GPS TRACKERS IN VEHICLE : రద్దీగా ఉండే ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుని వాహనాల దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయి. చోరీకి గురైన వాహనాలను విడిభాగాలుగా చేసి మార్కెట్లో విక్రయిస్తారు. అయితే ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే దొంగలను క్షణాల్లో పట్టుకోవచ్చు. వాహనాన్ని కొన్నప్పుడే జీపీఎస్ పరికరాన్ని అమర్చుకుంటే, అవి చోరీకి గురైనా వాటిని కనుక్కోవడం చాలా సులభం. దాని సాయంతో దొంగలు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చు.
అమర్చేందుకు రూ.1500 : జీపీఎస్(గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) ట్రాకర్ శాటిలైట్ సిగ్నల్స్ సాయంతో అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా వాహనం ఎక్కడున్నా కచ్చితమైన స్థానాన్ని గుర్తిస్తుంది. దీనిని వాహనంలో బయటకు కనిపించకుండా బిగించి, బ్యాటరీకి కలుపుతారు. వీటిని అమర్చేందుకు సుమారు రూ.1500 నుంచి రూ.5 వేల వరకు ఖర్చు అవుతుంది. దీనిలో సిమ్‌కార్డుకు రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ యాప్, వెబ్ ప్లాట్‌ఫాంల ద్వారా వినియోగదారుడికి సమాచారం అందుతుంది.
వాహనాన్ని ఆపివేయవచ్చు : జీపీఎస్ బిగించిన వాహనం చోరీకి గురైతే కచ్చితమైన స్థానాన్ని ప్రత్యక్షంగా (రియల్‌టైమ్‌లో) చూపిస్తుంది. పార్కు చేసిన ప్రాంతం నుంచి కదిలిస్తే ఫోన్‌కు వార్నింగ్ వస్తుంది. వాహనం ఎక్కడికి వెళ్లిందో నమోదు చేస్తుంది. కొన్ని ట్రాకర్ల సాయంతో, ఉన్న చోటు నుంచి వాహనాన్ని ఆపివేయవచ్చని నిపుణులు అంటున్నారు.
చోరీకి గురైతే ? : వాహనం చోరీకి గురైతే వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. చోరీ స్థలం, సమయం, వాహనం మోడల్, రిజిస్ట్రేషన్ నంబరు, రంగు వంటి వివరాలను పోలీసులకు తెలియజేయాలి. జీపీఎస్ ట్రాకింగ్ సమాచారాన్ని వారికి అందించాలి. పోలీసుల నుంచి ఎఫ్‌ఐఆర్ కాపీ తీసుకొని వాహన బీమా సంస్థకు తెలియజేయాలి. ఇప్పటికే జీపీఎస్ ట్రాకింగ్ వాడకంతో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో వాహనాల చోరీలు గణనీయంగా తగ్గినట్లు తెలుస్తోంది.