Students in Public Exams : విద్యార్థుల్లో చాలా మందికి మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులంటే కఠినంగానూ, తెలుగంటే తేలికనే భావన ఉంటుంది. కానీ, గతేడాది పదో తరగతి వార్షిక పరీక్షలో ఇంగ్లీషు కంటే తెలుగులోనే ఎక్కువ మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇంగ్లీషు సబ్జెక్టులపై తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు ఎక్కువగా దృష్టి సారించాయి. దీంతో విద్యార్థులు తెలుగంటే సులువనే భావనతో చాలా వరకు నిర్లక్ష్యం చేస్తున్నారు.
విద్యార్థి జీవితంలో తొలి పబ్లిక్ పరీక్ష కావడం, అదీ మొదటి రోజు కావడంతో కొంత ఒత్తిడి కారణంగా భయం నెలకొని చదివిన అంశాలు మరిచిపోయి రాయడంలో తడబడటంతో పాటుగా ఫలితాలపై ప్రభావం పడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. గతేడాది జరిగిన పదో తరగతి వార్షిక పరీక్షల్లో నిజామాబాద్ జిల్లాలో 21,858 మంది విద్యార్థులు రాశారు.
మాతృభాషపై తగ్గుతున్న ఆసక్తి : 2023-24 విద్యా సంవత్సరంలో మ్యాథ్స్, సైన్స్‌తో పాటు మాతృభాషలో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. సైన్స్, మ్యాథ్స్ అంటే భయం సహజమే. కానీ, తెలుగులోనూ వెనుకబడటంపై భాషావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నానాటికీ మాతృభాషపై ఆసక్తి తగ్గుతోందని అభిప్రాయపడుతున్నారు. గత లోపాలను సవరించుకొని ఉపాధ్యాయులు ఈ సారి వార్షిక పరీక్షలకు విద్యార్థులను ముందుగానే సన్నద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఏర్పడింది. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారికి స్పెషల్ క్లాసులు నిర్వహించాలి. మాతృభాషలో ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయాలి. తప్పులు లేకుండా రాసేలా ప్రాక్టిస్ చేయించాలి.
"తొలి రోజు పరీక్ష అంటే విద్యార్థులకు భయం సహజమే. ఆ ఒత్తిడిలో చదివింది మర్చిపోయే ప్రమాదం ఉంటుంది. వెనుకబడిన విద్యార్థులు సైతం చదివిన దానిని అర్థం చేసుకొని సొంతంగా రాయగలిగితే పాస్ అయ్యేలా ప్రశ్నపత్రం ఉంటుంది. పరిచిత గద్యం (5 మార్కులు), అపరిచిత గద్యం (10 మార్కులు), 12 పద్యాలు (5 మార్కులు), కవి పరిచయాలు (3 మార్కులు), పదజాలం (33 మార్కులు) చదివితే సులువుగా పాస్ అవుతారు. ఇక చిన్న, పెద్ద ప్రశ్నలు చెప్పిన పాఠం అర్థం చేసుకుంటే చాలు. బట్టీ పట్టాల్సిన అవసరం లేకుండానే 37 మార్కులకు దాదాపుగా 20 మార్కులు వస్తాయి" -వారె దస్తగిరి, జడ్పీహెచ్‌ఎస్ గుండారం, గ్రేడ్-1 తెలుగు పండితుడు
10వ తరగతి పరీక్షలు రాయడం ఇక సులువే - ఈ ట్రిక్స్ పాటిస్తే అంతా సెట్
మంచి మార్కులకు చక్కని చేతిరాతా ముఖ్యమే - పరీక్షలు రాసేటప్పుడు ఇలా చేయండి