల్లలూ. పలికేకొద్దీ మరింత బాగా పలకడం నేర్పిస్తాయవి. తప్పుగా పలికితేనేమో చాలా నవ్వొచ్చేస్తుంది. ఈ హాలిడేస్‌లో వాటిని ఉపయోగించి ఎలా ఆడుకోవచ్చంటే
స్నేహితులందరూ కలిసి ఒక చోట కూర్చోవాలి. మొదట ఒకరు ఒక టంగ్ ట్విస్టర్‌ను చెప్పాలి. వారు చెప్పిన దాన్ని తక్కిన వారు ఒక్కొక్కరు 5 సార్లు చొప్పున రిపీట్ చేయాలి. తప్పుగా చెబితే మళ్లీ మరో ఐదుసార్లు చెప్పమనాలి. ఆ విధంగా ఒకరు ఇచ్చినదాన్ని అందరూ చెప్పేశాక రెండోవారు మరోటి ఇస్తారన్నమాట. ఈ విధంగా చేయడం మనకు పలకడం బాగా నేర్పించడం మాత్రమే కాదు తప్పు చెబితే ఫన్నీగానూ ఉంటుంది. ఒకవేళ చెప్పలేకపోయినా పర్లేదు ఏంకాదు, మళ్లీ ట్రైచేయొచ్చు. అందుకే మొదలుపెట్టేయండి ఇక!
చెప్పగలరా? : ఒకబ్బాయిని మీ పేరేమిటి అని అడిగితే ఇంగ్లిష్‌లో ‘హాఫ్ డిన్నర్’ అని చెప్పాడు. ఇంతకీ తెలుగులో అతని పేరేమిటి?
జ: అరవింద్
రెయిన్బో కలర్స్‌లోనే నిజ జీవితం - ఆ విషయాలు తెలుసుకుందామా పిల్లలూ!
ఇది ఆరంభం మాత్రమే - ప్రాక్టీస్ మేక్స్ పర్‌ఫెక్ట్ సూత్రంతో లక్ష్యాన్ని సాధించాలి