Telangana School Academic Calendar 2025-26 : ప్రతిరోజూ ప్రార్థన సమయంలో లేదా అది పూర్తయ్యాక తరగతి గదిలో ఐదు నిమిషాలపాటు విద్యార్థులకు యోగా లేదా ధ్యానం నిర్వహించాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అరగంటపాటు పిల్లలతో కథలు లేదా పత్రికలు చదివించాలని చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌ను సోమవారం విడుదల చేసింది. ప్రతి నెలా మూడో శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తారు. ఈసారి మొత్తం 230 రోజులపాటు తరగతులు జరుగుతాయి. పదో తరగతి సిలబస్‌ను జనవరి 10 నాటికి, మిగిలిన తరగతులకు ఫిబ్రవరి 28 నాటికి పూర్తి చేయాలని పేర్కొంది. గత ఏడాది మాదిరిగానే ఈసంవత్సరం కూడా వచ్చే ఏప్రిల్ 23వ తేదీ చివరి పనిదినంగా నిర్ణయించింది.
60 రోజులపాటు విద్యాప్రవేశ్ : పదో తరగతిలో ఇంటర్నల్ మార్కులు ఉండవని ప్రభుత్వం గత ఏడాదే ప్రకటించింది. దాంతో ఫార్మేటివ్ అసెస్‌మెంట్(ఎఫ్‌ఏ) పరీక్షలను నాలుగు నుంచి రెండుకు తగ్గించాలన్న డిమాండ్ ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చింది. అయితే వాటిని యథాతథంగా కొనసాగించాలని సర్కారు నిర్ణయించింది. నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ) విధానం కూడా అమల్లో ఉంటుంది. గతంలో మాదిరిగానే పదో తరగతి విద్యార్థులకు కూడా ప్రాజెక్టులు ఉంటాయి. కాకపోతే వాటి మార్కులను పరిగణనలోకి తీసుకోరు. జూన్ 12 నుంచి ఆగస్టు 28 వరకు 60 రోజులపాటు విద్యాప్రవేశ్‌ను అమలు చేస్తారు. అంటే పాఠశాలకు సిద్ధమయ్యేలా ప్రాథమికాంశాలు నేర్పుతారు. రెండో తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఈనెల 12 నుంచి 30 వరకు బ్రిడ్జి కోర్సు అమలు చేస్తారు.
పరీక్షల షెడ్యూల్ (2025-26) | |
ఎఫ్‌ఏ-1 | జులై 31 నాటికి పూర్తి |
ఎఫ్‌ఏ-2 | సెప్టెంబర్ 30 నాటికి |
ఎస్‌ఏ-1 | అక్టోబర్ 24 - 31 వరకు |
ఎఫ్‌ఏ-3 | డిసెంబర్ 23 నాటికి |
ఎఫ్‌ఏ-4 | 2026 ఫిబ్రవరి 7 నాటికి పదో తరగతికి, 28వ తేదీ నాటికి మిగిలిన తరగతులకు |
ఎస్‌ఏ-2(1 నుంచి 9 తరగతి ) | ఏప్రిల్ 10 - 18వరకు |
ప్రీ ఫైనల్(10వ తరగతి) | ఫిబ్రవరి 28 నాటికి పూర్తి |
పదో తరగతి వార్షిక పరీక్షలు | మార్చి 2026 |
పండగ సెలవులు
దసరా: 13 రోజులు (సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 3 వరకు )
క్రిస్మస్: 5 రోజులు (డిసెంబర్ 23 నుంచి 27 వరకు)
సంక్రాంతి(మిషనరీ బడులకు మినహా): 5 రోజులు (జనవరి 11 నుంచి 15 వరకు)
ప్రధానాంశాలు
- గత ఏడాది వరకు ఆరు కాంప్లెక్స్ స్కూల్ సమావేశాలు ఉండగా, ఈసారి ఏడుకు పెంచారు.
- డిసెంబరు - జనవరిలో పాఠశాల వార్షిక దినోత్సవాలు జరుగతాయి.
- ఆగస్టు 1, 2 వారాల్లో పాఠశాల స్థాయి క్రీడా పోటీలు ప్రారంభించి, మండల, జిల్లాల స్థాయిలో నిర్వహించి చివరగా సెప్టెంబరు నాలుగో వారంలో రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తారు.
- 2024-25కు రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన(ఆర్‌ఎస్‌బీవీపీ) జాతీయస్థాయి ఎగ్జిబిషన్ పోటీలను మండల స్థాయిలో అక్టోబరులో ప్రారంభించి, తర్వాత నవంబర్ - డిసెంబర్లో జిల్లా స్థాయి, డిసెంబర్ - జనవరిలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహిస్తారు. సదరన్ ఇండియా సైన్స్ ఫెయిర్‌ను జనవరిలో జరుపుతారు.
- 2023-24 ఇన్‌స్పైర్ జాతీయ పోటీలను ఆగస్టులో నిర్వహిస్తారు.
- 2024-25కు సంబంధించి జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ పోటీలను అక్టోబర్, నవంబర్ నెలల్లో, రాష్ట్రస్థాయి ప్రాజెక్టు పోటీలను డిసెంబర్లో నిర్వహిస్తారు.
తెరుచుకోనున్న స్కూళ్లు - పోనని మారాం చేస్తే ఇలా చేయండి!
వారు వెళ్లేటప్పుడు 'చిన్న స్మైల్' ఇవ్వండి చాలు - అంతా సెట్