Revenue Dept Shortage of Staff : రాష్ట్రంలో పరిపాలనలో కీలకమైన రెవెన్యూ శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రధానంగా మండలాల స్థాయిలో 1317 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో కార్యకలాపాలు మందకొడిగా సాగుతున్నాయి. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, డిప్యూటీ ఎమ్మార్వోలు (రీ-సర్వే), సీనియర్ అసిస్టెంట్/రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కేడర్లలో పోస్టులు చాలావరకు ఖాళీగా ఉన్నాయి.
అధికారికంగా మంజూరైన 6019 పోస్టులకు 1317 ఖాళీగా ఉండడంతో చాలావరకు తహసీల్దారు కార్యాలయాల్లో ఇంఛార్జ్‌ల పాలన కొనసాగుతోంది. దీంతో రెవెన్యూ కార్యకలాపాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. గత వైఎస్సార్సీపీ హయాంలో వేళ్లూనుకుపోయిన భూ, ఇతర సమస్యలపై కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చాలా జిల్లాల్లో దరఖాస్తులు సకాలంలో పరిష్కారానికి నోచుకోవడం లేదు.
దీనిపై తాజాగా నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్, అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ, అక్రమంగా నిషిద్ధ జాబితాలో ఉంచిన ప్రైవేట్ భూములను తప్పించడం, భూ ఆక్రమణల నిరోధ చర్యలు మండలాల కేంద్రంగానే జరగాల్సి ఉన్నాయి. కానీ సిబ్బంది కొరత ప్రతిబంధకంగా మారుతోంది. ఈ క్రమంలో పోస్టుల భర్తీపై హైకోర్టు నుంచి స్పష్టత వచ్చేలోగా సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల పదోన్నతులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది.
ఏ జిల్లా చూసినా అంతే : మండలాల్లో రెగ్యులర్ ఎమ్మార్వోలు లేరు. దీంతో రీసర్వే కోసం నియమితులైన డిప్యూటీ తహసీల్దార్లు, తాత్కాలిక డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్ కేడర్‌లో ఉన్న వారు ఇంఛార్జ్ ఎమ్మార్వోలుగా కొనసాగుతున్నారు. తహసీల్దారు పోస్టుల కేడర్ స్ట్రెంత్ 937 కాగా ప్రస్తుతం 734 మంది మాత్రమే పనిచేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో 19 మండలాల్లో 8, విశాఖ జిల్లాలో 20కు 10, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 22కు 10, కాకినాడ జిల్లాలో 21కు 9 మంది ఇంఛార్జ్ తహసీల్దార్లు ఉన్నారు. రాయలసీమ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో ఏకంగా 75 శాతం పోస్టుల్లో ఇంఛార్జ్లున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 32 మండలాలు ఉన్నాయి. అక్కడ సుమారు పదిమంది మాత్రమే శాశ్వత ప్రాతిపదికన ఉన్నారు. రీ-సర్వే అవసరాల కోసం మాత్రమే సీనియర్ అసిస్టెంట్లలో కొందర్ని డిప్యూటీ తహసీల్దార్లుగా నియమించారు. వీరిలో కొందరు ఇంఛార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఇంకొందరు కలెక్టర్ కార్యాలయాల్లో, సబ్-కలెక్టర్ కార్యాలయాల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. ఈ కారణంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది తగ్గిపోతున్నారు.
సీనియార్టీ జాబితా వివాదం హైకోర్టుకు : ఎమ్మార్వో పోస్టులను సర్కార్ నేరుగా భర్తీ చేయదు. ఏపీపీఎస్సీ ద్వారా డిప్యూటీ తహసీల్దార్లుగా నియమితులైన వారు, జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్, ఆపై డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతిపై వచ్చినవారితో మాత్రమే భర్తీ చేయాలి. ఇలా ర్యాంకుల ఆధారంగా ఉద్యోగోన్నతులు పొందేవారు, నేరుగా నియామకమైన వారికి మధ్య తహసీల్దారు పోస్టుల కేటాయింపుపై రూపొందించిన సీనియార్టీ జాబితా వివాదం హైకోర్టుకు చేరింది. డిప్యూటీ ఎమ్మార్వో పోస్టుల్లో కేడర్ స్ట్రెంత్‌ను పెంచడం సమస్యకు బీజం పడేలా చేసింది.
ఇరువర్గాలూ ధర్మాసనాన్ని ఆశ్రయించడంతో తుదితీర్పు వచ్చేంత వరకు తదుపరి పదోన్నతులు లేకుండా హైకోర్టు 2023 మేలో స్టే విధించింది. అప్పటి నుంచి పదోన్నతులు ఆగాయి. క్షేత్రస్థాయిలో పోస్టుల ఖాళీల ప్రభావం తీవ్రంగా ఉన్నందున స్టే తొలగించేలా చూడాలని అడ్వొకేట్ జనరల్‌కు సర్కార్ తాజాగా లేఖ రాసింది. మరోవైపు రెవెన్యూ శాఖ ఇరువర్గాలతో సంప్రదింపులు జరిపి, ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకొని హైకోర్టుకు నివేదిస్తే సమస్యకు పరిష్కారం త్వరగా లభించే అవకాశం ఉంది. హైకోర్టు స్టే ఇచ్చిన సమయంలోనే గత వైఎస్సార్సీపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ఉంటే పరిస్థితులు చేజారేవే కావు.
పోస్టుపేరు | కేడర్ స్ట్రెంత్ | పనిచేస్తున్నవారు | ఖాళీలు |
తహసీల్దార్ | 937 | 734 | 203 |
డిప్యూటీ తహసీల్దార్ | 1774 | 1592 | 182 |
డిప్యూటీ తహసీల్దార్ (రీసర్వే) | 684 | 575 | 109 |
సీనియర్ అసిస్టెంట్/ఎంఆర్ఐ | 2624 | 1868 | 823 |
ఏపీలో రెవెన్యూ ఫిర్యాదులపై నాన్చుడు ధోరణి!
పంచగ్రామాల ప్రజలకు గుడ్ న్యూస్ - నిర్మించుకున్న ఆ ఇళ్ల రెగ్యులరైజ్‌కు ఓకే