Student Admissions In Govt Schools : 'సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణం పీఎం శ్రీ జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో గతేడాది 522 మంది విద్యార్థినులతో కొనసాగగా, ఈ ఏడాది 622 మంది చదువుకుంటున్నారు. 10 గ్రామాల నుంచి బాలికలు వస్తారు. డిజిటల్ క్లాస్‌లు, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటం వల్ల మంచి రిజల్ట్స్‌ను సాధిస్తున్నాం. బడి బాటలో భాగంగా ఇంటింటా ప్రచారం చేస్తూ, అంగన్‌వాడీ టీచర్లతో మాట్లాడటంతో 100 అడ్మిషన్లు వచ్చాయి. 20 నుంచి 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఉపాధ్యాయులందరం సమష్టిగా విద్యాభివృద్ధికి కృషి చేస్తుండటం వల్ల పిల్లల ఎన్రోల్మెంట్ సంఖ్య పెరుగుతోంది' అని పాఠశాల ప్రధానోపాధాయ్యురాలు సుశీలబాయ్ తెలిపారు.
ప్రభుత్వ స్కూళ్లలో పెరుగుతున్న ప్రవేశాలు : కార్పొరేట్ స్కూళ్ల తాకిడితో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటేటా తగ్గిపోతూ మూతపడే స్థితికి చేరుకుంటుండగా, అందుకు భిన్నంగా సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెరుగుతున్నాయి. దాంతో ఆయా స్కూళ్లకు కొత్త కళ వస్తోంది. ప్రభుత్వమే ఏటా ఒక్కో విద్యార్థిపై రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తూ అన్ని సదుపాయాలు కల్పించడం, ఉచితంగా ఏకరూప దుస్తులు, టెక్ట్స్ బుక్‌లు, రాత పుస్తకాలు అందజేస్తూ పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం (మిడ్ డే మీల్) అందింస్తుండడంతో పాటు అనుభవంతో కూడిన టీచర్లతో నాణ్యమైన బోధన జరుగుతుండటం ఇలా ఎన్నో ఫెసిలిటీస్ ఉచితంగా అందుతుండటం వల్ల ఆ వైపుగా మొగ్గు చూపుతున్నారు. ఉపాధాయ్యులు సైతం పిల్లల సంఖ్య పెంపునకు ప్రత్యేక చొరవ తీసుకుంటుండటంతో కలిసి వస్తోందని ఉపాధ్యాయ వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుండటంతో : కోదాడ పట్టణంలోని పీఎం శ్రీ జడ్పీ బాయ్స్ హైస్కూల్లో గతేడాది 455 విద్యార్థులుండగా, ఈ ఏడాది కొత్తగా చేరిన 106 మందితో 556కు చేరింది. 8 గ్రామాల నుంచి పిల్లలు వస్తుంటారు. ప్రణాళికాబద్ధంగా బోధించడంతో పదిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లు హెచ్‌ఎం తెలిపారు. పిల్లల సంపూర్ణ వికాసానికి ప్రత్యేక చొరవ చూపుతున్నామని వెల్లడించారు. ఉపాధ్యాయుల కృషితో విద్యార్థుల సంఖ్య 600 వరకు పెంచే అవకాశం ఉందని హెచ్‌ఎం సలీం షరీఫ్ తెలిపారు.
నూతనకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 286 మంది విద్యార్థులున్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా 35 మంది చేరారు. మరింత సమయం ఉండడం వల్ల అడ్మిషన్ల సంఖ్య పెరగనుందని హెచ్‌ఎం బి.రాములు తెలిపారు.
ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాలు : తిరుమలగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గతేడాది 331 మంది విద్యార్థులు చదువుకున్నారు. ఈ ఏడాది ఆ సంఖ్య 407కు చేరింది. 10 గ్రామాల నుంచి పిల్లలు వస్తారు. ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ముగ్గురేసి ఉపాధ్యాయులున్నారు. దాతలు అందించినటువంటి రూ.20 లక్షలతో విద్యార్థులు చదువుకునేందుకు, మధ్యాహ్న భోజనం చేసేందుకు, సమావేశం నిర్వహణకు సమావేశ మందిరాన్ని నిర్మించారు. మినరల్ వాటర్ సదుపాయం కల్పించారు. పదిలో వంద శాతం ఫలితాలు సాధించారు. ఈ ఏడాది అడ్మిషన్ల సంఖ్యను పెంచడానికి 50 రోజుల బడిబాట ప్రణాళికను రూపొందించుకుని గడప గడపకు తిరిగారు. దాంతో కొత్తగా 150 మంది విద్యార్థులు చేరారు. రూ.2.50 లక్షలతో స్కూల్‌కు రంగులు వేయించామని హెచ్‌ఎం దామెర శ్రీనివాస్ తెలిపారు. అన్ని తరగతి గదుల్లో కొత్త ఫ్యాన్లు, విద్యుత్తు దీపాల సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు.
'ప్రభుత్వ బడి'లో వినూత్నంగా పాఠాలు బోధన - అడ్మిషన్లకు క్యూ కడుతున్న తల్లిదండ్రులు
బడి గంట మోగే వేళాయే - ఇవి పరిశీలించాకే మీ పిల్లల్ని జాయిన్ చేయండి