Sri Rama Navami Celebrations in AP : రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామనవమి శోభ సంతరించుకుంది. కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ వేద పండితులు, అర్చకుల వేద మంత్రోచ్ఛరణల మధ్య ధ్వజారోహణం నిర్వహించారు. టీటీడీ సిబ్బంది స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. సీతారామలక్ష్మణులను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలివచ్చారు.
అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కోదండ రామస్వామి ఆలయంలోని వేడుకల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి దంపతులు పాల్గొన్నారు. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి కల్యాణం జరిపించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం శ్రీరామపురంలోని శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. మనుమడు విష్ణుబాబు దంపతులతో కలిసి సీతారాముల కల్యాణం నిర్వహించారు.
విజయనగరం జిల్లా రామతీర్థంలో సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా కల్యాణ మండపానికి తీసుకొచ్చి పట్టు వస్త్రాలు, పుష్పాలతో అలంకరించి వైభవోపేతంగా కల్యాణం నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు సీతారాములకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మంత్రి సంధ్యారాణి, ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, బొత్స సత్యనారాయణ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రీకాకుళం పాత మార్కెట్‌లోని రామాలయంలో జగదాభిరాముడి కల్యాణం వైభవంగా నిర్వహించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు జగదభిరాముడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. రాజగోపురం ప్రాంగణంలోని కల్యాణ వేదిక వద్ద శాస్త్రోక్తంగా కల్యాణం జరిపించారు. భక్తులు భారీగా తరలివచ్చి జానకిరాములను దర్శించుకున్నారు.
Sitarama Kalyana Mahotsavam 2025 : గుంటూరు బృందావన్ గార్డెన్స్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు రామాయణ పారాయణం, భజనలు చేశారు. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రథయాత్ర కన్నుల పండువగా సాగింది. రథయాత్రలో భక్తులు భారీగా పాల్గొని జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు.
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో అనంతపురంలో చేపట్టిన శ్రీరామ శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. వేలాది మంది ద్విచక్ర వాహనదారులు ర్యాలీ నిర్వహించారు. శోభాయాత్రలో భాగంగా చేసిన కోలాటం, హనుమంతుడి వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, తెలంగాణ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఇందులో పాల్గొన్నారు. నెల్లూరులోని శబరీ క్షేత్రం వద్ద శ్రీరామనవమి వేడుకలు వైభవంగా సాగాయి. సర్వాంగ సుందరంగా ముస్తాబైన స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా కల్యాణ వేదిక పైకి తీసుకొచ్చి కల్యాణం నిర్వహించారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పట్టాభిరామ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయానికి ఎదురుగా ఉన్న రోడ్డుపై కల్యాణ వేదిక ఏర్పాటు చేసి కల్యాణం క్రతువు నిర్వహించారు. దీనిని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. విశాఖలోని వివిధ ప్రాంతాల్లో జగదభిరాముడి కల్యాణం ఘనంగా నిర్వహించారు. పోలీసు కమిషనరేట్‌లో వేంచేసి ఉన్న జానకీ రామాలయంలో పోలీసులే పెళ్లి పెద్దలుగా కళ్యాణం చేశారు. చెంగలావుపేటలో శ్రీరామనవమి వేడుకల్లో అనేక జంటలు పీటల మీద కూర్చుని కల్యాణ క్రతువుని జరిపాయి. కార్యక్రమానికి వచ్చిన జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ అను జంటలకు వస్త్ర సంచులలను అందించి ప్లాస్టిక్ రహిత విశాఖ ఉద్యమానికి పిలుపునిచ్చారు.
రామనామంతో మార్మోగిన పుణ్యక్షేత్రాలు.. కన్నులపండువగా రాష్ట్రవ్యాప్తంగా కల్యాణోత్సవాలు
నేటి నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. ఏప్రిల్ 5న సీతారాముల కల్యాణ మహోత్సవం