Subsidized Seeds not Available in Joint Kurnool District": రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ సాగుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే కర్నూలు జిల్లాలో మేలో వర్షపాతం 40.1 మిమీ కాగా రికార్డు స్థాయిలో 106.2 మిమీ పడింది. నంద్యాల జిల్లాలో మేలో వర్షపాతం 36.9 మిమీ కాగా 100.9 మిమీగా నమోదైంది. వర్షాల నేపథ్యంలో పొలాల్లో తేమ శాతం పెరిగింది. పశ్చిమ ప్రాంతంలో మే 2వ వారం నుంచే ముంగారు పత్తి సాగు చేస్తున్నారు.
కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు 4,23,344 హెక్టార్లు కాగా అందులో పత్తి 2,34,409 హెక్టార్లుగా ఉంది. నంద్యాల జిల్లాలో సాగు 2,06,448 హెక్టార్లుగా ఉంది. ఉమ్మడి జిల్లాలో ఒక్క వ్యవసాయ పంటలే సాధారణ సాగు 5,64,081 హెక్టార్లుగా అంచనా వేశారు. రైతులు ఎక్కువగా పత్తి పంటతో పాటు కంది, వేరుసెనగ, మొక్కజొన్న, ఉల్లి, ఎండుమిర్చి, వరి, ఆముదం తదితర పంటలు సాగు చేస్తారు.
అంతంతమాత్రంగా తనిఖీలు: మార్కెట్‌లో ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నా వ్యవసాయ శాఖ అధికారుల తనిఖీలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు అమ్ముతున్నట్లు రైతుల నుంచి ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదు. కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు 2,15,450 మెట్రిక్ టన్నులు అవసరం కాగా ప్రస్తుతం 62,142 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. నంద్యాల జిల్లాకు 2.50 లక్షల టన్నులు అవసరం కాగా 48000 టన్నులు అందుబాటులో ఉన్నాయి. యూరియాకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బయట కొనాల్సిన పరిస్థితి: ఉమ్మడి కర్నూలు జిల్లాకు 19,027.50 క్వింటాళ్ల విత్తనాలు కేటాయించారు. వేరుసెనగ విత్తనకాయలను పరిశీలించగా మొదట్లో ఉమ్మడి జిల్లాకు 16,806 క్వింటాళ్లు కేటాయించగా మే నెల వచ్చేసరికి 11,108 క్వింటాళ్లకు తగ్గించారు. ఫలితంగా రైతులు బయట కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సీజన్ ప్రారంభమైనా జాప్యం: ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఈ రోజుకీ రాయితీ విత్తన పంపిణీ ప్రారంభం కాలేదు. రాయితీ విత్తనాల కోసం డి.క్రిషి యాప్‌లో పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు రాయితీ విత్తన పంపిణీ జరగట్లేదని అధికారులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతేడాది మేలోనే విత్తనాల పంపిణీ జరిగిందని కాని ఈసారి తీవ్ర జాప్యం చేస్తున్నారని రైతులు అంటున్నారు.
ఖరీఫ్‌లో విత్తనాల రాయితీని ప్రభుత్వం ఖరారు చేసింది. వేరుసెనగ విత్తనాలను 40 శాతం రాయితీపై, వరి 23, కంది, మినుములు, పెసలు 30, కొర్రలు 50, పచ్చిరొట్ట ఎరువులను 50 శాతం రాయితీపై అందిస్తున్నట్లు పేర్కొంది. పచ్చిరొట్ట ఎరువుల పంపిణీ ఇప్పుడే ప్రారంభమైంది.
కష్టమైనా ఇష్టంతో చేస్తున్నాడు - మహా వృక్షాలకు జీవం పోస్తున్నాడు
రైతులకు గుడ్‌న్యూస్ - ఈ కార్డుతో సూపర్ బెనిఫిట్స్ - వెంటనే అప్లై చేయండి!