Yuva Story On Sriya in Guntur District: అమెరికాలో చదువులు అక్కడే ఉద్యోగాలు. వీలైతే స్థిరపడిపోవటం. ఇది ప్రస్తుతం యువత అనుసరిస్తోన్న ధోరణి. అయితే ఆ అమ్మాయి మాత్రం అందుకు భిన్నమంటోంది. యూఎస్‌లో ఉన్నత చదువులు పూర్తి చేసినప్పటికీ మాతృభూమి కోసం ఏదైనా చేయాలని భావించింది. పంటలకు పురుగు మందులు చల్లే క్రమంలో రైతులు అనారోగ్య బారిన పడుతున్నారు. దీని నుంచి రక్షణ కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అంతేనా ఉచితంగా రైతులకు కిట్లను సైతం పంపీణీ చేస్తూ అందరి మన్నలు చూరగొంటున్న శ్రీయపై ప్రత్యేక కథనం.
భారతదేశంలో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపైనే ఆధారపడి జీవిస్తుంటారు. మనం తీసుకునే ఆహారం రైతుల రెక్కల కష్టం. అందరి ఆకలి తీర్చే రైతన్నలు మాత్రం అనారోగ్యానికి గురవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం పురుగు మందులు, రసాయన ఎరువుల వాడకంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవటమే. ఇదే విషయంపై అధికారులు రైతుల్లో అవగాహన కల్పిస్తున్నా కానీ వారికి మాత్రం ప్రత్యామ్నాయం చూపలేకపోతున్నారు.
మందుల పిచికారీలో అవరోధాలు: పంటలకు పురుగు మందుల పిచికారీ సమయంలో రైతులు ఇబ్బందులు పడకుండా రక్షణ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ విషయంపై అమెరికాలో ఉంటున్న తెలుగమ్మాయి శ్రీయ ఆలోచించింది. అన్నదాతలు రక్షణ పరికరాలు ఉపయోగిస్తే అనారోగ్యబారిన పడకుండా ఉంటారని భావించింది. దీనిపై గుంటూరు జిల్లాలోని స్వస్థలం లాం గ్రామంలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించింది.
నేపథ్యం: ఈ యువతి పేరు శ్రీయ. అమెరికాలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లోనే సేవా కార్యక్రమాల్లో క్రీయశీలకంగా వ్యవహరించేది. వాయి కాలుష్యం, పర్యావరణ పరిరక్షణ, రైతుల ఆరోగ్యంపై అనేక అవగాహన సదస్సులు నిర్వహించింది. ఈ క్రమంలోనే ఎన్విరో ఈక్విటీ హెల్త్ ఇన్షియేటివ్ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పింది. పురుగు మందుల ద్వారా ప్రజలు అనారోగ్యానికి గురి కాకుండా సంస్థ ద్వారా విశేష సేవలు అందించింది.
రైతులు పురుగు మందుల విష ప్రభావానికి గురి కాకుండా తమను తాము ఎలా రక్షించుకోవాలో అవగాహన కల్పిస్తోంది శ్రీయ. ప్రధానంగా పిచికారీ సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం వలనే అధిక సమస్యలు ఎదురవుతున్నాయని గుర్తించింది. అన్నదాతలకు ఎప్పటికప్పుడు రక్షణ కిట్లు అందిస్తే ప్రమాదాల బారిన పడకుండా ఉంటారని సూచించింది.
పిచికారిపై రైతులకు శిక్షణ: ముసుగులు, చేతి తొడుగులు వంటి రక్షణ పరికరాలను పంపిణీ చేయటంతో పాటు పురుగు మందులు సురక్షితంగా పిచికారి చేయటంపై రైతులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తోందీ యువతి. అలాగే పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం కోసం శాశ్వత పరిష్కారాలు కనుగొనటం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతుంది. వీలైతే డ్రోన్ల ద్వారా పురుగుమందులు చల్లటం మంచిదంటోంది శ్రీయ.
ఎక్కువగా పురుగుమందులు వాడటం వల్ల అవి ప్రజారోగ్యానికి కూడా హాని చేస్తాయని చెబుతుందీ యువతి. నిర్దేశించిన మోతాదులో మాత్రమే వాటిని ఉపయోగించాలి. ఈ విషయాలపై అమెరికాలో వాయు కాలుష్యం, నీటి కాలుష్యం వంటి పరిశోధనల్లో సహాయకారిగా పనిచేస్తోంది. అందులో వచ్చిన మెుత్తాన్ని, అలాగే తల్లిదండ్రులు ప్రోత్సాహంతో కార్యక్రమాలు నిర్వహిస్తోంది శ్రీయ.
రైతుల రక్షణకు సంబంధించి అమెరికాలో చాలా రకాల ఉపకరణాలున్నాయి. వాటిని భారత్ కు తీసుకొచ్చి అందించేందుకు శ్రీయ సిద్ధంగా ఉన్నారు. విషపూరిత పురుగుమందుల ద్వారా రైతులు తీవ్ర ప్రభావానికి గురి కాకుండా తనవంతు ప్రయత్నాలు చేయడం హర్షణీయం. ఈ అమ్మాయి చేస్తున్న సేవా కార్యక్రమాల్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.
అందరికీ అన్నం పెట్టే అన్నదాతలు ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతో శ్రీయ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమంటున్నారు శాస్త్రవేత్తలు. వాటిని అమెరికాకే పరిమితం చేయకుండా స్వదేశానికి దోహదపడేలా చేయడం స్వాగతించాల్సిన విషయం.
''మా నాన్న ఇక్కడ లాం గ్రామంలో పుట్టి పెరిగాడు. అందుకు నేను ఈ ప్రాంతానికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని వచ్చాను. ఇక్కడ రైతులు క్రిమి సంహారకాలను పిచికారీ చేయడం వలన కలిగే దుష్ప్రభావాల గురించి అవగాహన కల్పిస్తున్నాం. నిర్దేశించిన మోతాదులో మాత్రమే పురుగుల మందులను ఉపయోగించాలి. వీటి వలన ఊపిరితిత్తులకు, కిడ్నీలకు ఇతర భాగాలపై తీవ్ర హానీ ఉంటుంది. అందుకే ఇక్కడ పిచికారీ చేసే రైతులందరికీ మేము ఉచితంగా ముసుగులు, చేతి తొడుగులను పంపిణీ చేస్తున్నాం''-శ్రీయ, ఎన్విరో ఈక్విటీ హెల్త్ ఇన్షియేటివ్ ఫౌండర్
''ఎన్విరో ఈక్విటీ హెల్త్ ఇన్షియేటివ్ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి రైతులకు సేవలు చేయడం స్వాగతించాల్సిన విషయం. పురుగుమందుల వాడకంపై స్థానిక గ్రామాల ప్రజలకు అంత పెద్దగా ఉండక వారు అనేక అనారోగ్యాల బారిన పడే ప్రమాదముంది. దాన్ని అధిగమించేందుకు ఎన్విరో ఈక్విటీ హెల్త్ ఇన్షియేటివ్ ఫౌండర్ శ్రీయ కృషి చేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి సాగురంగంలో విప్లవాత్మక మార్పులను ఈ సంస్థ ద్వారా తీసుకొస్తారని ఆశిస్తున్నాను''-ఎన్.వి.వి.ఎస్. దుర్గాప్రసాద్, వ్యవసాయ శాస్త్రవేత్త
బరిలోకి దిగితే పతకం సాధించాల్సిందే - సత్తా చాటుతున్న స్విమ్మర్, వైద్యురాలు సాయిశ్రీ
విధి వెక్కిరించినా విజయం సాధించింది - స్విమ్మింగ్, వాటర్ స్పోర్ట్స్‌లో రాణిస్తున్న విజయవాడ యువతి