YSRCP Anarchists in Tirumala : తిరుమల శ్రీవారి క్షేత్రాన్ని వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో నాటి టీటీడీ పెద్దలు, అధికారులు భ్రష్టు పట్టించారు. తుదకు వేంకటేశ్వర స్వామివారికి సమర్పించిన నైవేద్యంలోనూ కల్తీ సరకులు వాడిన సంగతి బయటపడింది. దాత ముసుగులో వచ్చిన ఓ వ్యాపారి నాలుగు సంవత్సరాల పాటు నిరాటంకంగా సాగించిన అపచారాన్ని కూటమి ప్రభుత్వం వచ్చాక గుర్తించింది. రెండు రోజుల క్రితం జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు మాట్లాడుతూ, ఇకపై ఆ దాత దానాలు అక్కర్లేదని, అతని సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టామని చెప్పడంతో ఇన్నాళ్ల దారుణం వెలుగులోకి వచ్చింది.
వైఎస్సార్సీపీ హయాంలో శ్రీవారికి సమర్పించే ప్రసాదాల తయారీలో వాడే ముడి సరకులు, దినుసులన్నీ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఉత్పత్తి అయినవే తీసుకోవాలని 2021లో నిర్ణయం తీసుకున్నారు. అమలాపురం ప్రాంతానికి చెందిన నిమ్మకాయల సత్యనారాయణ అనే రొయ్యల ఫీడ్ వ్యాపారి శ్రీనివాసా సేవా ట్రస్ట్ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను తెరపైకి తెచ్చారు. తాను ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను టీటీడీకి సరఫరా చేస్తానని ముందుకొచ్చారు. అయితే వాటిలో సాధారణ నిత్యావసరాలనూ కల్తీ చేసి సరఫరా చేశారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఏఈవో వెంకయ్యచౌదరి బాధ్యతలు చేపట్టాక వీటి నాణ్యతపై ల్యాబ్‌లో పరీక్షలు చేయించడంతో అక్రమాలు గుట్టు బయట పడింది.
నిబంధనలు తోసిరాజని : శ్రీనివాసా సేవా ట్రస్ట్ పేరుతో టీటీడీకి తాను రోజూ రూ.లక్ష విలువైన సేంద్రియ ఉత్పత్తులు అందిస్తున్నందున తనకు ప్రతి రూ.10 లక్షల విలువకు ఒక బ్రేక్ దర్శన ప్రివిలేజ్ కల్పించాలని నిర్వాహకుడు సత్యనారాయణ నాటి ఛైర్మన్, ఈవోను కోరారు. అడిగిందే తడవుగా ఆన్‌లైన్‌లో అతనికి అవకాశం కల్పించారు. సాధారణంగా దాతలు డీడీలు, చెక్కుల రూపంలో కాకుండా బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, సేవలు అందిస్తే టీటీడీ ఎలాంటి దర్శన ప్రివిలేజ్ కల్పించదు. కానీ శ్రీనివాసా సేవా ట్రస్ట్‌కు ఇందుకు విరుద్ధంగా దర్శన ద్వారాలు ఓపెన్ చేశారు. నాలుగు సంవత్సరాల్లో సత్యనారాయణ దాదాపు 85 వీఐపీ ప్రివిలేజ్ పాస్‌బుక్‌లు పొందినట్లు తెలుస్తోంది. వీటిని 20 సంవత్సరాల పాటు ఉపయోగించుకోవచ్చు.
Substandard Goods Used in Tirumala : ఒక్కో పాసుబుక్‌తో ఒక్కోసారి ఐదుగురికి చొప్పున ఏటా మూడు సార్లకు కలిపి మొత్తంగా 15 మందికి బ్రేక్ దర్శనాలు కల్పించవచ్చు. ఇలా 85 పాసుబుక్‌ల ద్వారా తన అనుకూలురు, వ్యాపార భాగస్వాములకు నాలుగు సంవత్సరాల్లో 5100 మందికి టికెట్లు పొందినట్లు తెలుస్తోంది. వీరికి వసతి గదులు సైతం ఉచితంగా కేటాయించే వెసులుబాటు కూడా ఉంది. ఇవి కాకుండా, ఛైర్మన్, ఈవో, ఇతర ఉన్నతాధికారులు, బోర్డు సభ్యుల పేర్లు వాడుకుని రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాల పేరుతో మరో 17,000ల టికెట్లు పొందినట్లు తెలిసింది. విజయవాడలోని ఓ గోశాల నుంచి టీటీడీకి నెయ్యి పంపించి, దర్శనాల కోసం తనను సంప్రదించిన వారితో ఆ గోశాలకు పెద్దఎత్తున డొనేషన్లు ఇప్పించాడని సమాచారం. ఇలా దాత రూపంలో వచ్చిన సత్యనారాయణ, టీటీడీ నిబంధనలు తోసిరాజని అంతులేని ప్రయోజనాలు పొందారు.
తిరుమలపై కూటమి ప్రభుత్వం ఫోకస్ - వెలుగుచూస్తున్న వైఎస్సార్సీపీ అక్రమాలు
తిరుమల దర్శనం టికెట్ల పేరిట మోసాలు - జాగ్రత్తలు తీసుకోవాలంటున్న టీటీడీ