Prawns 40 Count Price of Rs 345 : రొయ్యలు 40 కౌంట్ రకం కిలోకు రూ.345, 100 కౌంట్ రకం కిలోకు రూ.230 ధర చెల్లించాలని ఎగుమతుదారులు నిర్ణయించారు. పది రోజుల తర్వాత మళ్లీ ధరలు సవరిస్తారు. పోరంకిలోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ సంస్థ వైస్ ఛైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు ఆధ్వర్యంలో ఆక్వా రైతులు, ఎగుమతిదారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు.
రొయ్య ఎగుమతులపరంగా ప్రస్తుతం తలెత్తిన ప్రతికూల పరిస్థితుల్లో ఎగుమతిదారులు, రైతులు నష్టపోకుండా మధ్యేమార్గంగా ధరలు నిర్ణయించారు. పౌల్ట్రీ రంగంలో నెక్ తరహాలో ఆక్వా రైతులంతా కలిసి ఆంధ్రప్రదేశ్ రొయ్య ఉత్పత్తిదారుల కంపెనీ (ఏపీపీపీసీ) ఏర్పాటు చేయాలని తీర్మానించారు. రొయ్యల కొనుగోలుదారులు ఇక విధిగా మత్స్యశాఖ నుంచి లైసెన్సులు తీసుకోవాలని నిర్ణయించారు. తీసుకోని వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను రాష్ట్ర ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ సంస్థ వైస్ ఛైర్మన్ ఆదేశించారు.
మా బాధలు అర్థం చేసుకోండి: తమ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని, లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టామని ఆక్వా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎగుమతిదారులు తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరారు. ఎగుమతిదారులకు ఇబ్బందులు ఎదురయినప్పుడు రైతులంతా మద్దతు ప్రకటించిన సందర్భాలను గుర్తు చేసుకోవాలని, ఇప్పుడు రైతులను వారు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎగుమతులపరంగా ఇబ్బందులు ఉన్నందున ఆలోచించాల్సి వస్తోందని, అంతా బాగున్నపుడు రైతులు అడగకపోయినా మంచి ధరలిచ్చి కొనుగోలు చేశామని ఎగుమతిదారులు వివరించారు.
పరిస్థితులు అనుకూలించాక మంచి ధరలు ఇస్తామని హామీ ఇచ్చారు. మీరూ మా ఇబ్బందులు గమనించాలని ఎగుమతిదారులు దిలీప్, వర్మ పేర్కొన్నారు. రొయ్యల ఎగుమతుల పరంగా ప్రస్తుతమున్న సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయన్న ఆశాభావాన్ని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవలసిన బాధ్యత ఎగుమతిదారులపై ఉందని, వారంతా చాలా కష్టాల్లో ఉన్నారని రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్‌మెంట్ సంస్థ వైస్ ఛైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు.
సుంకాల అమలు వాయిదా - రొయ్య ఎగుమతులకు ఊపిరి
సమావేశానికి అతిథిగా హాజరైన నెక్ వైస్ ఛైర్మన్ చిట్టూరి సురేశ్‌రాయుడు ఏపీపీపీసీ (APPPC) ఏర్పాటుపై పలు సూచనలు చేశారు. కమిటీ ద్వారా సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చించి వాటి పరిష్కారానికి తగు నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు. మార్కెటింగ్ పరంగా వినూత్న విధానాలు అమలు చేయాలని సూచించారు.
జాతీయ కమిటీ ఏర్పాటు ద్వారా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున, రాష్ట్ర కమిటీగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రొయ్యల వినియోగాన్ని విస్తృతం చేసేందుకు ప్రముఖ సినీ నటులతో ప్రచారం చేయించాలని, 100, 250, 500 గ్రాముల ప్యాకెట్లలో విక్రయిస్తే బాగుంటుందని సూచించారు. సమావేశంలో మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎగుమతిదారులు ప్రకటించిన ధరల వివరాలు(కిలోకి రూపాయిలలో) | |
---|---|
కౌంట్ | ధర |
100 | 230 |
90 | 240 |
80 | 260 |
70 | 280 |
60 | 305 |
50 | 325 |
40 | 345 |
సిండికేట్గా మారిన రొయ్యల వ్యాపారులు - భారీగా పతనమైన ధరలు
