Special Story On youth Love Decisions : ప్రేమ అనేది మ్యాజిక్. ఎప్పుడు ఎవరి పట్ల ఎలా కలుగుతుందో చెప్పలేం అంటారు ప్రేమికులు. ప్రేమ అన్నది ఓ అందమైన భావన. అందులో కలిగే ఆనందం అనంతం అంటారు భావకులు. అందుకేనేమో ప్రేమ చిక్కని మిస్టరీ. వేనవేల నిర్వచనాలున్నా కొత్తవి పుట్టించగలిగే మహత్తరమైన శక్తి ఆ రెండక్షరాల ‘ప్రేమ’కే సాధ్యం. కానీ ప్రేమ విషయంలో ఆలోచనతో అడుగేయడం మంచిది.
ఆకర్షణను ప్రేమగా : ప్రేమించుకోవడం తప్పు కాదు. పరిపక్వత లేని వయసులో ఆకర్షణను ప్రేమ అనుకుంటున్నారు కొంత మంది యువత. అవతలి వ్యక్తులను సరిగా అంచనా వేయక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాన్ని సుఖమయం చేసుకుంటున్న ప్రేమ జంటలు ఎన్నో ఉన్నాయి. కానీ కొంతమంది అవగాహన లేని నిర్ణయాలతో పెళ్లయిన కొద్ది రోజులకే విడిపోతున్నారు. మరోవైపు పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోలేదని అఘాయిత్యాలకు పాల్పడుతూ కన్నవారికి కన్నీళ్లు మిగిల్చుతున్నారు.
ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు
- గతేడాది జూన్ 25న సిరిసిల్ల జిల్లాకు చెందిన యువతి, యువకుడు ఆత్మహత్యాయత్నం చేయగా చికిత్స పొందుతూ మృతి చెందారు.
- అదే ఏడాది నవంబరు 22న తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి, కనగర్తి గ్రామాల మధ్య 22 ఏళ్లలోపున్న ఇద్దరు ప్రేమికులు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
పెళ్లి ఇష్టం లేదని : రెండు నెలల కిందట కరీంనగర్ జిల్లాకు చెందిన యువతి, యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. యువతి కుటుంబ సభ్యులు వచ్చి మాట్లాడిన తరవాత ఆమె తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిపింది. ఆమె మేజర్ కావడంతో పోలీసులు ఒకరోజు సమయమిచ్చారు. మళ్లీ పిలిపించి అడగగా తాను భర్తతోనే వెళ్తానని చెప్పింది. అపరిపక్వతతో తీసుకునే నిర్ణయాలకు ఈ ఘటనే నిదర్శనం.
ప్రేమించే ముందు జీవితంలో ఎదగాలి
- యువత ముందు చదువుపై దృష్టి పెట్టి, జీవితంలో స్థిరపడాలి. అప్పుడే జీవితానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. దీనిపై తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లలకు అవగాహన కలిగించాలి.
- ఆకర్షణ, ప్రేమ మధ్య ఉన్న తేడాను యువత గుర్తించాలి. నిర్ణీత వయసు రాకుండానే ప్రేమ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు.
- యువత ప్రేమ విషయం చెప్పగానే కుటుంబ సభ్యులు వ్యతిరేకించకుండా వారితో చర్చించాలి. వారు ప్రేమించడానికి గల కారణాలు తెలుసుకోవాలి. వారి ఆలోచనలు ఎంత వరకు నిజమో తెలుసుకొని నిర్ణయాలు తీసుకోవాలి.
- ఆకర్షణను ప్రేమ అనుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్న జంటల గురించి తెలియజేయాలి.
- పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు, కుటుంబ బాధ్యతల గురించి చెప్పాలి.
- జీవన గమనంలో ఉండాల్సిన లక్షణాలు, ఎదురయ్యే కష్టనష్టాలు, ఆర్థిక ఇబ్బందులు యువతకు అర్థమయ్యేలా కుటుంబ సభ్యులు అవగాహన కలిగించాలి.
అపహరించారంటూ కేసులు : నెలకు సగటున ఐదు నుంచి ఆరు ప్రేమ జంటలు పెళ్లికి పెద్దలు అంగీకరించడం లేదని ఠాణాల మెట్లు ఎక్కుతున్నాయి. మరోవైపు బాలికలను అపహరించి వివాహం చేసుకున్నారంటూ తల్లిదండ్రులు కేసులు పెడుతున్నారు. గతేడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 162 అపహరణ కేసులు నమోదు కాగా, ఇందులో కన్నవారు పెట్టినవే ఎక్కువ అని పోలీసులు చెబుతున్నారు.
బ్రేకప్ అయిన వాళ్లకూ "వాలెంటైన్స్ డే" - ఇలా సెలబ్రేట్ చేసుకోండి!
ప్రేమకు పెద్దల నో - హోటల్ గదిలో ఆ ఆనంద క్షణమే వారికి చివరిదైంది