Municipal Commissioners Workshop: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో పేదలకు ఇబ్బంది కలిగించకుండా పన్ను బకాయిలను ఓ ప్రణాళిక ప్రకారం వసూలు చేయాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో పట్టణాలు, నగరాలు, నగర పంచాయతీల పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై వర్క్‌షాప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మున్సిపల్ శాఖపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా కమిషనర్లు పని చేయాలని మంత్రి అన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ, మురుగునీటి పారుదల వ్యవస్థ మెరుగుదల, తాగునీరు ఇబ్బంది లేకుండా చూడటం, వీధి దీపాల ఏర్పాటు, ఉద్యాన వనాల అభివృద్ధి అంశాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న మెరుగైన విధానాలపై అధ్యయనం చేయించామని, వాటిలో మన ప్రాంతంలో అమలు చేసేందుకు ఉన్న అంశాలపై మేథోమథనం జరిపి ఆచరణలోకి తీసుకురావాలని మంత్రి సూచించారు.
"ప్రజల అవసరాలను తీర్చి, మరింత మెరుగ్గా సేవ చేయడానికి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాం. ముఖ్యంగా మున్సిపాలిటీలలోని ప్రజలు కోరుకునేది తాగునీరు, వీధి దీపాలు, రోడ్లు, వేస్ట్ మేనేజ్మెంట్. వాటి తరువాత పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, అర్బన్ స్కూళ్లు. ఇలా వీటన్నింటిని ఇంకా మరింత మెరుగ్గా చెయ్యడానికి ఏం చేయాలి అనే దానిపై వివిధ రాష్ట్రాలకు అధికారులను పంపించాం. అక్కడ అనుసరిస్తున్న వాటిలో ఏమైనా మంచివి ఉంటే అమలు చేస్తాం. దానిపైన ప్రస్తుతం వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాం". - నారాయణ, మంత్రి