Srisailam Dam Safety Issue : శ్రీశైలం ఆనకట్ట భద్రతకు నిధుల కొరత వెంటాడుతోంది. 15 సంవత్సరాల కిందట వరద పోటెత్తడంతో కట్ట దిగువభాగం, అప్రోచ్‌రోడ్డు కోతకు గురయ్యాయి. మరమ్మతులకు అవసరమైన నిధుల కేటాయింపుపై ప్రభుత్వాలు దృష్టిపెట్టకపోవడం శాపంగా మారాయి. సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డ్రిప్ పథకం కింద పైసా రాలేదు. ఒకట్రెండు రోజుల్లో పరిశీలనకు సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రతినిధులు వస్తున్నట్లు ఇంజినీర్లు పేర్కొంటున్నారు. వారిచ్చే నివేదికలతో అయినా ప్రభుత్వాల్లో కదలికొస్తేనే శ్రీశైలం జలాశయం భద్రతకు భరోసా లభిస్తుంది.

పనికొచ్చే పనులకు పైసా ఇవ్వలే : 2009లో పోటెత్తిన వరదలకు శ్రీశైలం డ్యాం కుడివైపు కొండచరియలు, అప్రోచ్‌రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయాయి. ఆనకట్ట స్పిల్‌వే ఎదురుగా ఉన్న ఏఫ్రాన్ ముందు దృఢమైన బండపరుపు కొంతవరకు కొట్టుకుపోయింది. వీటిని పునరుద్ధరించాలని అప్పట్లోనే నిపుణులు సూచనలు చేసినా పట్టించుకోలేదు కుడిగట్టు కొండ చరియలకు (ఆనకట్టకు పక్కన) ఆనుకొని ఉన్న అప్రోచ్ రోడ్డు వరదలకు కొట్టుకుపోయింది. పునరుద్ధరణకు ఇంతవరకు చిల్లిగవ్వ విడుదల చేయలేదు. అప్రోచ్ రోడ్డు పునరుద్ధరణ జరిగితేనే మరమ్మతులకు అవసరమైన వస్తువులు, యంత్ర సామగ్రిని ఏఫ్రాన్ వద్దకు తీసుకెళ్లేందుకు ఆస్కారం ఉంటుంది.
రూ.100 కోట్లు అవసరం :
- 2009 వరదలకు తీవ్రస్థాయిలో దెబ్బతిన్న శ్రీశైలం ఆనకట్ట భద్రత, పునరుద్ధరణ కోసం రూ.100 కోట్లైనా అవసరమవుతుంది. కుడిగట్టు వైపు అప్రోచ్ రోడ్డు పునరుద్ధరణకే రూ.43.60 కోట్లు అవసరమని ఇంజినీర్లు మూడు సంవత్సరాల కిందటే ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
- ఆనకట్ట దిగువన ఏఫ్రాన్ బలోపేతం, విస్తరణ కోసం మరో రూ.41.30 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. స్పిల్‌వే రక్షణ, కుడి, ఎడమ వైపు కొండ చరియలను సరిచేయడానికి నిధులు అవసరమని కోరారు.
డ్రిప్ - ఉఫ్ :
- దేశంలోని అన్ని డ్యాం భద్రత కోసం కేంద్ర జల వనరుల శాఖ 2020లో ఆనకట్టల పునరుద్ధరణ, మెరుగుదల ప్రాజెక్టు (డ్రిప్) పథకాన్ని అమలు చేసింది. శ్రీశైలం ఆనకట్టకు ఇచ్చేందుకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) ఆమోదం తెలిపింది.
- ప్రపంచ బ్యాంకు నిధులొస్తాయని 2020లో ఏపీ సర్కార్ స్టేట్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ కింద అకౌంట్ ఏర్పాటుకు సిద్ధమైంది.
- సీడబ్ల్యూసీ మాజీ ఛైర్మన్ ఏబీ పాండ్య ఆధ్వర్యంలో ఏర్పాటైన జాతీయ నిపుణుల కమిటీ ప్రతినిధులు 2021, 2022లో రెండుసార్లు శ్రీశైలం ఆనకట్టను సందర్శించి నివేదికలు సిద్ధం చేశారు. వాటి ప్రకారం ఆనకట్ట ఇంజినీర్లు ప్రతిపాదనలు సమర్పించారు. ఇంతవరకు డ్రిప్ నిధుల ఊసే లేకుండాపోయింది.
ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు - స్పిల్ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు
'శ్రీశైలం ప్రాజెక్టుపై నిర్లక్ష్యం ఎందుకు?' - జాతీయ డ్యాం భద్రతా అథారిటీ అసంతృప్తి