Steps to Employment in Orvakal industrial Park: కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు పారిశ్రామికవాడలో ఉపాధి మెట్లకు అడుగులు పడుతున్నాయి. ఇక్కడ 2,621 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా మౌలిక సదుపాయాల కల్పనకు నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఐసీడీసీ) ఇటీవల టెండర్లు ఆహ్వానించింది.
ఎల్‌అండ్‌టీ, మాంటెకార్లో, సెల్‌కాన్ వంటి 16 బడా సంస్థలు పాల్గొన్నాయి. వీటికి త్వరలోనే టెండర్లు ఖరారు కానున్నాయి. పనుల ప్రారంభానికి ఆగస్టు 2వ వారంలో భూమి పూజ చేయనున్నారు. అక్కడ ఇప్పటికే 5, 10, 20, 30 ఎకరాల విస్తీర్ణాల్లో ప్లాట్లు ఉన్నాయి. రహదారులు, డ్రైనేజీ, విద్యుత్తు, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్, అక్కడక్కడ కాలువలు, వంతెనలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఆయా పనులు 2 ఏళ్లలో పూర్తి చేయనున్నారు.
రూ.1000 కోట్లతో అభివృద్ధి: ఓర్వకల్లులో పారిశ్రామికవాడను అభివృద్ధి చేయాలని 2017-18లో టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం 9,750 ఎకరాలు సేకరించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిపై దృష్టి సారించింది కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. కేంద్రం కూడా ఓర్వకల్లు అభివృద్ధికి పచ్చజెండా ఊపింది.
అందుకోసం రూ.1,000 కోట్లతో 2,621 ఎకరాలను అభివృద్ధి చేయనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. కేంద్రం రూ.1000 కోట్ల నిధులు వెచ్చిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50:50 శాతంతో అభివృద్ధి పనులకు సహకారాన్ని అందిస్తున్నాయి.
ముచ్చుమర్రి నుంచి నీటి సరఫరా: ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్‌కు 0.94 టీఎంసీల నీరు అవసరం అవుతుంది. ముచ్చుమర్రి నుంచి 54.74 కిమీ పైపులైన్ వేసి నీటిని సరఫరా చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులు 70 శాతం పూర్తయ్యాయి. 4 నెలల్లో మిగిలిన 16 కిమీ మేర పైపులైన్ పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
అందుబాటులో విమానాశ్రయం: ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్‌కు సమీపంలో విమానాశ్రయం ఉండటంతో పారిశ్రామికవేత్తలు రావడానికి మార్గం అనుకూలంగా ఉంది. ఇటీవల విజయవాడకు సర్వీసును ప్రారంభించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి పరిశ్రమల యజమానులు ఓర్వకల్లు కారిడార్ సందర్శనకు వస్తున్నారు.
రైలు మార్గం సుగమం: కల్లూరు మండలం దూపాడు నుంచి వయా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ సమీపం నుంచి బేతంచెర్ల వరకు రైల్వేలైన్ ఏర్పాటుకు డీపీఆర్ సిద్ధం చేశారు. భూసేకరణ చేపట్టాల్సి ఉంది. 57 కిమీ మేర నిర్మించే ఈ లైన్‌కు కేంద్రం నిధులు సమకూర్చనుంది.
క్యూ కడుతున్న పరిశ్రమలు:
- హైదరాబాద్‌కు చెందిన ఫ్యూర్ ఇవి ఎలక్ట్రానిక్ బైక్‌ల సంస్థ రూ.1,200 కోట్లతో 100 ఎకరాల్లో ఈ-బైక్‌ల పరిశ్రమను నెలకొల్పనుంది. ఈ సంస్థ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
- డ్రోన్ పరిశ్రమ ఏర్పాటుకు 300 ఎకరాలు కేటాయించారు. సిగాచి పరిశ్రమ కొలువుదీరనుంది. అదేవిధంగా 100 ఎకరాల్లో రూ.1000 కోట్లతో మరో ఫార్మా కంపెనీ నెలకొల్పేందుకు అడుగులు పడుతున్నాయి.
- గుట్టపాడులో రూ.3,000 కోట్లతో జైరాజ్ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఉత్పత్తిని ప్రారంభించారు. నిత్యం 24 గంటల పాటు నిరంతరాయంగా పరిశ్రమ నడుస్తోంది. ఏడాదికి 0.375 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయాలనేది లక్ష్యం. ఇక్కడ ఉత్పత్తయిన స్టీల్‌ను హైదరాబాద్‌కు ఎగుమతి చేస్తున్నారు.
ఓర్వకల్లు, కొపర్తి పారిశ్రామిక నోడ్‌ల అభివృద్ధికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ - ఇక జెట్‌స్పీడ్‌లో పనులు
లేపాక్షి-ఓర్వకల్లు మధ్య యాపిల్ ఎలక్ట్రానిక్ సిటీ - మారనున్న ఏపీ రూపురేఖలు