Boduppal Murder Case In Hyderabad : ఆస్తి చేజారిపోతుందనే అక్కసుతో ఓ సవతితల్లి దారుణానికి ఒడికట్టింది. మరిది, అతని స్నేహితునితో కలిసి కుమార్తెను హత్య చేసింది. పెళ్లి ఇష్టంలేక వేరే వారితో వెళ్లిపోయిందని కట్టుకథ అల్లింది. విషయం బయటకు తెలిస్తే కుటుంబం పరువు పోతుందంటూ భర్తను ఏమార్చింది. నెలలు గడుస్తున్నా బిడ్డ జాడ తెలియక తల్లడిల్లిన ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలేం జరిగిందంటే : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ శ్రీలక్ష్మీనగర్‌కు చెందిన పీనానాయక్ అనే వ్యక్తి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్యోగం చేస్తున్నాడు. బంధువుల కుటుంబానికి చెందిన మహిళతో అతనికి 30 ఏళ్ల క్రితం వివాహమైంది. కుమారుడు, కుమార్తె పుట్టిన తర్వాత విభేదాలతో విడిపోయారు. 2003లో పీనా నాయక్ లలిత అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. కూమార్తె తండ్రి పోషణలో, కుమారుడు తల్లి పోషణలో ఉండేలా మొదటి భార్యతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండో భార్యతో పీనా నాయక్‌కు ఓ కుమార్తె ఉంది.
విభేదాలతో విడాకులు : మొదటి భార్యకు పుట్టిన మహేశ్వరి తండ్రి వద్దనే ఉంటూ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. కొంతకాలం ప్రైవేటు ఉద్యోగం చేసింది. అక్కడ పరిచయమైన యువకుడితో ఆమెకు వివాహమైంది. భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుంది. మహేశ్వరికి మరో పెళ్లి చేయాలని తండ్రి పీనా నాయక్ ప్రయత్నం చేశాడు. రెండో పెళ్లికి పెద్దఎత్తున లాంఛనాలు డిమాండ్ చేస్తుండటంతో బోడుప్పల్‌లో ఉన్న రెండు ఇళ్లలో ఒకదానిని మహేశ్వరికి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చాడు. గతేడాది నవంబర్‌లో మహేశ్వరికి పెళ్లి సంబంధం కుదిరింది. అనుకున్నట్టుగానే తన ఇంటిని కాబోయే అల్లుడికి రాసిచ్చేందుకు అంగీకారం తెలిపాడు.
ఆస్తిపై కన్ను : మహేశ్వరికి ఆస్తిలో వాటా ఇవ్వడాన్ని సవతి తల్లి లలిత జీర్ణించుకోలేకపోయింది. ఇదే విషయంపై భర్తతో గొడవకు దిగింది. భర్త తన మాట పెడచెవిన పెట్టడంతో తట్టుకోలేకోలేకపోయింది. సూర్యాపేట జిల్లా కొమ్మల్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్న మరిది బానోత్ రవిని పరిష్కార మార్గం కోరింది. మహేశ్వరిని అడ్డుతొలగిస్తే రెండిళ్లు సొంతమవుతాయని సూచించాడు. గతేడాది డిసెంబరు 7న పీనానాయక్ ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్లాడు.
ఆందోళనతో పోలీసుల వద్దకు : దీన్ని అవకాశం చేసుకున్న సవతి తల్లి రవి, అతని స్నేహితుడు వీరన్నతో కలిసి మహేశ్వరి మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి చంపారు. ఆమె మరణించినట్టు నిర్ధారించుకుని మృతదేహాన్ని గోనెసంచిలో మూటలా కట్టి కారులో తీసుకెళ్లి నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వంగమర్తి సమీపంలో పాతిపెట్టారు. కుమార్తె గురించి అడిగిన భర్తకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారనే ఉద్దేశంతో మరో యువకుడితో వెళ్లిపోయి ఉంటుందని లలిత కట్టుకథ అల్లింది. ఈ విషయం బయటకు చెబితే పరువు పోతుందని భర్తను భయపెట్టింది. ఇదంతా నిజమని భావించిన పీనా నాయక్ కొద్దిరోజులు మౌనంగా ఉన్నాడు. నాలుగు నెలలైనా బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళనకు గురై ఏప్రిల్ 2న మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో మహేశ్వరి కనిపించటం లేదంటూ ఫిర్యాదు చేశాడు.
ముగ్గురు నిందితులకు రిమాండ్ : కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బోడుప్పల్ పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ కెమెరాల పుటేజ్ పరిశీలించారు. కుటుంబసభ్యులపై అనుమానంతో వారిపై నిఘా ఉంచారు. సాంకేతిక ఆధారాలతో సవతి తల్లి లలిత ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో దారుణహత్య వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలల క్రితమే మహేశ్వరిని హతమార్చి మృతదేహాన్ని మాయం చేసినట్టు అంగీకరించారు. మేడిపల్లి పోలీసులు వంగమర్తి వద్ద పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పంచనామా చేశారు. అనంతరం సూర్యాపేట ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
శిరీష హత్య కేసులో ఏ-1గా ఆడపడుచు - ఎందుకు చంపిందో వివరించిన ఏసీపీ
'ఎప్పుడూ ‘యూ బెగ్గర్’ అని అవమానించేవారు - అందుకే తాతయ్యను చంపేశా'