కుటుంబంపై పగబట్టిన విధి : తన పిల్లలను ఆదుకోవాలంటూ తల్లి వేడుకోలు
కుటుంబాన్నే వంచించిన విధి - కుమార్తెకు క్యాన్సర్, కుమారుడికి అవిటితనం, భర్తకు వెన్నుపూస సమస్య - దాతల సాయం కోసం ఎదురుచూపులు

Published : October 9, 2025 at 10:19 AM IST
Brother and Sister Waiting for Help : మధ్య తరగతి కుటుంబం అంటే అనేక కష్టాలు ఉంటాయి. వాటికి తోడు విధి వంచిస్తే వచ్చే బాధలు అన్నీఇన్నీ కావు. క్యాన్సర్ రక్కసి కుమార్తె ఆరోగ్యాన్ని పీల్చుకుతింటుండగా, అనుకోని ప్రమాదం కుమారుడికి అవిటితనాన్ని ఇచ్చింది. ఇంటికి వెన్నెముకగా నిలవాల్సిన తండ్రిని వెన్నుపూసలో సమస్య కుంగదీసింది. కుమార్తెను నిత్యం ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించడంతో పాటు కుమారుడికి సపర్యలు చేసేందుకే ఆ తల్లికి సరిపోతోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మేడిపల్లికి చెందిన హరికృష్ణ, జ్యోతి దంపతులకు కుమార్తె కావ్య, కుమారుడు వెంకటేశ్ ఉన్నారు. అనుకోని ప్రమాదంలో కుమారుడు దివ్యాంగుడు కాగా, క్యాన్సర్ కోరల్లో చిక్కుకుని కుమార్తె విలవిల్లాడుతోంది. తండ్రి హరికృష్ణకు సైతం వెన్నుపూస ఆపరేషన్ జరగడంతో గట్టిగా పని చేయలేని పరిస్థితి. పిల్లల వైద్యం కోసం వీరు హైదరాబాద్ ముషీరాబాద్‌లోని కృష్ణానగర్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. ఇద్దరు దివ్యాంగులకు సపర్యలు చేస్తూ ఆ తల్లి సైతం ఎటూ వెళ్లలేక ఆపన్న హస్తం కోసం దీనంగా ఎదురుచూస్తోంది.
కుటుంబాన్నే వంచించిన విధి : వెంకటేశ్ నాలుగేళ్ల వయసులో ఇంటి ముందు ఆడుకుంటుండగా, అతి వేగంగా వచ్చిన కారు సిమెంట్ గోడను ఢీకొట్టడంతో అది కూలి అతని మీద పడింది. ప్రమాదంలో వెంకటేశ్ ఎడమ చేయి పూర్తిగా దెబ్బ తినడంతో భుజం వరకు తొలగించారు. 2021 ఆగస్టులో కావ్య ఆటో దిగుతుండగా జరిగిన ప్రమాదంలో కాలు విరగడంతో సిమెంట్ పట్టీ వేశారు. ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో చూపించగా స్కానింగ్‌లో నల్లటి మచ్చలు గుర్తించారు. ఎముక ముక్కను తీసి వైద్య పరీక్షలకు పంపగా, బోన్ మ్యారో క్యాన్సర్ అని తేలింది. కొద్ది రోజులకు ఛాతీలో రెండు వైపులా కొవ్వు గడ్డలు రావడంతో కీమో థెరపీ చేసి తొలగించారు. ప్రస్తుతం కాలుకు ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. వైకల్యం ఉన్నా కావ్య ఓపెన్ ఇంటర్ చదువుతుండగా, వెంకటేశ్ పదో తరగతి చదువుతున్నాడు. చిరుసాయం అందిస్తే చదువుకొని తమ కాళ్ల మీద తాము నిలబడతామని కోరుతున్నారు.
పిల్లలు ఇద్దరికీ వచ్చే పింఛన్ వారి వైద్య ఖర్చులకే : కావ్యను నిత్యం గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించే స్థోమత లేక హరికృష్ణ దంపతులు సతమతమవుతున్నారు. తల్లి జ్యోతి వద్ద ఉన్న 4 తులాల బంగారాన్ని అమ్మేసి ఇన్నాళ్లు కుమార్తె వైద్యానికి, కుమారుడి చదువుకు వెచ్చించారు. ఇక పూట గడవని స్థితిలో గాంధీ ఆస్పత్రి దాతలు అందించే ఆహారంతో అర్ధాకలిని తీర్చుకుంటున్నారు. పిల్లలిద్దరికీ వచ్చే పింఛను వారి వైద్య ఖర్చులకే సరిపోవడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. దర్జీ పనిలో చాలీ చాలని ఆదాయంతో ఇంటి అద్దె సైతం చెల్లించలేక దాతల సాయం అర్థిస్తున్నారు.
"ఇళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాను. పాపకు బోన్ క్యాన్సర్ అని చుట్టాలు కూడా దగ్గరకు రాలేదు. కిరాయికి ఉంటున్నాము. మాకు ఇళ్లు ఉంటే బాగుంటుంది. ప్రభుత్వం మాకు సహాయం చేస్తే బాగుంటుంది. నాకు ఏమైనా అయితే నా పిల్లలు అనాథలు అయిపోతారు. మాకు ధైర్యం చెప్పేవాళ్లు ఎవరూ లేరు. ఆపదలో ఉన్నామని తెలిసినా ఎవరూ దగ్గరకు కూడా రావడం లేదు." - జ్యోతి, తల్లి
అయ్యో దేవుడా! : తండ్రి చూస్తే అలా, కుమారుడు చూస్తే ఇలా - తండ్రీకుమారులను ఆదుకోరూ
కాల్పుల భయాలు పటాపంచలు- కంటిచూపు లేకపోయినా మనసులను కదిలించే పాటలు

