Students Committing Suicide by College Pressure in Telangana : "ఈ ఆదివారం ఇంటికి రా నాన్నా, ఊరి నుంచి మామ, అత్త వస్తున్నారు. వాళ్లతో కలిసి భోంచేసి మళ్లీ రాత్రికి హాస్టల్‌కు వెళ్దువులే. ఒద్దమ్మా పరీక్షలున్నాయని ఇంటికి పంపించడం లేదు. ఇంటికి పోతాం అని పర్మిషన్ అడిగితే పోతామంటే పొమ్మంటారు, వచ్చాక పనిష్మెంట్లు ఇస్తారు. మొన్న సంక్రాంతికి ఇంటి నుంచి కాలేజీకి వచ్చాక, మధ్యాహ్నం వరకూ బయటే నిల్చోమన్నారు. నేను రానమ్మా" - ఇది నగరంలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ విద్యార్థి, అతడి తల్లి మధ్య ఇటీవల జరిగిన సంభాషణ.
హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో సుమారు 150 ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు, రెసిడెన్షియల్ విధానంలో నడుస్తున్నాయి. చదువు పేరుతో కొన్ని కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై కఠిన వైఖరి అవలంభిస్తున్నాయి. విద్యార్థులను దూషిస్తున్నారు, కొడుతున్నారు. వీటిని భరించలేక కొందరు మధ్యలో వచ్చేస్తుండగా, మరికొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. రెండు నెలల్లో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయినా ఇంటర్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు.
పుస్తకాలతో కుస్తీ : రెసిడెన్షియల్ (హాస్టల్) విధానంలో ఇంటర్ చదివే విద్యార్థులైతే రోజుకు 18 గంటలు పుస్తకాలతోనే కుస్తీ పడుతున్నారు. ఉదయం 5 గంటలకు నిద్ర లేవాల్సిందే. లేదంటే శిక్ష తప్పదు. 6 నుంచి 9.30 వరకు స్టడీ అవర్స్, అల్పాహారం ఉంటుంది.
రెగ్యులర్ క్లాసులు సాయంత్రం 5.30 వరకు జరుగుతాయి. 6 నుంచి రాత్రి 8 గంటల వరకు స్టడీ అవర్స్, భోజనం అనంతరం తిరిగి రాత్రి 9.30 గంటల వరకు స్టడీ అవర్. పరీక్షలప్పుడు రాత్రి 11 గంటల వరకూ చదివిస్తారు.
దూషిస్తున్నారు : సున్నిత మనస్కులైన విద్యార్థులను అధ్యాపకులు, వార్డెన్లు పట్టించుకోకుండా అందరిలానే పరిగణిస్తున్నారు. మార్కులు తక్కువగా వస్తే తరగతి గదిలోనే దూషిస్తున్నారు. తల్లిదండ్రులతో చెప్పినా సర్దిచెబుతున్నారు. దీంతో ఒత్తిడి తట్టుకోలేక, ఏమీ చేయలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
- నిజాంపేట్‌లోని ఓ కార్పొపేట్ కాలేజీలో చదివే ప్రజ్ఞారెడ్డి అనే విద్యార్థిని మార్కులు సరిగా రావేమోననే భయంతో రెండు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది.
- మియాపూర్‌లో ఓ ప్రైవేటు కళాశాలలో కౌశిక్ రాఘవ్ మార్కులు రావడం లేదని గతేడాది నవంబర్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
- నిజాంపేట్‌లోని ఓ కార్పొరేట్ కళాశాలలో జశ్వంత్ గౌడ్ అధ్యాపకులు, వార్డెన్ వేధింపులు తాళలేక ప్రాణాలు తీసుకున్నాడు.
కఠిన చర్యలు తప్పవు : ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలలు, వసతిగృహాల్లో ఇంటర్ విద్యార్థులను చదువుపేరుతో ఒత్తిడి చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని మేడ్చల్ జిల్లా ఇంటర్ బోర్డు అధికారి ఎం.కిషన్ హెచ్చరించారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా వారితో మాట్లాడాలని ఆయా కళాశాలల నిర్వాహకులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. ఇక నుంచి వసతిగృహాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
చిన్న చిన్న కారణాలతో విద్యార్థుల ఆత్మహత్యలు - సెలవుల్లో ఇలా నేర్పిస్తే కాపాడుకోవచ్చు
Suicides in Hyderabad : హైదరాబాద్‌లో ఆత్మహత్యల అలజడి.. 25 రోజుల్లోనే ఏకంగా..!